Site icon NTV Telugu

Stock Market: స్టాక్ మార్కెట్‌పై అమెరికా-వెనిజులా యుద్ధ మేఘాలు..

Indian Stock Market

Indian Stock Market

Stock Market: భారతీయ స్టాక్ మార్కెట్‌పై అమెరికా-వెనిజులా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి వెనిజులాపై అమెరికా సైనిక చర్య ప్రారంభించినప్పటి నుంచి, ఇంధన, ముడి చమురు, ఇంజినీరింగ్ సేవలు, ఔషధాలతో సంబంధాలున్న భారతీయ లిస్టెడ్ కంపెనీలు అలర్ట్ అయ్యాయి. అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రభుత్వంపై అమెరికా నుంచి నెలల తరబడి ఒత్తిడి పెరుగుతున్న తర్వాత వెనిజులా వైమానిక రక్షణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని అగ్రరాజ్యం ఈ దాడులు చేసింది. ప్రస్తుతం ఈ దాడులు భారతీయ స్టాక్ మార్కెట్లో అనిశ్చితికి కారణం అయ్యాయి. వెనిజులాలో వ్యాపారం చేసే, లేదంటే భాగస్వామ్యం కలిగి ఉన్న భారతీయ కంపెనీలపై దీని ప్రభావం ఎలా ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: CM Chandrababu Counter: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్..!

రిలయన్స్, ONGC కి లాభమా లేదా నష్టమా..
వెనిజులాలో భారతదేశం యొక్క వ్యాపారం బహుళ రంగాలలో, ప్రధానంగా చమురు, గ్యాస్ రంగాల్లో విస్తరించి ఉంది. వెనిజులా దేశంలోని రెండు చమురు ప్రాజెక్టులలో ONGC ఈక్విటీ వాటాలను కలిగి ఉంది. అలాగే శుద్ధి రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) వెనిజులా ముడి చమురు యొక్క ప్రధాన దిగుమతిదారుగా ఉంది. అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ నివేదికల ప్రకారం.. ఈ రెండు కంపెనీలు US నేతృత్వంలోని టేకోవర్, వెనిజులా చమురు పరిశ్రమ పునర్నిర్మాణం యొక్క కీలక లబ్ధిదారులుగా ఉన్నాయి. కారకాస్‌పై విధించిన ఆంక్షలను సడలించినా లేదా ఎత్తివేసినా, కాలక్రమేణా సరఫరా, నగదు ప్రవాహం, వాల్యుయేషన్ పరంగా ఈ రెండు కంపెనీలు ప్రయోజనం పొందుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా వెనిజులాపై అమెరికా దాడి కారణంగా సోమవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి, అదే టైంలో ONGC షేర్లు దాదాపు 2% పడిపోయాయి.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెనిజులాలోని కారాబోబో హెవీ ఆయిల్ ప్రాజెక్ట్‌లో కన్సార్టియం భాగస్వామి, ఈక్విటీ వాటా ద్వారా పాల్గొంటుంది. ఆయిల్ ఇండియా వెనిజులాలో ONGC, ఇండియన్ ఆయిల్‌తో కలిసి జాయింట్ వెంచర్‌లో మైనారిటీ భాగస్వామి. మంగళూరు రిఫైనరీ, పెట్రోకెమికల్స్ కూడా గతంలో వెనిజులా నుంచి చమురును పొందింది. అమెరికా దాడుల తర్వాత వెనిజులా చమురు ఉత్పత్తి, ఎగుమతులు లేదా లాజిస్టిక్స్‌కు ఏదైనా అంతరాయం ఏర్పడితే అది ఈ కంపెనీలపై ప్రభావం చూపుతుంది.

ఇంధన రంగం కాకుండా, ఇంజినీర్స్ ఇండియాకు కారకాస్‌లో ఒక విదేశీ కార్యాలయం ఉంది. ఇది దాని అంతర్జాతీయ వ్యాపార కార్యకలాపాలకు మద్దతు ఇస్తుంది. తద్వారా దేశంలో దాని ఆన్-గ్రౌండ్ ఉనికిని కొనసాగిస్తుంది. భారతీయ ఔషధ కంపెనీలు కూడా ఈ దేశంలో పాలుపంచుకున్నాయి. సన్ ఫార్మా వెనిజులాలో రిజిస్టర్డ్ అనుబంధ సంస్థను కలిగి ఉండగా, గ్లెన్‌మార్క్ ఫార్మా స్థానికంగా రిజిస్టర్డ్ అనుబంధ సంస్థ ద్వారా వెనిజులాలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సిప్లా చారిత్రాత్మకంగా వెనిజులాకు అవసరమైన మందులను ఎగుమతి చేసింది, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ గతంలో ఈ దేశంలో అనుబంధ సంస్థను కలిగి ఉంది, కానీ 2024లో దాని మొత్తం వాటాను విక్రయించింది. లోహ రంగంలో జిందాల్ స్టీల్ వెనిజులాలో అతిపెద్ద ఇనుప ఖనిజ సముదాయాన్ని నిర్వహిస్తోంది.

వెనిజులా రాజధాని కారకాస్‌లో సైనిక దాడి తర్వాత అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అరెస్టు చేయడంపై అంతర్జాతీయంగా మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి, అనేక మంది న్యాయ నిపుణులు ఈ చర్యల చట్టబద్ధతను ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం వెనిజులా పరిస్థితుల కారణంగా ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో పైన పేర్కొన్న రెండు కంపెనీల స్టాక్‌లు కొద్దికొద్దిగా పతనం అవుతున్నాయి. ఇలా ఎంత వరకు కొనసాగుతాయో వేచి చూడాల్సిందే.

READ ALSO: Nicolas Maduro: మదురో పట్టుకోడానికి పెట్టిన ఖర్చుతో.. ఇండియాలో ఎన్ని వేల కుటుంబాలు బతుకుతాయో తెలుసా!

Exit mobile version