ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ ముడి చమురు సంక్షోభం ప్రభావం భారతీయ కార్పొరేట్ రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇంధన వినియోగాన్ని తగ్గించుకుంటూ, పొదుపు మంత్రాన్ని పాటించాలంటూ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు పారిశ్రామిక వర్గాల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఐటీ రంగానికే పరిమితమనుకున్న ‘వర్క్ ఫ్రం హోమ్’ విధానాన్ని ఇప్పుడు బ్యాంకింగ్ రంగం కూడా అందిపుచ్చుకోవడం విశేషం. దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) ఈ దిశగా ముందడుగు వేసి సరికొత్త ఆఫీస్ సంస్కృతికి తెరతీసింది.
కార్పొరేట్ కార్యాలయాల్లో ఇంధన పొదుపుతో పాటు నిర్వహణ ఖర్చులను తగ్గించే లక్ష్యంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన సిబ్బందికి వారంలో రెండు రోజులు ఇంటి నుంచి పనిచేసే సదుపాయాన్ని కల్పించింది. అయితే, ఈ వెసులుబాటు బ్యాంక్‌లోని ఉద్యోగులందరికీ వర్తించదు. కేవలం అంతర్గత కార్యకలాపాలు నిర్వహించే విభాగాలకు మాత్రమే దీనిని పరిమితం చేశారు.
ఏయే విభాగాలకు వర్తిస్తుంది?
ట్రెజరీ ఆపరేషన్స్ & ఫైనాన్స్ అకౌంట్స్, డిజిటల్ బ్యాంకింగ్ అండ్ టెక్నాలజీ, హెచ్‌ఆర్ అండ్ సాధారణ పరిపాలన సిబ్బందికి ఈ విధానం వర్తిస్తుంది. వినియోగదారులతో లేదా కస్టమర్లతో నేరుగా సంబంధం లేని, కేవలం కంప్యూటర్ ఆధారిత పనులు చేసే ఉద్యోగులు మాత్రమే ఈ ఫ్లెక్సిబిలిటీని ఉపయోగించుకోవచ్చు.
కస్టమర్ సేవలకు ముప్పు ఉందా?
ఈ కొత్త నిర్ణయం వల్ల బ్యాంకుకు వచ్చే ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగవని యాజమాన్యం స్పష్టం చేసింది. బ్రాంచ్‌లలో నేరుగా కస్టమర్లకు సేవలు అందించే క్యాషియర్లు, మేనేజర్లు, ఇతర ఫ్రంట్ ఆఫీస్ సిబ్బంది ఎప్పటిలాగే కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహిస్తారు. దీనివల్ల రోజువారీ బ్యాంకింగ్ లావాదేవీలకు ఎలాంటి అంతరాయం కలగదు.
ఈ వినూత్న విధానాన్ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రస్తుతం ఒక నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ఈ ముప్పై రోజుల్లో ఉద్యోగుల ఉత్పాదకత, బ్యాంక్ పనితీరు, సేవల నాణ్యతను ఉన్నతాధికారులు నిశితంగా సమీక్షిస్తారు. ఒకవేళ ఈ ప్రయోగం ఆశించిన ఫలితాలను ఇస్తే, భవిష్యత్తులోనూ దీనిని ఇలాగే కొనసాగించే అవకాశం ఉంది. ఈ నిర్ణయం విజయవంతమైతే మరికొన్ని బ్యాంకులు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం కనిపిస్తోంది.
