Mahendra Nahata: స్టాక్ మార్కెట్ అంటేనే రిస్క్‌తో కూడిన వ్యాపారం అంటారు. కానీ, సరైన సమయంలో సరైన కంపెనీని గుర్తిస్తే అది ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చెప్పడానికి రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది. ఇంకా స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కాకముందే.. ఈ కంపెనీ నమ్ముకున్న ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిపిస్తోంది. టెలికాం రంగంలో సీనియర్ వ్యాపారవేత్త, హెచ్‌డీఎఫ్‌సీ ప్రమోటర్ అయిన మహేంద్ర నహతా ఒక రికార్డ్ సృష్టించారు. ఆయన జియోలో కేవలం రూ.10 ధరకే కొనుగోలు చేసిన ఒక షేరు విలువ.. ఇప్పుడు ఏకంగా 100 రెట్లకు పైగా పెరిగి మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
రూ.48 కోట్ల పెట్టుబడి.. రూ.5,800 కోట్లుగా
16 ఏళ్ల క్రితం రిలయన్స్ సంస్థ టెలికాం రంగంలోకి అడుగుపెట్టడంలో మహేంద్ర నహతా కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత 2020 జూలైలో జియో ప్లాట్‌ఫామ్స్ ప్రపంచ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సేకరించిన సమయంలో.. నహతా కుటుంబానికి సుమారు రూ.37 కోట్ల ($4.4 మిలియన్లు) విలువైన కన్వర్టిబుల్ డిబెంచర్లను కేటాయించారు. ఆ తర్వాత రిలయన్స్ అదనపు షేర్లను కేటాయించడంతో కంపెనీలో వారి వాటా 0.54 శాతానికి (కచ్చితంగా చెప్పాలంటే 0.536%) చేరింది. ఇందుకోసం నహతా కుటుంబం మొత్తం రూ.48 కోట్లు పెట్టుబడి పెట్టింది. అప్పట్లో వారు ఒక్కో షేరును కేవలం రూ.10 ముఖ విలువతోనే సొంతం చేసుకున్నారు. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ‘మోతీలాల్ ఓస్వాల్’ తాజా అంచనా ప్రకారం.. ప్రస్తుతం జియో ప్లాట్‌ఫామ్స్ మార్కెట్ విలువ సుమారు $114 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో లక్షల కోట్లు). ఈ లెక్కన మహేంద్ర నహతాకు ఉన్న 0.54 శాతం వాటా విలువ ఇప్పుడు ఏకంగా రూ.5,800 కోట్లకు చేరింది. అంటే పెట్టిన పెట్టుబడికి వంద రెట్లకు పైగా లాభం వచ్చి చేరింది. దీర్ఘకాలిక పెట్టుబడి ఎంతటి భారీ లాభాలను తెచ్చిపెడుతుందనే దానికి ఇదే నిదర్శనం అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
త్వరలోనే జియో ఐపీఓ
మరోవైపు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియో ప్లాట్‌ఫామ్స్ స్టాక్ మార్కెట్ ఎంట్రీకి సర్వం సిద్ధం చేసుకుంటోంది. రిలయన్స్ 49వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఐపీఓపై కీలక అప్‌డేట్ ఇచ్చారు. “పాత, కొత్త పెట్టుబడిదారులందరికీ నేను హామీ ఇస్తున్నాను.. జియోకు అత్యంత ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మార్కెట్ నివేదికల ప్రకారం.. జియో ప్లాట్‌ఫామ్స్ ఈ ఐపీఓ ద్వారా ఒక్కో షేరుకు రూ.10 ముఖ విలువతో సుమారు 270 మిలియన్ల కొత్త షేర్లను జారీ చేసే అవకాశం ఉంది. ఈ ప్రక్రియలో మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ తనకున్న వాటాను 66.43% నుంచి సుమారు 64.5%కి తగ్గించుకోనుంది. అయితే ఈ ఐపీఓకు సంబంధించిన తుది పరిమాణం, ప్రైస్ బ్యాండ్ వివరాలు అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. ఏదేమైనా ఐపీఓ కంటే ముందే జియో సృష్టించిన ఈ వెల్త్ క్రియేషన్ ఇప్పుడు దలాల్ స్ట్రీట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

