భారతదేశ భవిష్యత్తును మార్చబోతున్న సరికొత్త తరం ‘జెన్ జీ’ (Gen Z) గురించి రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ సంస్థ ఆసక్తికరమైన నివేదికను విడుదల చేసింది. 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని ‘జెన్ జీ’ అని పిలుస్తారు. వీరు మన దేశ ఆర్థిక వ్యవస్థను.. ముఖ్యంగా కొనుగోలు రంగాలను ఎలా ప్రభావితం చేయబోతున్నారో ఈ క్రింది వివరణలో తెలుసుకుందాం.
భవిష్యత్తుపై అంచనా..
2030 నాటికి భారతదేశ జనాభాలో 27 శాతం మంది ఈ ‘జెన్ జీ’ తరానికి చెందిన వారే ఉంటారు. వీరు సుమారు 1.3 ట్రిలియన్ డాలర్ల (లక్షల కోట్లు) విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారని అంచనా. వీరు కేవలం వస్తువులకే కాకుండా.. అనుభవాలకు, పర్యావరణ హితానికి, డిజిటల్ సౌకర్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
2030 నాటికి ఈ రంగంలో వీరు 19 బిలియన్ డాలర్ల మార్కెట్‌ను సృష్టిస్తారు. ప్రతి ఇద్దరు ‘జెన్ జీ’ యువతులలో ఒకరు తమ సంపాదనలో 20 శాతానికి పైగా అందాన్ని మెరుగుపరిచే వస్తువులకే ఖర్చు చేస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు వీరు వాడుతున్న వస్తువుల సంఖ్య రెట్టింపు అయ్యింది. చర్మం, జుట్టు , శరీరం కోసం వేర్వేరు పద్ధతులను పాటిస్తున్నారు. వీరు ఒకే బ్రాండ్‌కు కట్టుబడి ఉండకుండా.. తమకు ఏది బాగా పని చేస్తుందో వాటినే ఎంచుకుంటున్నారు. అందం అనేది కేవలం మహిళలకే పరిమితం కాదని ఈ తరం భావిస్తోంది. గత ఐదేళ్లలో ‘పురుషుల చర్మ సంరక్షణ’ కోసం వెతికే వారి సంఖ్య 850 శాతం పెరిగింది. యువకులు కూడా మొటిమల నివారణ, హెయిర్ రిమూవల్, మేకప్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు.
Also Read:Minister Seethakka: హమాలీలకు హెల్త్ కార్డ్, ఇన్సూరెన్స్.. మంత్రి సీతక్క కీలక నిర్ణయం..
ఫ్యాషన్ రంగం..
2030 నాటికి ఫ్యాషన్ రంగంలో సగం వాటా వీరిదే ఉంటుంది. వీరు ఎక్కువగా 1,000 రూపాయల లోపు లభించే దుస్తులు, పాదరక్షలనే ఇష్టపడుతున్నారు. పాత తరం వారితో పోలిస్తే వీరు వస్తువులను ఎక్కువగా కొంటున్నప్పటికీ, ఒక్కో వస్తువుపై పెట్టే ఖర్చు మాత్రం తక్కువగా ఉంటోంది.
ఆరోగ్యం, ఫిట్‌నెస్..
ఈ తరంలో మూడో వంతు మంది తమ ఆదాయంలో 20 శాతాన్ని ఫిట్‌నెస్, క్రీడల కోసం కేటాయిస్తున్నారు. ముఖ్యంగా క్రీడా దుస్తుల అమ్మకాలు ఏడాదికేడాది రెట్టింపు అవుతున్నాయి. ఆన్‌లైన్‌లో తక్కువ ధరలో దొరికే స్పోర్ట్స్ షూస్ వీరికి మొదటి ప్రాధాన్యత. ఆహారం విషయంలో కూడా వీరు జాగ్రత్తగా ఉంటున్నారు. వ్యాయామం చేసే వారిలో 40 శాతం మంది ప్రత్యామ్నాయ ప్రోటీన్ వనరులను ఎంచుకుంటున్నారు. మొత్తంగా.. 2030 నాటికి ఫిట్‌నెస్ , క్రీడల రంగంలోనే వీరు 40 బిలియన్ డాలర్ల ఖర్చును ప్రభావితం చేస్తారు. ఈ తరం కేవలం కొనుగోలుదారులు మాత్రమే కాదు.. మార్కెట్ దిశను మార్చే శక్తిగా ఎదుగుతున్నారు.
