NTV Telugu Site icon

House EMI: సామాన్యులకు మరో షాక్.. గృహరుణాలపై వడ్డీరేట్లు పెంచిన బ్యాంకులు

Housing Loans

Housing Loans

House EMI: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక పాలసీ రేటును సమీక్షించిన కొద్ది గంటల్లో పలు బ్యాంకులు గృహ రుణాలపై వడ్డీ రేట్లను పెంచేశాయి. కీలక రెపో రేటును ఆర్‌బీఐ అరశాతం పెంచింది. దీంతో సామాన్యులకు మరో షాక్ తగిలినట్లు అయ్యి్ంది. ఈ జాబితాలో ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి పలు బ్యాంకులు ఉన్నాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 50 బేసిస్ పాయింట్ల మేర తన లెండింగ్ రేట్లను పెంచింది. ఈ రేట్లను అక్టోబర్ 1 నుంచే అమలు చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో హెచ్‌డీఎఫ్‌డీ ఇంటి రుణాల వడ్డీ రేట్లు 8.10 శాతం నుంచి ప్రారంభం అవుతాయి. కొత్త, పాత రుణాలను తీసుకున్న వాళ్లు తాము చెల్లిస్తున్న, చెల్లించబోయే ఈఎంఐలపై ఈ పెరిగిన రేట్లను చెల్లించాల్సి ఉంటుంది.

Read Also:US Senator: ఆధునిక భారతదేశంలో 1984 చీకటి సంవత్సరం

అటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్స్‌టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటు 8.55 శాతానికి, రెపో లింక్డ్ లెండింగ్ రేటును 8.15 శాతానికి పెంచింది. మరోవైపు బ్యాంక్ ఆఫ్ బరోడా రెపో లింక్డ్ లెండింగ్ రేటును 8.45 శాతానికి పెంచేసింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రెపో లింక్డ్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటును 8.75 శాతానికి పెంచింది. ఇవే కాకుండా పలు ప్రైవేటు రంగ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు కూడా వడ్డీరేట్లను సవరించాయి. కాగా గత నాలుగు నెలల్లో రిజర్వ్ బ్యాంక్ ఇండియా వడ్డీ రేట్లను నాలుగు సార్లు పెంచింది.