DefExpo-2022: గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నిర్వహిస్తున్న డిఫెన్స్ ఎక్స్‌పో 12వ ఎడిషన్‌లో ఇప్పటికే లక్షన్నర కోట్లకు పైగా విలువైన 451 అవగాహన ఒప్పందాలు(ఎంఓయూలు), ఒడంబడికలు కుదిరాయని అధికారులు తెలిపారు. దీంతో బిజినెస్ జనరేషన్‌కి సంబంధించిన పాత రికార్డులన్నీ బద్ధలైనట్లు చెప్పారు. గతంలో ఎప్పుడూ ఈ రేంజ్‌లో డిఫెన్స్ ఎక్స్‌పో జరగలేదని, ఈసారి అత్యధిక సంఖ్యలో ఎగ్జిబిటర్లు, వేల సంఖ్యలో బిజినెస్ విజిటర్స్ హాజరవుతున్నారని డిఫెన్స్ సెక్రెటరీ అజయ్ కుమార్ వెల్లడించారు.
18వ తేదీన ప్రారంభమైన ఈ ప్రదర్శన రేపటి వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్‌వ్రత్ హాజరయ్యారు. ఇప్పటివరకు ఇదే ‘‘ది బెస్ట్’’, మోస్ట్ ఔట్‌స్టాండింగ్ డిఫెన్స్ ఎక్స్‌పో అని, మన దేశ రక్షణ రంగ సాధికారతలో సరికొత్త యుగానికి నాంది పలికిందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌సాథ్ సింగ్ అన్నారు. ఇండియన్ డిఫెన్స్ సెక్టార్ స్వావలంబనలో ఇది ఆరంభమని, భవిష్యత్.. భారతదేశానిదే అనే సందేశాన్ని ఈ ప్రదర్శన చాటిందని తెలిపారు.
గ్లోబల్ డిఫెన్స్ మ్యానిఫ్యాక్షరింగ్ హబ్‌గా ఇండియా ఎదగబోతోందనే వాస్తవాన్ని సైతం ఈ కార్యక్రమం కళ్లకు కట్టినట్లు రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. రెండేళ్ల కిందట(2020లో) ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన డిఫెన్స్ ఎక్స్‌పోలో 201 ఎంఓయూలు మాత్రమే కుదిరినట్లు అధికారులు గుర్తు చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎక్స్‌పోలో ఎంఓయూలు, ఒడంబడికలు పరిశ్రమ-పరిశ్రమ, పరిశ్రమ-రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమ-కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగినట్లు వెల్లడించారు.
