NTV Telugu Site icon

Gold Prices: షాకింగ్ న్యూస్… భారీగా పెరిగిన బంగారం ధరలు

రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆర్థిక వ్యవస్థలు ప్రభావితం అవుతున్నాయి. గురువారం ఉదయం రష్యా.. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించింది. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలపై ముప్పేట దాడి చేసింది. దీంతో అంతర్జాతీయంగా పలు దేశాల్లోని స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఇండియాలో అయితే మార్కెట్లు మొదలైన అరగంటలోనే బీఎస్‌ఈ మార్కెట్‌ విలువ రూ.10 లక్షల కోట్ల మేర ఆవిరైంది. రూ.256 లక్షల కోట్ల నుంచి రూ.246 లక్షల కోట్లకు తగ్గింది. షేర్ హోల్డర్లు భయంతో షేర్లను అమ్మేస్తుండటంతో ప్రతి 10 కంపెనీల షేర్లలో 9 కంపెనీల షేర్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.

మరోవైపు రష్యా- ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్, బంగారంపై ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ ధర 100 డాలర్లకు చేరింది. గత ఏడు సంవత్సరాల్లో ఇదే గరిష్టం. అటు బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు కూడా భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1200 పెరిగి.. రూ. 51,250కి చేరింది. మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.47,450గా నమోదైంది.