EPFO: పీఎఫ్ చందాదారులకు భారీ ఊరట.. అప్లై చేయకుండానే నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు!

Epfo

Epfo

EPFO: బ్యాంకులు, ఎల్ఐసీ (LIC), ఈపీఎఫ్‌ఓ (EPFO)లలో వేల కోట్ల రూపాయల క్లెయిమ్ చేయని (Unclaimed) సొమ్ము ఏళ్ల తరబడి మూలుగుతోంది. ఈ క్రమంలో కార్మిక వర్గానికి శుభవార్త అందిస్తూ.. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఈ సొమ్మును అసలైన హక్కుదారులకు చేర్చేందుకు ఓ సరికొత్త విప్లవాత్మక అడుగు వేసింది. ఇకపై ఖాతాదారులు ఎలాంటి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ అప్లికేషన్లు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే.. నిరుపయోగంగా (In-active) ఉన్న పీఎఫ్ ఖాతాల నుంచి నేరుగా రూ.1 లక్షకు పైగా సబ్‌స్క్రైబర్ల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈపీఎఫ్‌ఓ ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఇప్పటికే 1.18 లక్షల ఇన్‌యాక్టివ్ ఖాతాలను గుర్తించి, వాటి వెరిఫికేషన్ ప్రక్రియను కూడా విజయవంతంగా పూర్తి చేసింది.

క్లెయిమ్ చేయకుండానే ఖాతాలోకి జమ

ఇప్పటివరకు పాత లేదా ఇన్‌యాక్టివ్ పీఎఫ్ ఖాతాల నుంచి సొమ్ము ఉపసంహరించుకోవాలంటే ఖాతాదారులు స్వయంగా ఫారమ్ నింపి ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి వచ్చేది. కానీ, ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఆటోమేటిక్ రీఫండ్ సిస్టమ్ ద్వారా చందాదారులు ఎలాంటి ఫారమ్‌లు నింపాల్సిన అవసరం లేదు. ఈపీఎఫ్‌ఓ స్వయంగా నిరుపయోగంగా ఉన్న ఖాతాలను గుర్తించి, ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంక్ ఖాతాలకు వడ్డీతో సహా మొత్తం సొమ్మును నేరుగా బదిలీ చేస్తుంది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ 2026 ఫిబ్రవరి 23న ఈ పైలట్ ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపారు. మొదటి దశలో రూ.1,000 లేదా అంతకంటే తక్కువ సొమ్ము ఉన్న ఇన్‌యాక్టివ్ ఖాతాలను చేర్చారు. ప్రస్తుతం రూ.30.52 కోట్ల క్లెయిమ్ చేయని సొమ్ము ఉన్న ఇలాంటి 7.11 లక్షల ఖాతాలను అధికారులు గుర్తించారు.

సాంకేతికతతో సురక్షితమైన వెరిఫికేషన్

ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే 1.18 లక్షల సబ్‌స్క్రైబర్ల బ్యాంక్ ఖాతాల వివరాల పరిశీలన పూర్తయింది. ఈ ప్రక్రియను పారదర్శకంగా మార్చేందుకు ఈపీఎఫ్‌ఓ వినూత్న సాంకేతికతను ఉపయోగిస్తోంది. ఆధార్‌తో లింకైన పీఎఫ్ ఖాతాలను సక్రియంగా (Active) ఉన్న బ్యాంక్ ఖాతాలతో సరిపోల్చేందుకు.. సదరు బ్యాంక్ ఖాతాలోకి సాంకేతికంగా రూ.1 జమ చేసి (Penny Drop Test) ఖాతా నిజమైనదో కాదో నిరూపించుకున్నారు. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘సి-డాక్’ (C-DAC) సంస్థ ఈపీఎఫ్‌ఓ ఐటీ ప్లాట్‌ఫామ్‌ను అప్‌గ్రేడ్ చేసే పనిని చేపట్టింది. కొత్త ప్లాట్‌ఫామ్‌లో ‘సిస్టమ్ జెనరేటెడ్ క్లెయిమ్’ అనే ఫీచర్‌ను జోడిస్తున్నారు. దీనివల్ల సిస్టమ్ నిరుపయోగంగా ఉన్న ఖాతాల క్లెయిమ్‌లను స్వయంగా ప్రాసెస్ చేస్తుంది. ఈ ఐటీ అప్‌గ్రేడేషన్ ప్రక్రియ ఆగస్టు చివరి నాటికి పూర్తవుతుందని, ఆ తర్వాత నేరుగా డబ్బుల బదిలీ ప్రారంభమవుతుందని అంచనా.

పెద్ద మొత్తంలో ఉన్న ఖాతాలకూ వర్తింపు

రూ.1,000 వరకు ఉన్న ఖాతాలపై చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, ప్రభుత్వం దీనిని పెద్ద ఎత్తున విస్తరించనుంది. ఆ తర్వాత రూ.1,000 కంటే ఎక్కువ సొమ్ము ఉన్న 24.76 లక్షల ఇన్‌యాక్టివ్ ఖాతాల నిధులను కూడా ఇదే రీతిలో ఆటోమేటిక్‌గా ఖాతాదారులకు రీఫండ్ చేస్తారు. గణాంకాల ప్రకారం, ఉద్యోగాలు మారడం లేదా పాత కంపెనీల నుంచి పీఎఫ్ నిధులను క్లెయిమ్/ట్రాన్స్‌ఫర్ చేసుకోకపోవడం వల్ల గత రెండు దశాబ్దాల్లో దాదాపు 31.86 లక్షల ఇన్‌యాక్టివ్ ఖాతాలు ఏర్పడ్డాయి. వీటిలో ఏకంగా రూ.10,903 కోట్ల భారీ మొత్తం క్లెయిమ్ కాకుండా నిరుపయోగంగా పడి ఉంది. ఈపీఎఫ్‌ఓ తీసుకొచ్చిన ఈ కొత్త ఆటోమేటిక్ సిస్టమ్‌తో కోట్లాది మంది చందాదారులకు పెద్ద ఉపశమనం లభించనుంది.