Site icon NTV Telugu

Central Governement: ప్యాకెట్‌లో ఎంత నూనె ఉందో కచ్చిత సమాచారం ముద్రించాలి.. ఆయిల్ కంపెనీలకు ఆదేశాలు

Oil Packets

Oil Packets

Central Governement: దేశంలోని వంటనూనె తయారీ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. వంటనూనెలను ప్యాకింగ్ చేసే సమయంలో ఉష్ణోగ్రత ఎంత ఉందనే వివరాలు ఇవ్వడానికి బదులుగా ప్యాకెట్ లేదా సీసాలో ఎంత నూనె ఉందో తెలిపే ఘనపరిమాణం, బరువు వివరాలను ముద్రించాలని వంటనూనెల తయారీ కంపెనీలు, ప్యాకర్లు, దిగుమతిదార్లను కేంద్రం ఆదేశించింది. తూకం విషయంలో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కేంద్రం వివరించింది. వివరాల ముద్రణలో ఈ మార్పులు చేపట్టేందుకు 2023 జనవరి 15 వరకు కంపెనీలకు సమయం ఇచ్చినట్లు వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. వివిధ ఉష్ణోగ్రతల్లో వంటనూనెల బరువు వేర్వేరుగా ఉంటుంది. దీని ఆధారంగా కంపెనీలకు మోసాలకు పాల్పడుతున్నట్లు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించింది.

Read Also: International Dogs Day: ప్రతి కుక్కకు ఓ రోజు.. ఆ రోజు ఈ రోజే..!!

అటు లీగల్ మెట్రాలజీ రూల్స్ 2011 ప్రకారం అన్ని ప్రీ ప్యాకేజ్డ్ వస్తువులపై నికర పరిమాణాన్ని ప్రామాణిక యూనిట్లలో తప్పనిసరిగా ప్రకటించాలి. ఈ నిబంధనల కింద వంటనూనెలు, వనస్పతి, నెయ్యి వంటి వస్తువుల నికర పరిమాణాన్ని బరువు లేదా ఘనపరిమాణాన్ని తయారీ కంపెనీలు ప్రకటించాలి. ఘన పరిమాణాన్ని పేర్కొంటే అందుకు సమానమైన బరువును తప్పనిసరిగా పేర్కొనాలి. అయితే కొన్ని పరిశ్రమలు ద్రవ్యరాశి యూనిట్లతో పాటు ప్యాకింగ్ సమయంలో ఉష్ణోగ్రతలను పేర్కొంటున్నాయి. కొన్ని కంపెనీలు ప్యాకెట్లపై 60 డిగ్రీల సెల్సియస్ వంటి అధిక ఉష్ణోగ్రతను ముద్రిస్తున్నారు. వంటనూనెలు, నెయ్యి వంటి వాటి ప్యాకింగ్ సమయంలో అధిక ఉష్ణోగ్రత ఉన్నట్లు తెలిపి పరిమాణాన్ని స్థిరంగా ఉంచి ద్రవ్యరాశిని మారుస్తున్నారని కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. సాధారణంగా లీటర్ పరిమాణం ఉన్న వంటనూనె ప్యాకెట్‌ను 30 డిగ్రీల సెల్సియస్‌లో ప్యాక్ చేయాలి. ఒకవేళ 21 డిగ్రీల సెల్సియస్‌ వద్ద ప్యాక్ చేస్తే బరువును 919 గ్రాములుగా పేర్కొనాలి. 60 డిగ్రీల సెల్సియస్‌ వద్ద ప్యాక్ చేస్తే బరువును 892.6 గ్రాములుగా ప్యాకెట్‌పై ముద్రించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఉష్ణోగ్రత వివరాలకు బదులుగా నూనె పరిమాణం, బరువు వివరాలను ప్రచురించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Exit mobile version