Colonel Sanders: 60 ఏళ్ల వయసులో రూ. 9 వేల పెన్షన్‌తో మొదలైన బిలియన్ డాలర్ల సామ్రాజ్యం.. కేఎఫ్‌సీ పెద్దాయన కథ ఇదే!

Kfc

Kfc

Colonel Sanders: ఒక వ్యక్తి జీవితంలో ఎన్నిసార్లు ఓడిపోవచ్చు.. ఒకటి, రెండా.. లేక పది సార్ల? కానీ మనం చెప్పుకుంటున్నా ఈ కథలోని పెద్దాయన 60 ఏళ్ల వయసు వచ్చే వరకు ముట్టిన ప్రతి వ్యాపారంలోనూ నష్టపోయాడు. వ్యాపారం అచ్చి రావడం లేదని ఉద్యోగం చేసుకొందామని నిర్ణయించుకొని పనికి పోతే అక్కడి నుంచి కూడా తరిమేయబడ్డాడు. ఆఖరికి అరవై ఏళ్ల వయసులో చేతిలో కేవలం 105 డాలర్ల (సుమారు రూ. 9,000) పెన్షన్‌తో ప్రపంచమే అబ్బురపడేలా ఒక బిలియన్ డాలర్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు. నిజానికి చాలా మందికి కలలో కూడా అలాంటి ఒక అద్భుతమైన స్వప్నాన్ని కనడానికి సాధ్యపడదు. కానీ ఈ పెద్దాయన దానిని సాధ్యం చేసి చూపించాడు. ఇంతకీ ఆ పెద్దాయన ఎవరో తెలుసా.. ఆయన మనందరికీ కేఎఫ్‌సీ (KFC) తాతగా పరిచయమైన కల్నల్ హార్లాండ్ సాండర్స్. చిరునవ్వుతో, తెల్లటి గడ్డంతో KFC బకెట్లపై కనిపించే ఆయన ముఖం వెనుక ఉన్నది కేవలం ఒక బ్రాండ్ ఇమేజ్ మాత్రమే కాదు.. అంతకంటే దారుణమైన పరాజయాలను, దురదృష్టాన్ని ఎదిరించి నిలిచిన ఒక అకుంఠిత దీక్షా ప్రయాణం. ఆయన కథ ఏంటో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.

ఆరేళ్ల ప్రాయంలోనే మొదలైన పోరాటం
1890లో అమెరికాలోని ఇండియానాలో జన్మించిన హార్లాండ్ సాండర్స్ జీవితం చిన్నతనం నుంచే ఒడిదుడుకులతో సాగింది. ఆరేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. తల్లి పనికి వెళ్తుండటంతో, తమ్ముడు, చెల్లెలి కోసం ఆ వయసులోనే వంట చేయడం నేర్చుకున్నాడు. యుక్త వయస్సు రాకముందే చదువు ఆపేసి ఇల్లు వదిలి బయటికి వచ్చేశాడు. 17 ఏళ్ల లోపే సైన్యంలో చేరి, మళ్లీ అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. తర్వాత భవిష్యత్తు ఉంటుందన్న ఆశతో రైల్వేలో చేరాడు. అక్కడ ఇంజిన్ల నుంచి బూడిదను శుభ్రం చేసే సాధారణ కార్మికుడిగా చేరి, ఫైర్‌మ్యాన్‌గా పదోన్నతి పొందాడు. కానీ తనకున్న విపరీతమైన కోపం కారణంగా అధికారులతో గొడవపడి ఉద్యోగం కోల్పోయాడు. ఆ తర్వాత ఇల్లినాయిస్ సెంట్రల్ రైల్‌రోడ్‌లో వచ్చిన మరో ఉద్యోగాన్ని కూడా గొడవల వల్లే పోగొట్టుకున్నాడు. సాండర్స్ 20, 30 ఏళ్ల వయసంతా కోల్పోయిన ఉద్యోగాలు, నష్టపోయిన వ్యాపారాలతోనే గడిచింది. న్యాయవాదిగా మారినా క్లయింట్‌తోనే కోర్టులో గొడవపడి ఆ వృత్తిని వదిలేశాడు. ఇన్సూరెన్స్ ఉద్యోగం చేస్తే అక్కడి నుంచి కూడా తీసేశారు. ఓహియో నదిపై ఫెర్రీ బోట్ సర్వీస్ స్టార్టప్ పెడితే, పక్కనే వంతెన రావడంతో ఆ వ్యాపారం మూతపడింది. నూనె దీపాల వ్యాపారం పెడితే, గ్రామీణ ప్రాంతాలకు కరెంట్ రావడంతో అదీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

×
×
Ad

సాండర్స్ సక్సెస్ మంత్ర
వరుస వైఫల్యాలు ఎదురైనా సాండర్స్ ఎప్పుడూ నిరాశ చెందలేదు. దీనికి కారణం ఆయన తన జీవితంలో రెండు నియమాలను పెట్టుకోవడమే అని చెబుతారు. “మీరు చేయగలిగినదంతా చేయండి, అలాగే మీరు చేయగలిగినంత ఉత్తమంగా చేయండి”. ఈ నియమాలు ఆయనను ఎప్పుడూ నిరాశలో కూరుకుపోకుండా అడ్డుగోడలా నిలబడ్డాయని చెబుతారు. 1927లో ఆయన ఒక గ్యాస్ సర్వీస్ స్టేషన్‌ను రన్‌ చేయడం స్టార్ట్ చేశారు. కానీ 1930 నాటి ప్రపంచ మహా మాంద్యం కారణంగా దాన్ని కూడా మూసివేయాల్సి వచ్చింది. అయితే ఈ పరాజయమే కేఎఫ్‌సీ సామ్రాజ్యానికి పునాది వేసింది. కార్బిన్‌ (కెంటకీ) లో తన రెండో సర్వీస్ స్టేషన్ ప్రారంభించి, అక్కడ వచ్చే ట్రక్ డ్రైవర్ల కోసం తాను ఇంట్లో తయారుచేసిన ప్రత్యేకమైన ‘ఫ్రైడ్ చికెన్’ అమ్మడం స్టార్ట్ చేశారు ఆయన.

వెంటాడిన దురదృష్టం..
ఆయన చేసిన చికెన్ రుచి బాగా నచ్చడంతో 1935లో అప్పటి గవర్నర్ రూబీ లాఫూన్ ఆయనకు ‘కెంటకీ కల్నల్’ అనే గౌరవ బిరుదును కూడా ఇచ్చారు. కానీ, దురదృష్టం, దరిద్రం ఆయనను అప్పటికి ఇంకా వదల్లేదు. 49 ఏళ్ల వయసులో ఒక హోటల్‌ను కొనుగోలు చేస్తే.. రెండో ప్రపంచ యుద్ధం వల్ల పర్యాటకం దెబ్బతిని దాన్ని అమ్మేయాల్సి వచ్చింది. అంతటితో ఆగకుండా, 1939లో ఆయన నడుపుతున్న కేఫ్ అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలి బూడిదైంది. కానీ సాండర్స్ ఓటమికి లొంగిపోలేదు. ఆ కాలిపోయిన చోటే మరింత పెద్ద రెస్టారెంట్‌ను నిర్మించారు. వంట వేగంగా అవ్వడం కోసం చికెన్‌ను ‘ప్రెషర్-ఫ్రై’ చేసే సరికొత్త పద్ధతిని కనిపెట్టారు. ఇదే కేఎఫ్‌సీ సక్సెస్‌కు మైల్ స్టోన్‌గా మారింది.

60 ఏళ్ల వయసులో రోడ్డున పడ్డ జీవితం
1956లో ప్రభుత్వం వారి హోటల్ మీదుగా వెళ్లే కొత్త హైవే రోడ్డును మంజూరు చేసింది. బైపాస్ రోడ్డు రావడంతో కస్టమర్లు రావడం ఆగిపోయి, వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. ఆఖరికి తన 60 ఏళ్ల వయసులో వ్యాపారాన్ని అమ్మేసి.. నెలకు వచ్చే కేవలం 105 డాలర్ల సామాజిక భద్రతా (పెన్షన్) చెక్కుతో రోడ్డున పడ్డారు. ఆ వయసులో ఎవరైనా అయితే జీవితం అయిపోయిందని విశ్రాంతి తీసుకుంటారు. కానీ సాండర్స్ తన తలరాతను ఎదురించాలని నిర్ణయించుకున్నాడు. చివరి ప్రయత్నంగా ఆ పెన్షన్ డబ్బులతో సరికొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేశాడు.

చివరకు వరించిన బిలియన్ డాలర్ల విజయం
సాండర్స్ తన రహస్య మసాలా దినుసుల ఫార్ములాను, పేటెంట్ పొందిన ప్రెషర్ కుకింగ్ పద్ధతిని పట్టుకుని అమెరికా అంతటా తిరుగుతూ ఫ్రాంచైజీల కోసం ప్రయత్నించారు. ఎన్నో తిరస్కరణల తర్వాత, ఆయన ఆలోచన క్లిక్ అయ్యింది. రెస్టారెంట్లు వారు అమ్మే ప్రతి చికెన్‌పై సాండర్స్‌కు 5 సెంట్లు రాయల్టీగా ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. 1963 నాటికి (ఆయన వయసు 66 ఏళ్లు) కెనడా, యూకే, మెక్సికోలలో కలిపి ఏకంగా 600 కేఎఫ్‌సీ అవుట్‌లెట్లు ఏర్పడ్డాయి. వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంతో, 1964లో సాండర్స్ ఆ వ్యాపారాన్ని పెట్టుబడిదారులకు 2 మిలియన్ డాలర్లకు విక్రయించారు. 1970 నాటికి 48 దేశాలలో 3,000 రెస్టారెంట్లు ఏర్పాటయ్యాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా 118 దేశాలలో సుమారు 20,000కు పైగా కేఎఫ్‌సీ అవుట్‌లెట్‌లు ఉన్నాయి. ఇప్పుడు ఆ పెద్దాయన స్థాపించిన కేఎఫ్‌సీ అనేది బిలియన్ డాలర్ల సామ్రాజ్యంగా ఎదిగింది.

ఇదే యువతకు సందేశం
విజయం సాధించడానికి వయసుతో కానీ, మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులతో కానీ సంబంధం లేదని కల్నల్ సాండర్స్ జీవితం నిరూపించింది. ఆర్థిక ఇబ్బందులు, వరుస పరాజయాలు ఎదురైనా పట్టువదలకుండా ప్రయత్నిస్తే ఏ వయసులోనైనా చరిత్ర సృష్టించవచ్చని ఆయన కథ మనకు నేర్పుతుంది. మీరు కూడా మీ జీవితంలో లేదా వ్యాపారంలో కొత్త అడుగు వేయాలనుకుంటున్నారా? ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేయకండి.. ఎందుకంటే పట్టుదలే విజయానికి మొదటి మెట్టు అని ఆయన జీవితం మనకు చెబుతుంది. ఆలోచనలకు ఆచరణ రూపం ఇవ్వండి, అలాగే సక్సెస్‌ను మిమ్మల్ని వెతుక్కుంటూ రావడానికి కాస్త సమయం ఇవ్వండి.