LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!

Lpg Gas Cylinder

Lpg Gas Cylinder

LPG Subsidy: దేశంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు, ముఖ్యంగా గృహిణులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వంటింట్లో పొగ సెగలు తగ్గించి, ఆడబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా అమలవుతున్న ప్రతిష్టాత్మక ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ (PMUY) పథకంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సిలిండర్‌పై అందిస్తున్న రూ.300 రాయితీని (సబ్సిడీ) 2026-27 ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగించనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా, ఈ పథకం పరిధిని మరింత విస్తరిస్తూ కొత్తగా మరో 25 లక్షల మంది నిరుపేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాధారణంగా ఎల్పీజీ కనెక్షన్ తీసుకోవాలంటే సెక్యూరిటీ డిపాజిట్, ఇతర ఛార్జీల రూపంలో వేల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది.

అయితే ఉజ్వల పథకం కింద అర్హులైన పేద మహిళలకు ఉచిత గ్యాస్ స్టవ్, మొదటి సిలిండర్‌ను కేంద్రమే ఫ్రీగా అందిస్తుంది. ఆ తర్వాత చేయించే ప్రతి రీఫిల్లింగ్‌పై లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా రూ.300 సబ్సిడీని జమ చేస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 42 కోట్ల రీఫిల్స్‌కు ఈ రాయితీ సొమ్మును అందించిన కేంద్రం, రాబోయే ఏడాదిలోనూ ఈ ప్రయోజనాన్ని యథాతథంగా కొనసాగించనుంది. కేవలం పెద్ద సిలిండర్లకే కాకుండా, చిన్న కుటుంబాల కోసం ఇచ్చే 5 కిలోల సిలిండర్లపై కూడా దామాషా పద్ధతిలో ఈ సబ్సిడీ వర్తిస్తుండటం గమనార్హం. 2016 మే 1న ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో ప్రధాని నరేంద్ర మోడీ స్టార్ట్ చేసిన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 10.57 కోట్ల మంది మహిళలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్లు అందాయి. తాజాగా మరో 25 లక్షల కొత్త కనెక్షన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఇంకా గ్యాస్ పొందని అర్హులైన మహిళలకు సువర్ణావకాశం దక్కనుంది.

కొత్త కనెక్షన్లకు అర్హతలు ఇవే..

*అర్హతలు: దరఖాస్తుదారు మహిళ అయి ఉండాలి. వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి. తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి.

* కావాల్సిన పత్రాలు: ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, రేషన్ కార్డు కాపీ.

* దరఖాస్తు విధానం: అర్హులైన మహిళలు ఉజ్వల యోజన అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో తమకు నచ్చిన గ్యాస్ కంపెనీని (ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్‌పీ) ఎంచుకుని అప్లై చేసుకోవచ్చు. లేదా నేరుగా స్థానిక ఎల్పీజీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఏజెన్సీని సంప్రదించి అవసరమైన పత్రాలు అందజేసి ఉచిత కనెక్షన్ పొందవచ్చు.

వంటింటి బడ్జెట్ భారం పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో, సిలిండర్ రీఫిల్లింగ్‌పై రూ.300 సబ్సిడీ కొనసాగించడం గ్రామీణ, పేద కుటుంబాలకు ఆర్థికంగా కొండంత భరోసానివ్వనుంది.