NTV Telugu Site icon

Tower Semiconductor: భారత్‌లో ఇజ్రాయిల్ “సెమీకండక్టర్” కంపెనీ ప్లాంట్.. 8 బిలియన్ డాలర్ల పెట్టుబడికి ప్రణాళిక..

Tower Semiconductor

Tower Semiconductor

Tower Semiconductor: భారతదేశం సెమీకండక్టర్ తయారీ పరిశ్రమల్లో పురోగమించాలనే ప్రధాని నరేంద్రమోడీ లక్ష్యానికి అనుగుణంగా పలు దిగ్గజ సెమీకండక్టర్ కంపెనీలు ఇండియాలో తన ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పటికే యూఎస్ చిప్ మేకర్ మైక్రాన్ టెక్నాలజీ గుజరాత్‌లో అసెంబ్లీ, టెస్ట్ ఫెసిలిటీని స్థాపించడానికి 825 మిలియన్ల పెట్టుబడిని ప్రకటించింది. ఫేజ్-1, ఫేజ్-2లుగా ఈ సంస్థ ప్లాంట్ సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి మైక్రాన్ తన తొలి చిప్ విడుదల చేస్తుందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Read Also: Pakistan Elections: ముగిసిన ఓట్ల లెక్కింపు.. “బ్యాట్” లేకున్నా సెంచరీ కొట్టిన ఇమ్రాన్ ఖాన్.. సంకీర్ణ ప్రభుత్వమే..

ఇదిలా ఉంటే, తాజాగా ఇజ్రాయిల్ దిగ్గజ “టవర్ సెమికండక్టర్” కంపెనీ భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. భారత ప్రభుత్వం నుంచి ప్రోత్సహకాలను కోరుతూ, ఈ కంపెనీ తన ప్రణాళికను సమర్పించింది. భారతదేశంలో 65 నానోమీటర్స్, 40 నానోమీటర్ చిప్‌లను తయారు చేయాలని చూస్తోంది. దీని కోసం 8 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రణాళికను రచించింది. సెమీకండర్ల తయారీకి సంబంధించి ప్రధాని మోడీ ప్రభుత్వం డిసెంబర్ 2021న 10 బిలియన్ డాలర్లతో పథకాన్ని రూపొందించింది. ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గతేడాది అక్టోబర్ నెలలో టవర్ సెమీకండక్టర్ సీఈఓ రస్సెల్ సీ ఎల్వాంగర్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్‌లో ఇజ్రాయిల్ రాయబారి నౌర్ గిలోన్ కూడా పాల్గొన్నారు.

టవర్ సెమీకండక్టర్ ఇజ్రాయిల్ చిప్ మేకర్. హై వాల్యూ అనలాగ్ సెమీకండక్టర్ సొల్యూషన్‌లో పేరొందిన సంస్థ. ఆటోమోటివ్, మెడికల్, ఇండస్ట్రియల్, కన్స్యూమర్, ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ప్రపంచవ్యాప్తంగా 300 కంటే ఎక్కువ మంది వినియోగదారుల కోసం అనలాగ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌లను తయారు చేస్తున్న కంపెనీగా గుర్తింపు ఉంది.