Wedding Business: దేశంలో రాబోయే పెళ్లిళ్ల సీజన్ లెక్కలు చూస్తే కళ్లు చెదరక మానవు. కేవలం 25 రోజుల వ్యవధిలో.. అంటే నవంబర్ 21 నుంచి డిసెంబర్ 15, 2026 మధ్య దేశవ్యాప్తంగా సుమారు 52 లక్షల వివాహాలు జరగనున్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా వేసింది. ఈ స్వల్ప వ్యవధిలోనే దేశవ్యాప్తంగా దాదాపు రూ.7.50 లక్షల కోట్ల మేర వ్యాపారం సాగే అవకాశం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇందులో ఒక్క ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలోనే సుమారు 5 లక్షల పెళ్లిళ్ల ద్వారా రూ.2.50 లక్షల కోట్ల దాకా లావాదేవీలు జరగొచ్చన్న అంచనా ఈ సీజన్ జోరును కళ్లకు కడుతోంది.
బంగారం, బట్టలకే సింహభాగం.. కోట్లలో ఖర్చు
క్యాట్ పరిశోధన విభాగం (CRTDS) 25 రాష్ట్రాల్లోని 300 మందికి పైగా వ్యాపార ప్రముఖులు, 550 వాణిజ్య సంస్థల అభిప్రాయాలతో ఈ లెక్కలను తయారు చేసింది. మొత్తం రూ.7.50 లక్షల కోట్ల వ్యాపారంలో రూ.4.05 లక్షల కోట్లు వస్తువులు, రిటైల్ కొనుగోళ్ల రూపంలో రాగా, మరో రూ.3.45 లక్షల కోట్లు సేవల రంగం నుంచి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. వస్తువుల కొనుగోళ్లలో బంగారం, ఆభరణాల మార్కెట్ వాటానే అగ్రస్థానంలో ఉండబోతోంది. జ్యువెలరీ, విలువైన లోహాల విభాగంలో సుమారు రూ.1.20 లక్షల కోట్ల వ్యాపారం జరగొచ్చని భావిస్తున్నారు. ఆ తర్వాత దుస్తుల రంగంలో రూ.90 వేల కోట్ల అమ్మకాలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. వీటితో పాటు పెళ్లి బహుమతులు, ఇతర సామగ్రిపై రూ.37,500 కోట్లు, కిరాణా, ఆహార పదార్థాలపై మరో రూ.37,500 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్, స్వీట్లు, డ్రైఫ్రూట్స్, ఫర్నిచర్ వంటి రంగాల్లోనూ గట్టిగా వ్యాపారం సాగనుందని చెబుతున్నారు.
హోటళ్లు, క్యాటరింగ్‌తో పాటు కోటి 25 లక్షల మందికి ఉపాధి
సేవల రంగంలో క్యాటరింగ్, భోజన ఏర్పాట్ల ద్వారా దాదాపు రూ.75 వేల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. పెళ్లి మండపాలు, బ్యాంక్వెట్ హాళ్లు, హోటళ్ల రంగంలో రూ.60 వేల కోట్ల మేర లావాదేవీలు సాగొచ్చని అంచనా వేస్తున్నారు. ఈవెంట్ మేనేజ్మెంట్, వెడ్డింగ్ ప్లానింగ్‌పై రూ.37,500 కోట్లు, పూల అలంకరణలు, డెకరేషన్‌పై మరో రూ.37,500 కోట్లు ఖర్చు అవుతాయని నివేదికలు చెబుతున్నారు. రవాణా, సంగీతం, డీజే, ఫోటోగ్రఫీ, వీడియోగ్రాఫీ, బ్యూటీ సర్వీసులకూ ఈ సీజన్ పెద్ద పండగే అని అంటున్నారు.
ఇదే సమయంలో ఉపాధి రంగంలోనూ కదలిక రానుందని అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 1.25 కోట్ల మందికి తాత్కాలిక, సీజనల్, పార్ట్‌టైమ్ ఉపాధి అవకాశాలు లభిస్తాయని క్యాట్ అంచనా వేసింది. టెంట్ నిర్వాహకులు, పూల వ్యాపారులు, డెకరేటర్లు, క్యాటరింగ్ సిబ్బంది, ఫోటోగ్రాఫర్లు, డ్రైవర్లు, సాంకేతిక కార్మికులకు చేతినిండా పని దొరకడంతో పాటు చిరు వ్యాపారులు, స్థానిక కళాకారుల ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
ఐదేళ్లలో పెరిగిన పెళ్లిళ్ల మార్కెట్ స్పీడ్
గత కొన్నేళ్లుగా మన దేశంలో పెళ్లిళ్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. 2022లో 32 లక్షల పెళ్లిళ్లతో రూ.3.75 లక్షల కోట్ల వ్యాపారం జరగ్గా.. 2023లో 38 లక్షల పెళ్లిళ్లతో రూ.4.74 లక్షల కోట్లకు చేరింది. 2024లో 48 లక్షల వివాహాలతో రూ.5.90 లక్షల కోట్లు, 2025లో 46 లక్షల పెళ్లిళ్లతో రూ.6.50 లక్షల కోట్ల అంచనాలు నమోదయ్యాయి. ఇప్పుడు 2026లో ఆ సంఖ్య ఏకంగా రూ.7.50 లక్షల కోట్లకు చేరడం మార్కెట్ దూకుడును చూపిస్తోందని అంటున్నారు. జనాల్లో పెరుగుతున్న ఆర్థిక విశ్వాసానికి ఇది నిదర్శనమని క్యాట్ నేతలు పేర్కొన్నారు. పెళ్లి కొనుగోళ్లలో దేశీయ ఉత్పత్తులు, స్థానిక వ్యాపారులకు ప్రాధాన్యత ఇవ్వాలని క్యాట్ పిలుపునిచ్చింది. ఇవన్నీ క్యాట్ సర్వే ఆధారంగా తయారు చేసిన అంచనాలు అయినప్పటికీ, కేవలం 25 రోజుల్లోనే ఇంత పెద్ద స్థాయిలో వ్యాపారం సాగబోతోందన్న వార్త ఇప్పుడు మార్కెట్లలో జోరును మరింత పెంచుతోందని చెబుతున్నారు.

