Site icon NTV Telugu

Hindustan Copper share: కాపర్‌కూ రెక్కలు.. ఆరు నెల్లలో 190% రిటర్న్స్!

Copper Price

Copper Price

Hindustan Copper share: ప్రస్తుతం బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. ఈ రెండు లోహాల ధరలు రోజు రోజుకూ భారీగా పెరుగుతున్నాయి. మరోవైపు కాపర్ ధరలు సైతం ఇదే రేంజ్‌లో దూసుకుపోతున్నాయి. తాజాగా హిందుస్తాన్ కాపర్ షేరు మరోసారి దూకుడుగా దూసుకెళ్లింది. బంగారం, వెండి లాగే ఇప్పుడు కాపర్ ధరలు సైతం భారీగా పెరగడంతో ఈ కంపెనీ షేరు ఒక్క రోజులోనే దాదాపు 20 శాతం ఎగబాకింది. ఎన్ఎస్‌ఈలో హిందుస్తాన్ కాపర్ షేరు రూ.745 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. గత ఆరు నెలలగా చూస్తే, ఈ షేరు ఏకంగా 190 శాతం కంటే ఎక్కువ లాభాన్ని ఇచ్చింది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం.. కాపర్ ధరలు వరుసగా రికార్డులు సృష్టించడమే అని చెబుతున్నారు. కాపర్ ధరలు పెరుగుతుంటే, హిందుస్తాన్ కాపర్ షేరు సైతం అదే దారిలో దూసుకెళ్తోంది. ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి కాపర్ ఫ్యూచర్స్ ధర ఉదయం ట్రేడింగ్‌లోనే 6.49 శాతం పెరిగి కిలోకు రూ.1,407కు చేరింది. అంతేకాదు.. ఈ రోజు కాపర్ ధర ఎంసీఎక్స్‌లో జీవితకాల గరిష్ఠమైన రూ.1,432.35ను తాకింది.

READ MORE: UK-China: అమెరికాకు దూరమవుతోన్న మిత్ర దేశాలు.. చైనాతో బ్రిటన్ కీలక ఒప్పందం

అంతర్జాతీయ మార్కెట్లలోనూ కాపర్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, డాలర్ బలహీనపడటం వల్ల పెట్టుబడిదారులు భౌతిక లోహాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో కాపర్‌కు డిమాండ్ పెరిగింది. చైనాలోని షాంఘై ఫ్యూచర్స్ ఎక్స్చేంజ్‌లో అత్యధికంగా ట్రేడయ్యే కాపర్ కాంట్రాక్టు ధర 6 శాతం కంటే ఎక్కువ పెరిగి టన్నుకు 108,740 యువాన్‌కు చేరింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే ఇది 109,570 యువాన్‌తో ఆల్‌టైమ్ హైను కూడా నమోదు చేసింది. ట్రేడర్ల వివరాల ప్రకారం.. ఇటీవలి కాలంలో బంగారం, వెండిలో భారీ లాభాలు ఆర్జించిన పెట్టుబడిదారులు తాజాగా కాపర్ వైపు మారుతున్నారు. దీంతో కాపర్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ప్రపంచ స్థాయిలో కాపర్ ప్రాధాన్యం వేగంగా పెరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకప్పుడు “డాక్టర్ కాపర్” అని పిలిచే ఈ లోహం, ఇప్పుడు కమోడిటీలలో “రాజు”గా మారుతోందని బ్లూమ్‌బర్గ్ ఇన్‌టెలిజెన్స్ అభిప్రాయం వ్యక్తం చేసింది. 2026 నాటికి పెద్ద మైనింగ్ కంపెనీల లాభాల్లో కాపర్ వాటా 35 శాతానికి పైగా ఉండవచ్చని అంచనా వేస్తోంది.

READ MORE: Bhumana Karunakar Reddy: జగన్ను దెబ్బ తీసేందుకు హిందువుల మనోభావాలతో చంద్రబాబు, పవన్ ఆడుకున్నారు..

Exit mobile version