Meta: సోషల్ మీడియా దిగ్గజం, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృసంస్థ ‘మెటా’ (Meta) ప్రపంచ కార్పొరేట్ చరిత్రలోనే ఎన్నడూ ఎరుగని భారీ సంక్షోభంలో పడింది. పిల్లలను తమ యాప్స్‌కు బానిసలుగా మార్చారనే తీవ్ర ఆరోపణలపై అమెరికాలోని నాలుగు రాష్ట్రాలు మెటా సంస్థపై ఏకంగా 1.4 ట్రిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 120 లక్షల కోట్లు) జరిమానా విధించాలని కోర్టును ఆశ్రయించాయి. టెక్నాలజీ ఇండస్ట్రీ చరిత్రలోనే ఇంతపెద్ద మొత్తంలో పెనాల్టీ డిమాండ్ చేయడం ఇదే తొలిసారి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ప్రస్తుతం మెటా సంస్థ మొత్తం మార్కెట్ విలువే (Market Cap) 1.5 ట్రిలియన్ డాలర్లు కాగా, అందులో దాదాపు 90 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని జరిమానా రూపంలో డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసు విచారణ ఆగస్టులో కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో జరగనుంది.
పిల్లలను అడిక్ట్ చేసేలా ప్లాన్.. అసలు ఆరోపణలు ఏంటంటే
ఇది కేవలం అకౌంట్ హ్యాకింగ్ లేదా డేటా లీక్‌కు సంబంధించిన సాధారణ కేసు కాదు. పిల్లలు, టీనేజర్ల మానసిక జీవితాలతో ఆడుకున్నారనేది ప్రధాన ఆరోపణ. కాలిఫోర్నియా, కొలరాడో, కెంటుకీ, న్యూజెర్సీ రాష్ట్రాలు దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం.. పిల్లలు, యువత ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ యాప్‌ల నుంచి బయటకు రాకుండా, ఎక్కువ సమయం స్క్రీన్‌లకే అతుక్కుపోయేలా మెటా సంస్థ తన అల్గారిథమ్‌లను ఉద్దేశపూర్వకంగా డిజైన్ చేసింది. తమ ప్లాట్‌ఫారమ్‌లు చాలా సురక్షితమైనవని మెటా బయటకు నమ్మబలికింది. కానీ, అంతర్గతంగా ఈ యాప్స్ వల్ల పిల్లలకు జరుగుతున్న నష్టంపై కంపెనీకి ముందే పూర్తి సమాచారం ఉందని ఈ రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. ఎండ్‌లెస్ స్క్రోలింగ్ ఫీడ్, నోటిఫికేషన్ అలర్ట్స్, లైక్ సిస్టమ్, రికమెండేషన్ అల్గారిథమ్స్ వంటివన్నీ పిల్లలను అడిక్ట్ చేయడానికే పెట్టారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనివల్ల లక్షలాది మంది పిల్లల్లో తీవ్ర ఆందోళన (Anxiety), డిప్రెషన్, నిద్రలేమి, సోషల్ మీడియా వ్యసనం వంటి మానసిక సమస్యలు పెరిగాయని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ 4 రాష్ట్రాలతో పాటు మరో 14 రాష్ట్రాలు కూడా మెటాపై విడివిడిగా చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నాయి.
భారత్ నుంచి కూడా మెటాకు నోటీసులు..
ఇదే సమయంలో మెటాకు భారత్ నుంచి కూడా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ సెక్సువల్ కంటెంట్ (పిల్లల అశ్లీల కంటెంట్) సర్క్యులేట్ అవుతోందన్న ఆరోపణలపై భారత ప్రభుత్వం మెటాకు నోటీసులు పంపింది. బ్రిటన్ వార్తాసంస్థ బీబీసీ చేసిన ఇన్వెస్టిగేషన్‌లో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌ను విక్రయిస్తున్నట్లు బయటపడింది. దీనిపై వివరణ ఇవ్వాలని భారత ఐటీ శాఖ నోటీసులు పంపినప్పటికీ, మెటా నుంచి ఇంకా ఎలాంటి స్పష్టమైన సమాధానం రాలేదు.
ఆరోపణలను కొట్టిపారేసిన మెటా..
ఈ రూ.120 లక్షల కోట్ల భారీ పెనాల్టీ డిమాండ్‌ను మెటా తీవ్రంగా ఖండించింది. సోషల్ మీడియా అడిక్షన్ అనేది అధికారికంగా ఎలాంటి మానసిక వ్యాధి కాదని, తాము కావాలనే లూప్స్ క్రియేట్ చేశామనడం అబద్ధమని వాదించింది. యువత రక్షణ కోసం తాము ఇప్పటికే ఎన్నో సేఫ్టీ ఫీచర్లను తీసుకొచ్చామని, ఈ భారీ జరిమానా డిమాండ్‌కు ఎలాంటి బలమైన ఆధారం లేదని కంపెనీ స్పష్టం చేసింది. మెటా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో న్యూ మెక్సికోలో జరిగిన ట్రయల్‌లో జ్యూరీ మెటాకు 375 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. అమెరికాలో వేలాది కుటుంబాలు, పాఠశాలలు మెటాతో పాటు టిక్‌టాక్, యూట్యూబ్, స్నాప్‌చాట్ కంపెనీలపై కోర్టుల్లో పోరాడుతున్నాయి. ఒకవేళ ఆగస్టులో జరగబోయే విచారణలో కోర్టు గనుక ఈ రాష్ట్రాలకు అనుకూలంగా తీర్పు ఇస్తే.. అది మెటా పతనానికి దారితీయడమే కాకుండా, ప్రపంచ టెక్ ఇండస్ట్రీలోనే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో మిగిలిన సోషల్ మీడియా సంస్థలు కూడా తమ యాప్ డిజైన్లను మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు.

