Income Tax Returns: 2021-22 ఆర్ధిక సంవత్సరానికి ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే ఆఖరు తేదీ ముగిసిపోయింది. జూలై 31లోగా రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంది. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసి ఇ-వెరిఫై పూర్తి చేయలేదా.. అయితే వెంటనే ఆ పని పూర్తి పనిచేయండి. ఆగస్టు 1 నుంచి ఈ గడువును 30 రోజులకు తగ్గిస్తూ ఆదాయపు పన్ను విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటివరకు ఈ గడువు 120 రోజులు ఉండేది. సాధారణంగా ఆధార్ ఓటీపీ, నెట్ బ్యాంకింగ్, బ్యాంక్ ఈవీసీ, డిజిటల్ సంతకం తదితర మార్గాల్లో ఇ-వెరిఫై చేయవచ్చు. లేదంటే ఫారం-5లో సంతకం చేసి సీపీసీ, బెంగళూరుకు పోస్టులో పంపే అవకాశం కూడా ఉంది. ఇ-వెరిఫై లేదా ఫారం-5ను సీపీసీకి పంపకపోతే రిటర్నులు దాఖలు చేసినా అవి ఆమోదం పొందవు. గడువు దాటితే రిటర్నులను తిరస్కరించే అవకాశం కూడా ఉంది. ఇకపై ఐటీ రిటర్నులు దాఖలు చేసిన 30 రోజుల్లోగా ఇ-వెరిఫై పూర్తి చేయాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Read Also: యాలకులు రోజూ తీసుకుంటే.. ఎన్నో లాభాలు
కాగా జూలై 31లోగా ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే డిసెంబర్ 31, 2022 లోగా అపరాధ రుసుముతో ఫైల్ చేయాల్సి ఉంటుంది. అప్పటికీ అంటే డిసెంబర్ 31 నాటికి కూడా ఫైల్ చేయకపోతే ఇన్‌కంటాక్స్ కమిషనర్‌కు అప్పీల్ చేయాల్సి ఉంటుంది. అపరాధ రుసుము వార్షిక ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. మీ వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉంటే జరిమానాగా రూ.వెయ్యి చెల్లించాలి. ఒకవేళ వార్షిక ఆదాయం 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే మాత్రం రూ.5వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ మొత్తం ఆదాయం కనీస పరిమితి దాటకపోతే లేట్ ఫీజు లేకుండా ఇన్‌కంట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయవచ్చు.
