మన దేశంలో బంగారం ధర ఒక్క రోజులోనే ఆసక్తికరంగా తగ్గటం, ఆశ్చర్యరంగా పెరగటం జరిగింది. ఇవాళ ఉదయం తులం బంగారం రేటు నామమాత్రంగా 100 రూపాయలే దిగొచ్చి గుడ్ న్యూస్ చెప్పగా సాయంత్రానికి ఏకంగా 1,310 రూపాయలు పెరిగింది. పసిడి దిగుమతి పన్ను పెరగటమే దీనికి ప్రధాన కారణం. ఢిల్లీలో పొద్దున 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.100 తగ్గటంతో నికర ధర రూ.46,650కి వచ్చింది. 24 క్యారెట్ల ధర రూ.110 తగ్గి నెట్ వ్యాల్యూ రూ.50,890 పలికింది. కానీ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాన్ని పెంచుతున్నట్లు ప్రకటించిందో అప్పుడే పుత్తడి రేటు సైతం అమాంతం పెరిగింది.
జాతీయ రాజధాని ఢిల్లీలో ఈరోజు సాయంత్రానికి 10 గ్రాముల బంగారం ధరం రూ.52,200కి ఎగబాకింది. పసిడిపై దిగుమతి సుంకం ఇవాళ ఒక్కసారే 5 శాతం పెరిగింది. నిన్నటివరకు ఈ పన్ను 7.5 శాతంగానే ఉంది. ఈరోజు 12.5 శాతానికి చేరింది. దీనిపై 2.5 శాతం వ్యవసాయ మౌలిక సదుపాయాల సుంకం అదనం. ఈ రెండూ కలవటంతో మొత్తం దిగుమతి పన్ను రౌండ్ ఫిగర్ 15 శాతం అయింది. వీటికి 3 శాతం జీఎస్టీ కూడా కలుస్తుంది. ఈ నేపథ్యంలో బంగారం రేట్లు ఇంకా పైపైకి చేరనున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కరెంట్ ఖాతా లోటును భర్తీ చేసేందుకే పుత్తడిపై దిగుమతి పన్ను పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
Gold Rate Today: బంగారం ధరలు.. ఈ రోజు ఎక్కడ..? ఎంత ధర..?