Hyderabad Hosting Restaurant Conclave: హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక సదస్సుకు వేదిక కాబోతోంది. 13వ తేదీన ‘ది ఇండియన్ రెస్టారెంట్ కాన్‌క్లేవ్’కి ఆతిథ్యమివ్వబోతోంది. రెస్టారెంట్ల రంగానికి సంబంధించి ఇదే అతిపెద్ద సమావేశం కానుండటం విశేషం. హైటెక్స్‌లోని హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటుచేసిన ఈ మీటింగ్‌ని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. ‘ది నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ హైదరాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇదిలాఉండగా.. ఈ అసోసియేషన్‌లో 5 లక్షల రెస్టారెంట్లు సభ్యత్వం కలిగి ఉన్నాయి. 73 లక్షల మంది సిబ్బందితో ఏటా 4 లక్షల కోట్లకు పైగా టర్నోవర్ సాధిస్తోంది.
ఫేక్ రివ్యూలకు చెక్
ఇ-కామర్స్ వెబ్‌సైట్లు, ట్రావెల్ మరియు హోటల్ బుకింగ్స్ ప్లాట్‌ఫామ్స్‌లోని ఫేక్ రివ్యూలకి, ధ్రువీకరించని స్టార్ రేటింగ్‌లకి ఇక చెక్ పడనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రమాణాలను నిర్దేశించనుంది. దీనికోసం రూపొందించిన ముషాయిదా ఫ్రేమ్‌వర్క్‌కి తుది మెరుగులు దిద్దుతోంది. ఆయా వర్గాలతో చర్చలు జరుపుతోంది. ఈ సంప్రదింపులు పూర్తయ్యాక గైడ్‌లైన్స్‌ని విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. రివ్యూలు రాసే వ్యక్తులు నిజంగా ఆయా హోటళ్ల, ట్రావెల్ సంస్థల వినియోగదారులా కాదా అనేది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఇండియా @ 142 బిలియనీర్స్
ఫార్చ్యూన్ ఇండియా సంస్థ ఈ ఏడాదికి గాను మన దేశంలోని అత్యంత ధనవంతులతో కూడిన జాబితాను రూపొందించింది. ఇందులో 142 మంది బిలియనీర్లకు చోటు లభించింది. వాళ్లందరి ఐశ్వర్యాన్ని 832 బిలియన్ డాలర్లుగా లెక్క కట్టింది. వాటర్ ఫీల్డ్ అడ్వైజర్స్ అనే మరో వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థతో కలిసి శ్రీమంతులకు సంబంధించిన లిస్టెడ్ మరియు ఔట్‌లిస్టెడ్ సంపదతోపాటు లిస్టెడ్ బిజినెస్‌లలో నమోదుకాని ఇన్వెస్ట్‌మెంట్ల వివరాలను సైతం సేకరించింది. ఈ జాబితాలో అగ్రస్థానాన్ని అదానీ ఆక్రమించారు. ముఖేష్ అంబానీ, షాపూర్ మిస్త్రీ మరియు సైరస్ మిస్త్రీ ఫ్యామిలీ, రాధాకిషన్ దమానీ, అజీమ్ ప్రేమ్‌జీ తదితరులూ ఉన్నారు.
స్టాక్ మార్కెట్ అప్‌డేట్
స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి. 166 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ప్రస్తుతం 59855 వద్ద ట్రేడింగ్ అవుతోంది. 81 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ ఇప్పుడు 17880 పైనే కొనసాగుతోంది. పెరిగిన ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్ల వ్యాల్యూ రెండు శాతం పెరిగింది. రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, మహింద్రా అండ్ మహింద్రా, టాటా పవర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్స్ ఆశాజనకంగా ఉన్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 79.72 వద్ద కొనసాగుతోంది.