GST Council: జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తొలిరోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు ప్రకటనలు చేశారు. సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లను అమలు చేయాలని నిర్ణయించారు. ఇకపై జీఎస్టీలో రెండు స్లాబ్‌లు (5, 18 శాతం) మాత్రమే కొనసాగించనున్నారు. జీఎస్టీలో ప్రస్తుతం కొనసాగుతోన్న 12, 28శాతం స్లాబ్‌లు తొలగించాలని నిర్ణయించారు. ఇప్పుడు వ్యక్తిగత ఆరోగ్యం, జీవిత బీమా ప్రీమియంపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో వీటిపై 18% జీఎస్టీ ఉండేది. దీంతో సామాన్యులకు ఉపశమనం లభిస్తుంది. అంతే కాదు.. అనేక రకాల మందులు, వైద్య పరికరాలపై ఉపశమనం లభించింది.
56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత, బీమా సేవలపై ప్రస్తుతం ఉన్న 18% జీఎస్టీని రెండు-మూడు వేర్వేరు వర్గాలుగా విభజించనున్నట్లు సీతారామన్ చెప్పారు. టర్మ్ లైఫ్, యులిప్ లేదా ఎండోమెంట్ పాలసీ, వాటి రీఇన్సూరెన్స్, అన్ని వ్యక్తిగత జీవిత బీమా పాలసీలపై జీఎస్టీ విధించబడదని స్పష్టం చేశారు. ఇది సామాన్యులకు బీమాను కొనుగోలు చేయడాన్ని సులభతరం చేస్తుంది. దేశంలో బీమా పరిధి పెరుగుతుందని భావిస్తున్నారు.
READ MORE: GST Council: సామాన్యులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈ వస్తువులపై జీఎస్టీ తగ్గింపు..
కేంద్ర ప్రభుత్వం 33 రకాల రోగులకు ఉపయోగపడే మందులపై జీఎస్టీని సున్నాకి తగ్గించింది. గతంలో వీటిపై జీఎస్టీ రేటు 12 శాతంగా ఉండేది. ఈ మందులలో అస్కిమినిబ్, మెపోలిజుమాబ్, పెగిలేటెడ్ లిపోసోమల్ ఇరినోటెకాన్, డరతుముమాబ్, అగల్సిడేస్ ఆల్ఫా, అలిరోకుమాబ్, ఎవోలోకుమాబ్ మొదలైనవి ఉన్నాయి. వీటిలో క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మందులు కూడా ఉన్నాయి. అనేక మందులపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. దీనితో పాటు, థర్మామీటర్లు, మెడికల్ ఆక్సిజన్, డయాగ్నస్టిక్ కిట్లు, గ్లూకోమీటర్లు, టెస్ట్ స్ట్రిప్స్, కళ్ళద్దాలపై జీఎస్టీ రేటును 5%కి తగ్గించారు. గతంలో, వీటిపై 12 నుంచి 18 శాతం జీఎస్టీ వసూలు చేసేవారు.