October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..

Upi

Upi

October 15: దేశవ్యాప్తంగా టీ కొట్టు నుంచి పెద్ద మాల్స్ వరకు విస్తరించిన యూపీఐ పేమెంట్స్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. రూ.2,000 దాటిన యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీలను వర్తింపజేస్తూ కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే ఈ నిర్ణయంతో వ్యాపార వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో, మళ్లీ ‘క్యాష్ రాజ్’ మొదలవుతుందన్న అంచనాల నడుమ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అత్యవసర చర్యలకు ఉపక్రమించింది. అక్టోబర్ 15 నుంచి దేశంలోని అన్ని ఏటీఎంలలో తగినంత నగదు నిల్వలు ఉండేలా చూడాలని బ్యాంకులను ఆర్థిక శాఖ, ఆర్బీఐ ఆదేశించడం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఆర్బీఐ ఎందుకు అప్రమత్తమైందంటే

డిజిటల్ విప్లవంతో భారత్‌లో నగదు చలామణి గణనీయంగా తగ్గింది. అయితే, రూ.2,000 పైబడిన డిజిటల్ చెల్లింపులపై 0.4 శాతం భారం పడనుండటంతో, ఆ రుసుముల నుంచి తప్పించుకునేందుకు వ్యాపారులు కస్టమర్ల నుంచి తిరిగి ‘క్యాష్’ మాత్రమే తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామం వల్ల అక్టోబర్ 15 తర్వాత మార్కెట్‌లో ఒక్కసారిగా నగదుకు విపరీతమైన డిమాండ్ పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రజలు ఏటీఎంల వద్ద బారులు తీరే పరిస్థితి తలెత్తితే కరెన్సీ కొరత రాకుండా ఉండేందుకే, ముందస్తు జాగ్రత్తగా అన్ని బ్యాంకుల ఏటీఎంలలో సరిపడా నగదు నిల్వలు సిద్ధంగా ఉంచాలని ఆర్బీఐ కఠిన ఆదేశాలు జారీ చేసింది.

ఈ కొత్త నిబంధనలపై సామాన్యుల్లో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..

* సామాన్యులకు ఊరట (P2P ఫ్రీ): స్నేహితులు, బంధువులు లేదా ఇతర వ్యక్తులకు వ్యక్తిగతంగా (Person to Person) యూపీఐ ద్వారా ఎంత మొత్తం బదిలీ చేసినా ఒక్క పైసా కూడా ఛార్జీ ఉండదు. వినియోగదారులు సాధారణంగా చేసుకునే లావాదేవీలు యథావిధిగా పూర్తిగా ఉచితం.

* మర్చెంట్లకు మాత్రమే పన్ను పోటు (P2M): కేవలం రిజిస్టర్డ్ వ్యాపారులకు (Merchants) యూపీఐ ద్వారా చేసే రూ.2,000 పైబడిన చెల్లింపులకు మాత్రమే 0.4 శాతం ఎండీఆర్ వర్తిస్తుంది. ఈ మొత్తాన్ని కస్టమర్ నుంచి కాకుండా, సదరు వ్యాపారి బ్యాంక్ ఖాతా నుంచే బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు నేరుగా కట్ చేసుకుంటాయి.

అలాగే భారీ విలువ ఉండే కీలక రంగాలకు 0.4 శాతం నిబంధన నుంచి కేంద్రం ఊరట కల్పించింది:

* రైల్వే టికెట్ల బుకింగ్

* టెలికాం బిల్లుల చెల్లింపులు

* ఇన్సూరెన్స్ ప్రీమియంలు

* పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన కొనుగోళ్లు

ఈ నిర్దిష్ట సేవల కోసం యూపీఐ ద్వారా రూ.2,000 దాటి ఎంత పెద్ద మొత్తం చెల్లించినా, వ్యాపారికి కేవలం రూ.5 మాత్రమే స్థిర ఛార్జీగా పడుతుంది. ఉదాహరణకు, రూ.75,000 విలువైన బీమా ప్రీమియంను యూపీఐ ద్వారా కట్టినా వ్యాపారి ఖాతా నుంచి కేవలం రూ.5 మాత్రమే కట్ అవుతుంది.

డిజిటల్ ప్రయాణంలో తాత్కాలిక బ్రేకులు?

డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత పారదర్శకంగా, సాంకేతికంగా నిలకడగా నడిపేందుకే ఈ మర్చెంట్ ఛార్జీలను తీసుకొచ్చామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. చిన్న, మధ్యతరహా వ్యాపారులు తమ మార్జిన్లు దెబ్బతింటాయన్న భయంతో “యూపీఐ వద్దు.. క్యాషే ముద్దు” అనే నినాదంతో బోర్డులు పెట్టే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా, అక్టోబర్ 15 తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు చలామణి ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.