Tata Sons Board Meeting: నోయెల్ టాటా వర్సెస్ చంద్రశేఖరన్.. రేపటి బోర్డు మీటింగ్‌లో ఏం జరగబోతోంది?

Tata Sons Board Meeting

Tata Sons Board Meeting

Tata Sons Board Meeting: దేశంలోనే అతిపెద్ద బిజినెస్ సామ్రాజ్యం టాటా గ్రూప్‌లో ఇప్పుడు అందరి చూపు రేపు (నవంబర్ 30) జరగనున్న టాటా సన్స్ బోర్డు మీటింగ్‌పైనే ఉంది. టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా, టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ మధ్య నెలకొన్న విభేదాలు ఏకంగా బాంబే హైకోర్టు గడప తొక్కడంతో ఈ భేటీకి ఎక్కడలేని ప్రాధాన్యత ఏర్పడింది. అసలు ఈ మీటింగ్‌ను ఆపాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు నవంబర్ 27న కొట్టివేయడంతో, రేపు బోర్డు రూమ్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది కార్పొరేట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి నవంబర్ 26నే జరగాల్సిన ఈ సమావేశం, నోటీసు పీరియడ్‌పై నోయెల్ టాటా అభ్యంతరం చెప్పడంతో రేపటికి వాయిదా పడింది.

ఐపీఓ (IPO) విషయంలో ఇద్దరి మధ్య భిన్న వాదనలు

రేపటి సమావేశంలో అతిపెద్ద ఘర్షణ టాటా సన్స్ ఐపీఓ చుట్టూనే తిరగనుంది. రిజర్వ్ బ్యాంక్ (RBI) రూల్స్ ప్రకారం ‘అప్పర్-లేయర్’ ఎన్‌బీఎఫ్‌సీగా ఉన్న టాటా సన్స్ కచ్చితంగా స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అవ్వాల్సి ఉంది. తమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలన్న అభ్యర్థనను సెప్టెంబర్‌లోనే ఆర్‌బీఐ తోసిపుచ్చగా, నవంబర్‌లో మరోసారి లిస్టింగ్ రూల్స్ పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో షేర్ హోల్డర్ల ఫర్మిషన్ వచ్చిన 90 రోజుల్లో సెబీకి డ్రాఫ్ట్ పత్రాలు ఇచ్చి, 180 రోజుల్లో (6 నెలల్లో) ఐపీఓ పూర్తి చేసే రోడ్‌మ్యాప్‌ను చంద్రశేఖరన్ వర్గం రెడీ చేస్తోంది. కానీ, నోయెల్ టాటా మాత్రం ఐపీఓకు ససేమిరా అంటున్నారు. కంపెనీని పబ్లిక్ లిమిటెడ్‌గా మార్చకుండా.. ‘టాటా ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ సొల్యూషన్స్’, ‘టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్’ వంటి సంస్థలను టాటా సన్స్‌లో విలీనం చేసి ప్రైవేట్ కంపెనీగానే ఉంచాలని ఆయన పట్టుబడుతున్నారు. మరోవైపు 18 శాతం వాటా ఉన్న షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ మాత్రం తమ వాటాను క్యాష్ చేసుకునేందుకు ఐపీఓ వైపే మొగ్గు చూపుతోంది.

చంద్రశేఖరన్ మూడో టర్మ్‌పై కొనసాగుతున్న సస్పెన్స్!

ఫిబ్రవరి 2027 నుంచి ప్రారంభం కానున్న చంద్రశేఖరన్ మూడో ఐదేళ్ల పదవీకాలానికి సెప్టెంబర్ 17న జరిగిన బోర్డు భేటీలో ఆమోదం లభించింది. అప్పుడు నోయెల్ టాటా వ్యతిరేకించినా, మరో ట్రస్ట్ నామినీ వేణు శ్రీనివాసన్ మద్దతు తెలపడం, తాత్కాలిక చైర్మన్ హరీశ్ మన్వానీ తన ‘కాస్టింగ్ ఓట్’ (నిర్ణయాత్మక ఓటు) వేయడంతో చంద్రశేఖరన్ గట్టెక్కారు. దీనిపై సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, ఆర్‌డీ టాటా ట్రస్ట్ బాంబే హైకోర్టుకు వెళ్లాయి. ఈ కేసు విచారణ 2027 జనవరి 21కి వాయిదా పడింది. ఇప్పుడు చంద్రశేఖరన్ నియామకానికి షేర్ హోల్డర్ల ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం (EGM) పిలవాలని బోర్డు చూస్తోంది. అయితే, మహారాష్ట్ర చారిటీ కమిషనర్ ఆంక్షల వల్ల సర్ రతన్ టాటా ట్రస్ట్ ప్రతినిధుల నియామకంలో చిక్కులు ఏర్పడ్డాయి. ఈ ‘కోరం’ (కనీస హాజరు) సమస్య వల్లే ఆగస్టులో జరగాల్సిన వార్షిక సమావేశం (AGM) డిసెంబర్ 31 వరకు వాయిదా పడింది. మరి ఏజీఎంనే పెట్టలేకపోయిన టాటా సన్స్, ఇప్పుడు ఈజీఎం ఎలా నిర్వహిస్తుందని నోయెల్ టాటా ప్రశ్నిస్తున్నారు.

ఎయిర్ ఇండియా సహా కీలక కంపెనీలకు భారీ నిధులు

ఒకవైపు నోయెల్ టాటా, చంద్రశేఖరన్ మధ్య విభేదాలు కొనసాగుతుండగానే.. మరోవైపు గ్రూప్‌లోని కీలక కంపెనీలకు కొత్త పెట్టుబడులు అందించే అంశంపై రేపు నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా విమానాల ఆధునీకరణ కోసం భారీగా నిధులు అవసరమైన ఎయిర్ ఇండియా, టెలికాం పరికరాల సంస్థ తేజస్ నెట్‌వర్క్స్, ఈవీ బ్యాటరీల తయారీ సంస్థ అగ్రటాస్‌తో పాటు మరో గ్రూప్ కంపెనీలోకి భారీగా నిధులను మళ్లించేందుకు బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. మొత్తానికి రేపటి బోర్డు మీటింగ్‌లో తీసుకునే ఏ నిర్ణయమైనా బాంబే హైకోర్టు తుది తీర్పుకు లోబడే ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. మరి రేపటి సమావేశంలో ఆర్‌బీఐ రూల్స్ ప్రకారం ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేక నోయెల్ టాటా సూచించిన రీస్ట్రక్చరింగ్ వైపు మొగ్గు చూపుతారా? అన్నది తేలిపోనుంది.