EPFO New Rules: ప్రైవేట్ ఉద్యోగుల జేబులకు చిల్లు పడనుందా.. నెల తిరిగేసరికి బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ అయ్యే ‘ఇన్-హ్యాండ్ శాలరీ’ తగ్గిపోనుందా? అంటే తాజా పరిణామాలు అవుననే సంకేతాలు ఇస్తున్నాయి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తీసుకున్న తాజా నిర్ణయం దేశవ్యాప్తంగా పనిచేస్తున్న లక్షలాది మంది ప్రైవేట్ ఉద్యోగుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వేతన పరిమితిని (Wage Ceiling) ఏకంగా రూ.15,000 నుంచి రూ.25,000కి పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో చేతికి వచ్చే డబ్బులు తగ్గుతాయన్న ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.
అసలేం జరిగింది? ఎందుకీ గందరగోళం?
ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి సామాజిక భద్రతను మరింత విస్తృతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ వేతన పరిమితిని పెంచింది. దీనివల్ల దాదాపు 51 లక్షల మంది అదనపు ఉద్యోగులకు కొత్తగా ప్రయోజనం చేకూరనున్నప్పటికీ, తక్షణ ప్రభావం మాత్రం వారి నెలవారీ టేక్-హోమ్ శాలరీపై పడనుంది. వేతన పరిమితి పెరిగితే పీఎఫ్ కాంట్రిబ్యూషన్ మొత్తం కూడా పెరుగుతుంది. పీఎఫ్ పొదుపు పెరిగినప్పటికీ, చేతికి అందే జీతంలో మాత్రం కోత కనిపిస్తుంది.
మీ చేతికొచ్చే జీతం ఎంత తగ్గుతుంది?
పీఎఫ్ పరిధిలోకి వచ్చే మీ బేసిక్ పే, డీఏ ఆధారంగా ఈ కోత ఎలా ఉండబోతోందో లెక్కలు ఇలా ఉన్నాయి.
* రూ. 20,000 జీతం ఉన్నవారికి: ఇప్పటి వరకు పాత వేతన పరిమితి (రూ.15,000) ప్రకారం నెలకు రూ.1,800 మాత్రమే పీఎఫ్‌కు కట్ అయ్యేది. అయితే కొత్త నిబంధనల ప్రకారం ఇది రూ.2,400కి చేరుతుంది. అంటే నెలకు అదనంగా రూ.600 పీఎఫ్ ఖాతాలోకి వెళ్లడంతో, చేతికి వచ్చే జీతం రూ.600 తగ్గుతుంది.
* రూ.25,000 జీతం ఉన్నవారికి: పాత నిబంధనతో రూ.1,800 కట్ అయిన చోట, ఇకపై ఏకంగా రూ.3,000 కట్ అవుతుంది. అంటే ప్రతి నెలా రూ.1,200 మేర ఇన్-హ్యాండ్ శాలరీ తగ్గుతుంది.
* కంపెనీ షేర్ కూడా సీటీసీలో భాగమైతే: చాలా కంపెనీలలో ఎంప్లాయర్ (యాజమాన్యం) వాటాను కూడా ఉద్యోగి సీటీసీ (CTC)లోనే చూపిస్తాయి. ఒకవేళ మీ ఆఫర్ లెటర్‌లో కూడా ఇదే వర్తిస్తే, కోత రెట్టింపు అవుతుంది. అంటే రూ.20 వేల జీతానికి నెలకు రూ.1,200, రూ.25 వేల జీతానికి నెలకు రూ.2,400 వరకు చేతికొచ్చే డబ్బుల్లో తేడా కనిపిస్తుంది.
సీటీసీపై ప్రభావం ఉంటుందా?
ఈపీఎఫ్‌ఓ నిబంధనల ప్రకారం సీటీసీ ఆధారంగా పీఎఫ్ నిర్ధారణ కాదు. అందువల్ల కేవలం ఈ వేతన పరిమితి పెరిగినంత మాత్రాన కంపెనీ ఆఫర్ చేసిన మొత్తం వార్షిక సీటీసీలో మార్పు రాదు. కానీ కంపెనీలు తమ వాటాను భరించాల్సి వస్తే యాజమాన్యాలపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉంది.
* ప్రభావం పడేది వీరిపైనే: ఎవరికైతే ప్రస్తుతం బేసిక్ వేతనం రూ.15,000 కంటే ఎక్కువ ఉండి, రూ.25,000 లోపు ఉంటుందో.. వారికి మాత్రమే ఈ కోత నేరుగా కనిపిస్తుంది. గతంలో రూ.15,000 పరిమితి ప్రకారమే పీఎఫ్ కట్ అయినవారు ఇకపై పెరిగిన కొత్త పరిమితికి అనుగుణంగా ఎక్కువ పీఎఫ్ చెల్లించాల్సి వస్తుంది.
* వీరికి ఎలాంటి మార్పు ఉండదు: ఎవరికైతే బేసిక్ పే ఇప్పటికే రూ.25,000 కంటే ఎక్కువగా ఉండి, ఆ పూర్తి మొత్తంపైనే పీఎఫ్ కట్ అవుతుందో వారికి టేక్-హోమ్ శాలరీలో ఎలాంటి మార్పు ఉండదు. పాత విధానంలోనే వారి జీతం యథావిధిగా జమ అవుతుంది.
దీర్ఘకాలికంగా చూస్తే రిటైర్మెంట్ సమయానికి ఇది భారీ పొదుపుగా, మెరుగైన పెన్షన్‌గా మారినప్పటికీ.. ప్రతి నెలా ఖర్చుల కోసం లెక్కలేసుకునే మధ్యతరగతి ఉద్యోగులకు తక్షణంగా చేతికి వచ్చే జీతం తగ్గడం కాస్త భారంగా మారే అవకాశమే కనిపిస్తోంది.

