Gautam Adani: భారత దేశంలో అత్యంత సంపన్నుడు ఎవరనే ప్రశ్నకు ఎలాంటి అనుమానం లేకుండా అందరూ అంబానీ పేరునే చెబుతారు. కానీ మీరు కూడా అలా చెబితే పప్పులో కాలు వేసినట్లే.. ఎందుకంటే తాజాగా నిర్వహించిన సర్వేలో దేశంలో అత్యంత సంపన్నుడు ఎవరనే ప్రశ్నకు సరికొత్త సమాధానాలు వచ్చాయి. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టి, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మళ్లీ అగ్రపీఠాన్ని కైవసం చేసుకున్నారు. ‘ఎం3ఎం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2026’ రిలీజ్ చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో అదానీ కుటుంబం మొదటి స్థానాన్ని తిరిగి దక్కించుకుని సంచలనం సృష్టించింది. తాజా నివేదిక ప్రకారం.. గౌతమ్ అదానీ సంపద ఏడాది వ్యవధిలోనే 13 శాతం మేర పెరిగి రూ. 9.23 లక్షల కోట్లకు (96 బిలియన్ డాలర్లు) చేరుకుంది. మరోవైపు ముఖేష్ అంబానీ నికర విలువ 10 శాతం తగ్గి రూ. 8.63 లక్షల కోట్లకు (90 బిలియన్ డాలర్లు) పరిమితమైంది. దీంతో అంబానీ కంటే ఏకంగా రూ. 59,400 కోట్ల ఆధిక్యంతో అదానీ మొదటి స్థానంలో నిలిచారు.
దేశ సంపదలో సగానికి సమానం..
భారతదేశంలో సంపన్నుల సంఖ్య ఏటా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. తాజా జాబితాలో కనీసం రూ.1,000 కోట్ల సంపద కలిగిన వ్యక్తులు 1,810 మందికి చేరారు. వీరి మొత్తం సంపద విలువ 12.8 శాతం ఎగబాకి ఏకంగా రూ. 187.5 లక్షల కోట్లకు (1.96 ట్రిలియన్ డాలర్లు) చేరింది. ఇది దాదాపు భారతదేశ జీడీపీలో సగానికి సమానం కావడం విశేషం. దేశంలో డాలర్ – బిలియనీర్ల సంఖ్య సరికొత్త గరిష్టమైన 391కి చేరుకుంది. గత ఏడాది కాలంలోనే కొత్తగా 27 మంది ఈ క్లబ్‌లోకి అడుగుపెట్టారు.
టాప్ 10లో అనూహ్య మార్పులు..
మెటల్, స్టీల్, ఫార్మా రంగాలు ఈసారి అద్భుత పనితీరు కనబరిచాయి. ఆర్సెలర్ మిట్టల్ అధినేత ఎల్.ఎన్.మిట్టల్ సంపద 93 శాతం వృద్ధితో రూ.3.39 లక్షల కోట్లకు చేరి, మూడో స్థానానికి ఎగబాకింది. జాబితాలో అత్యధికంగా ఒక్క ఏడాదిలోనే రూ.1.64 లక్షల కోట్ల సంపదను పెంచుకున్న వ్యక్తిగా ఆయన నిలిచారు. వేదాంత గ్రూప్ అనిల్ అగర్వాల్ కుటుంబం రూ.2.08 లక్షల కోట్లతో 9వ స్థానానికి, జేబీ కెమికల్స్ విలీనంతో టోరెంట్ ఫార్మా సమీర్ మెహతా కుటుంబం రూ. 1.89 లక్షల కోట్లతో 10వ స్థానానికి దూసుకొచ్చాయి. సాంప్రదాయ వ్యాపారాలే కాకుండా అత్యాధునిక సాంకేతిక రంగాల నుంచీ యువ పారిశ్రామికవేత్తలు ఈ జాబితాలో మెరిశారు. బెంగళూరుకు చెందిన క్యూపీఐఏఐ వ్యవస్థాపకుడు నాగేంద్ర నాగరాజ రూ. 1,700 కోట్ల సంపదతో హురున్ లిస్ట్‌లోకి ప్రవేశించిన తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ పారిశ్రామికవేత్తగా నిలిచారు. అలాగే ఏఐ ఆధారిత ‘విస్పర్ ఫ్లో’ కంపెనీ ద్వారా కేవలం 28 ఏళ్ల తనయ్ కొఠారి, సహజ్ గార్గ్ చెరో రూ. 4,200 కోట్ల సంపదతో ఎంట్రీ ఇచ్చి ఔరా అనిపించారు. క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘జెప్టో’ కో-ఫౌండర్ కైవల్య వోహ్రా (23 ఏళ్లు) ఈ జాబితాలోనే అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు.
మహిళల హవా.. ముంబై నంబర్ 1 నగరం..
ఈసారి జాబితాలో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగి 131కి చేరింది. రూ. 2.79 లక్షల కోట్లతో రోష్ని నాడార్ మల్హోత్రా భారత అత్యంత ధనిక మహిళగా తన స్థానాన్ని నిలబెట్టుకోగా, అరిస్టా నెట్‌వర్క్స్‌కు చెందిన జయశ్రీ ఉల్లాల్ (రూ. 77,400 కోట్లు) స్వయంకృషితో ఎదిగిన నంబర్ 1 మహిళగా నిలిచారు. ఇక నగరాల విషయానికి వస్తే 465 మంది సంపన్నులతో దేశ ఆర్థిక రాజధాని ముంబై అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఢిల్లీ (236), బెంగళూరు (129) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మొత్తంగా చూస్తే సంపద సృష్టిలో స్వయంకృషితో ఎదిగిన పారిశ్రామికవేత్తల వాటా 70 శాతానికి చేరడం భారత ఆర్థిక ప్రగతికి అద్దం పడుతోందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

