రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య రంగం అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, వంటనూనెలు, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల వల్ల త్వరలో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా పెరగనున్నాయి. సెమీకండక్టర్ చిప్స్ తయారీలో కీలక ముడి వస్తువులుగా ఉన్న పల్లాడియం, నియాన్ ఎగుమతిలో ఉక్రెయిన్, రష్యాలే సింహా భాగాన్ని ఆక్రమించాయి. అంతేకాకుండా ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్న పల్లాడియంలో 44 శాతం ఒక్క రష్యా నుంచే సరఫరా అవుతోంది. ఇటు ఉక్రెయిన్ సైతం 70 శాతం మేర నియాన్‌ను ప్రపంచ దేశాలకు అందిస్తోంది.
ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పల్లాడియం, నియాన్ ఎగుమతిపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇప్పటికే సెమీకండక్టర్ల కొరత టెక్ రంగాన్ని వేధిస్తుండగా ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం దానిని మరింత చిక్కుల్లోకి నెడుతోంది. ఒకవేళ నియాన్, పల్లాడియం సరఫరాలో అంతరాయం ఏర్పడితే సెమీకండక్టర్‌ల ఆధారంగా నడిచే స్మార్ట్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు సహా ఇతర ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్లపై ప్రభావం పడనుంది. దీంతో పలు ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరిగే అవకాశముందని మార్కెట్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో 2014-15 సమయంలో రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం సమయంలో నియాన్ ధరలు పెరగడంతో ఆ ప్రభావం సెమీకండక్టర్ల మీద పడిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు.