Energy Demand in India: ఈ దశాబ్దంలో ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా ఇండియాలోనే ఎనర్జీకి భారీగా డిమాండ్ పెరగనుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) అంచనా వేసింది. లేటెస్టుగా విడుదల చేసిన వరల్డ్ ఎనర్జీ ఔట్‌లుక్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. పట్టణీకరణ మరియు పారిశ్రామికీకరణ నేపథ్యంలో భారతదేశంలో ఎనర్జీకి గిరాకీ ఏటా 3 శాతం పెరుగుతుండటమే ఇందుకు కారణమని తెలిపింది. 2025 నాటికి ఇండియా అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఎదగనుండటం మరో కారణమని పేర్కొంది.
2030 నాటికి విద్యుత్ డిమాండ్ 60 శాతం పెరుగుతుందని, ఓవరాల్ ఎనర్జీ డిమాండ్‌లో 3వ వంతును బొగ్గు తీరుస్తుందని వివరించింది. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై ఇండియా ఫోకస్ పెట్టినప్పటికీ, సమర్థవంతమైన విధానాలను రూపొందించినప్పటికీ వచ్చే రెండు దశాబ్దాల్లో శిలాజ ఇంధనాల మరియు చమురు దిగుమతులు రెట్టింపు కానున్నాయి. ఫలితంగా దేశంలో ఇంధన భద్రతకు ముప్పు కొనసాగే ప్రమాదం ఉందని ఐఈఏ హెచ్చరించింది.
‘‘ప్రస్తుతం ప్రపంచం తొలి అంతర్జాతీయ ఇంధన సంక్షోభానికి సంబంధించి మధ్య దశలో ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్ల పరిస్థితి మరింత దిగజారింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి ముందే మార్కెట్లలో ఒత్తిళ్లు నెలకొన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి వల్ల ఎనర్జీ సహా దాదాపు అన్ని గ్లోబల్ సప్లై చెయిన్లు దెబ్బతిన్నాయి. ఇదిలాఉండగా 2021లో రోజుకి 4.7 మిలియన్ బ్యారెళ్ల చమురు వాడకం జరగ్గా ఈ డిమాండ్ 2030 నాటికి దాదాపు 7 మిలియన్ బ్యారెళ్లకు పెరగనుంది’’ అని ఐఈఏ పేర్కొంది.