Elon Musk: అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న భారీ పతనంతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ (Elon Musk) సంపద ఒక్కసారిగా కరిగిపోయింది. టెస్లా (Tesla), స్పేస్ ఎక్స్ (SpaceX) షేర్లు మంగళవారం గ్లోబల్ స్టాక్ సెల్-ఆఫ్‌లో ఘోరంగా పడిపోవడంతో.. మాస్క్ తన ‘ట్రిలియనీర్’ (లక్ష కోట్ల డాలర్ల అధిపతి) హోదాను కోల్పోయారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ప్రస్తుతం ఆయన నికర ఆస్తి విలువ 957 బిలియన్ డాలర్లకు పడిపోయింది.
కేవలం రోజుల వ్యవధిలోనే..
ఈ నెల ప్రారంభంలో స్పేస్ ఎక్స్ కంపెనీ చారిత్రాత్మక ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ టైంలో కంపెనీ మార్కెట్ విలువ 2 ట్రిలియన్ డాలర్లు దాటడంతో మస్క్ అధికారికంగా ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్‌గా అవతరించారు. అంతరిక్ష రంగంలో సరికొత్త ఆవిష్కరణలు చేస్తామన్న స్పేస్ ఎక్స్ హామీలతో ఇన్వెస్టర్లు ఎగబడి షేర్లు కొనడంతో కొద్దిరోజుల పాటు ఈ స్టాక్ విలువ విపరీతంగా పెరిగింది. అయితే ఈ వారం సీన్ రివర్స్ అయింది. జూన్ 16న గరిష్టంగా $225 పలికిన స్పేస్ ఎక్స్ షేరు విలువ, మంగళవారం నాటికి ఏకంగా 30 శాతానికి పైగా పతనమై $156 వద్ద ముగిసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బబుల్ పేలిపోతుందనే భయాలు, వడ్డీ రేట్ల పెంపు అంచనాల మధ్య టెక్నాలజీ స్టాక్స్ భారీగా నష్టపోవడమే ఈ కంపెనీ నష్టానికి ప్రధాన కారణం అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
స్పేస్ ఎక్స్ భారీ నష్టాలే దెబ్బ తీశాయా..
స్పేస్ ఎక్స్ కంపెనీ అంతరిక్షంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం, అంగారకుడి (Mars) పైకి మానవులను పంపడం వంటి అద్భుతమైన లక్ష్యాలను పెట్టుకున్నప్పటికీ, దాని మార్కెట్ విలువపై కొందరు విశ్లేషకులు మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఐపీఓ కంటే ముందు కంపెనీ దాఖలు చేసిన ‘S-1 ఫైలింగ్’ ప్రకారం.. స్పేస్ ఎక్స్ 2025లో ఏకంగా 4.9 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది. ముఖ్యంగా కంపెనీకి చెందిన ఏఐ సెగ్మెంట్ కోసమే ఏకంగా 12.7 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులు పెట్టడం గమనార్హం. ఎలాన్ మస్క్ మొత్తం ఆస్తిలో 80 శాతం వాటా స్పేస్ ఎక్స్ కంపెనీదే. మంగళవారం నాటికి ఇందులో ఆయన షేర్ల విలువ 744 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక టెస్లా కంపెనీలో ఆయనకున్న 158 బిలియన్ డాలర్ల వాటా కూడా ఈ మార్కెట్ పతనంలో దెబ్బతింది.
అయినా సారే నంబర్ 1 ..
మార్కెట్ ఒడిదొడుకుల వల్ల మస్క్ ట్రిలియనీర్ హోదాను కోల్పోయినప్పటికీ, ప్రపంచ ధనవంతుల జాబితాలో ఇప్పటికీ ఆయనే టాప్‌లో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో ఉన్న గూగుల్ కో-ఫౌండర్ లారీ పేజ్ కంటే మాస్క్ ఆస్తి దాదాపు 660 బిలియన్ డాలర్లు ఎక్కువ. సింపుల్‌గా చెప్పాలంటే.. వీరిద్దరి మధ్య ఉన్న ఆస్తి వ్యత్యాసం ఇద్దరు ‘జెఫ్ బెజోస్’ల మొత్తం ఆస్తి కంటే ఎక్కువ కావడం విశేషం. స్పేస్ ఎక్స్ షేర్లు మళ్లీ పుంజుకుంటే మాస్క్ తిరిగి ట్రిలియనీర్ క్లబ్‌లోకి చేరడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు.

