Site icon NTV Telugu

Jeff Bezos Marriage: అమెజాన్ వ్యవస్థాపకుడు రెండో పెళ్లి.. క్రిస్మస్ రోజున ప్రియురాలితో వివాహం

Jeffbezos

Jeffbezos

ప్రపంచ కుబేరుడు, అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ (60) లేటు వయసులో మళ్లీ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ప్రియురాలు లారెన్‌ శాంచెజ్‌ (54)ను త్వరలోనే ఆయన వివాహం చేసుకోనున్నారు. క్రిస్మస్‌ రోజున వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. అతికొద్ది మంది స్నేహితుల మధ్య ఈ పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

శీతాకాలంలో ఈ జంట పెళ్లితో ఒక్కటి కాబోతుంది. కొలరాడోలోని ఆస్పెన్‌లో కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో డిసెంబరు 25న వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. గతేడాది మే నెలలో వీరు నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఫ్రాన్స్‌లో వెకేషన్‌కు వెళ్లిన సందర్భంలో ఓ లగ్జరీ నౌకలో 2.5 మిలియన్‌ డాలర్ల గులాబీ రంగు వజ్రాల ఉంగరం ఇచ్చి బెజోస్‌.. ప్రియురాలికి ప్రపోజ్‌ చేసినట్లు తెలుస్తోంది. 54 ఏళ్ల లారెన్‌ శాంచెజ్‌ గతంలో జర్నలిస్టుగా పనిచేశారు. లారెన్ శాంచెజ్.. తన భర్తకు విడాకులు ఇవ్వకముందు నుంచే ఈ వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం.

2018 నుంచే బెజోస్‌, లారెన్‌ డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే 2019 వరకు ఆ విషయం బయటకు రాలేదు. అదే ఏడాది బెజోస్‌ తన భార్య మెకంజీ స్కాట్‌తో ఉన్న 25 ఏళ్ల బంధానికి స్వస్తి పలికారు. మెకంజీతో ఆయనకు నలుగురు సంతానం ఉన్నారు. ఈ విడాకుల ప్రక్రియ పూర్తయ్యే వరకు లారెన్‌ , బెజోస్‌.. తమ మధ్య బంధాన్ని బయటకు అధికారికంగా వెల్లడించలేదు. మరోవైపు, లారెన్‌కు గతంలో పాట్రిక్‌ వైట్‌సెల్‌ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మాజీ ఎన్‌ఎఫ్‌ఎల్‌ ఆటగాడు టోనీ గోంజలెజ్‌తోనూ ఆమె ఓ కుమారుడికి జన్మనిచ్చారు. ఇదిలా ఉంటే లారెన్ తన మాజీ భర్తలను, పిల్లలను బెజోస్‌కు ముందుగానే పరిచయం చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి.

Exit mobile version