Site icon NTV Telugu

Coca‑Cola Price: యుద్ధం ఎఫెక్ట్.. పెరగనున్న కోకా కోలా ధరలు..

Coca Cola Company

Coca Cola Company

భారతదేశంలో కోకా కోలా ఉత్పత్తులను బాటిలింగ్  చేసే ప్రధాన సంస్థ ఎస్ఎల్ఎంజీ బేవరేజెస్ త్వరలో కొన్ని ఉత్పత్తుల ధరలను పెంచే అవకాశం ఉందని సమాచారం. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా ప్యాకేజింగ్ ఖర్చులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడింది. కంపెనీ డిప్యూటీ సీఈఓ రాహుల్ కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉత్పత్తి ఖర్చులు ఒత్తిడిలో ఉన్నాయని తెలిపారు. యుద్ధం కొనసాగితే ప్లాస్టిక్ బాటిల్స్, మూతలు, లేబుల్స్, కార్డ్బోర్డ్ బాక్సుల వంటి ప్యాకేజింగ్ వస్తువుల ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. అయితే ధరలు పెంచాలా లేదా అనేది మార్కెట్ పరిస్థితులు.. ఇతర కంపెనీల నిర్ణయాలు, వినియోగదారుల స్పందనపై ఆధారపడి ఉంటుంది.

ఇప్పటికే కొన్ని నీటి బాటిల్ కంపెనీలు ధరలను పెంచాయి. కానీ భారతదేశంలో శీతల పానీయాల మార్కెట్ చాలా పోటీగా ఉండటంతో ధరలు పెంచడం అంత సులభం కాదు. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మళ్లీ కాంపా కూలాను మార్కెట్లోకి తీసుకురావడంతో పోటీ మరింత పెరిగింది. గత 7-8 సంవత్సరాల్లో కంపెనీ పెద్దగా ధరలు పెంచలేదని రాహుల్ కుమార్ తెలిపారు. అయితే ఏప్రిల్‌లో ధరలపై సమీక్ష జరగనుంది. ఇప్పటికీ ఖర్చులు పెరుగుతున్నా, భవిష్యత్తుపై కంపెనీకి నమ్మకం ఉంది. భారత్‌లో శీతల పానీయాల మార్కెట్ రాబోయే సంవత్సరాల్లో వేగంగా పెరుగుతుందని అంచనా. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కంపెనీ కొత్తగా నాలుగు ఫ్యాక్టరీలను నిర్మించేందుకు భారీగా పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది.

Also Read:Rangareddy: చనిపోయిన తల్లిపై పడి ఏడ్చి.. నిస్సహాయంగా కుప్పకూలిన చిన్నారి..

ఇటీవల కంపెనీ ఆదాయం, లాభాలు కూడా గణనీయంగా పెరిగాయి. రాబోయే సంవత్సరాల్లో ఇంకా ఎక్కువ ఆదాయం సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వ్యాపారాన్ని విస్తరించి మరింత వృద్ధిని సాధించాలని చూస్తోంది.

Exit mobile version