Lalithaa Jewellery IPO: లలితా జ్యువెల్లరీ IPO వచ్చేసింది.. షేర్ ధర ఎంతంటే?

Lalithaa Jewellery Ipo

Lalithaa Jewellery Ipo

Lalithaa Jewellery IPO: లలితా జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్‌ త్వరలో స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ ఐపీఓ ప్రైస్‌ బ్యాండ్‌ను ఒక్కో షేరుకు రూ.190–రూ.201గా నిర్ణయించింది. ఐపీఓ ఆగస్టు 17, 2026న ప్రారంభమై.. ఆగస్టు 19న ముగియనుంది. పెట్టుబడిదారులు కనీసం 74 షేర్ల లాట్‌కు బిడ్‌ చేయాల్సి ఉంటుంది. ఒక్కో షేర్‌ ముఖ విలువ రూ.5గా ఉంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.1,200 కోట్ల వరకు తాజా షేర్లను జారీ చేయనుంది. మరోవైపు కంపెనీ ప్రమోటర్‌ ఎం.కిరణ్‌ కుమార్‌ జైన్‌ రూ.500 కోట్ల విలువైన షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (OFS) ద్వారా విక్రయించనున్నారు.

51 నగరాల్లో 61 స్టోర్లు

లలితా జ్యువెలరీ దక్షిణ భారతదేశంలో ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్‌గా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ‘Lalithaa’ బ్రాండ్‌ పేరుతో బంగారం, వెండి, వజ్రాభరణాలను విక్రయిస్తోంది. మార్చి 31, 2026 నాటికి కంపెనీకి 51 నగరాల్లో మొత్తం 61 స్టోర్లు ఉన్నాయి. ఇవి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరిల్లో విస్తరించాయి. ఈ స్టోర్ల మొత్తం ఆపరేషనల్‌ ఏరియా సుమారు 6.50 లక్షల చదరపు అడుగులు. ముఖ్యంగా టియర్‌-2, టియర్‌-3 నగరాలపై కంపెనీ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. మొత్తం 61 స్టోర్లలో 45 స్టోర్లు చిన్న నగరాల్లోనే ఉన్నాయి. FY26లో ఈ స్టోర్ల ద్వారా కంపెనీ ఆదాయంలో సుమారు 60.25 శాతం వచ్చింది. లలితా జ్యువెలరీకి సొంతంగా ఆభరణాల తయారీ సామర్థ్యం కూడా ఉంది. తమిళనాడులో కంపెనీ రెండు తయారీ కేంద్రాలను నిర్వహిస్తోంది. చెన్నైలోని తిరుముడివక్కంలో ఉన్న యూనిట్‌ 43,862 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. మరో యూనిట్‌ కాంచీపురంలోని మరైమలైలో ఉంది. సొంత తయారీ కారణంగా పోటీ ధరలకు ఆభరణాలను అందించగలుగుతున్నామని కంపెనీ చెబుతోంది.

భారీగా పెరిగిన ఆదాయం, లాభం
కంపెనీ ఆర్థిక గణాంకాలు కూడా గణనీయమైన వృద్ధిని చూపిస్తున్నాయి. FY24లో రూ.16,788.05 కోట్లుగా ఉన్న ఆపరేషనల్‌ రెవెన్యూ.. FY26లో రూ.25,023.93 కోట్లకు చేరింది. ఇదే సమయంలో నికర లాభం రూ.359.83 కోట్ల నుంచి రూ.1,009.82 కోట్లకు పెరిగింది. ఐపీఓలో నికర ఆఫర్‌లో గరిష్ఠంగా 50 శాతం క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్లకు (QIB), కనీసం 15 శాతం నాన్‌-ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు, కనీసం 35 శాతం రిటైల్‌ ఇన్వెస్టర్లకు కేటాయించనున్నారు. ఆనంద్ రాఠీ అడ్వైజర్స్ లిమిటెడ్ (Anand Rathi Advisors), ఈక్విరస్ క్యాపిటల్ లిమిటెడ్ (Equirus Capital) లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తుండగా.. ఎంయూఎఫ్‌జీ ఇంటైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (MUFG Intime India) ఈ ఐపీఓకు రిజిస్ట్రార్‌గా ఉంది.