Cash vs Credit Cards: భారత్‌లో ప్రజల చెల్లింపుల విధానంలో భారీ మార్పు చోటుచేసుకుంటోంది. ఒకప్పుడు నగదు లావాదేవీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ప్రజలు ఇప్పుడు క్రమంగా డిజిటల్ చెల్లింపులు, క్రెడిట్ కార్డుల వినియోగం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మార్పునకు తాజాగా వెలువడిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గణాంకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
దేశ చరిత్రలో తొలిసారిగా 2026 అక్టోబర్ నెలలో ఏటీఎంల ద్వారా ప్రజలు విత్‌డ్రా చేసిన నగదు కంటే క్రెడిట్ కార్డుల ద్వారా చేసిన ఖర్చు ఎక్కువగా నమోదైంది. క్రెడిట్ కార్డు ఖర్చు రూ.2.4 లక్షల కోట్ల మార్కును దాటగా, ఏటీఎంల ద్వారా విత్‌డ్రా చేసిన నగదు రూ.2.3 లక్షల కోట్లకు పరిమితమైంది. ఓ నేషనల్ మీడియా కథనం ప్రకారం ఆర్‌బీఐ గణాంకాల్లో ఈ ఆసక్తికరమైన మార్పు వెల్లడైంది.
భారత్‌లో ప్రజల ఆర్థిక లావాదేవీల అలవాట్లు గత కొన్నేళ్లుగా గణనీయంగా మారుతున్నాయి. ముఖ్యంగా క్రెడిట్ కార్డుల వినియోగం పెరుగుతుండగా, ఏటీఎంల నుంచి నగదు తీసుకునే విధానానికి సంబంధించిన గణాంకాల్లో మార్పు కనిపిస్తోంది. 2019 నవంబర్‌లో ఏటీఎంల ద్వారా విత్‌డ్రా చేసిన నగదు విలువ క్రెడిట్ కార్డుల ద్వారా చేసిన ఖర్చుతో పోలిస్తే దాదాపు ఐదు రెట్లు ఎక్కువగా ఉండేది. అయితే ఏడేళ్ల వ్యవధిలో ఈ నిష్పత్తి క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2019 నవంబర్‌లో 470 శాతంగా ఉన్న ఏటీఎం నగదు విత్‌డ్రా, క్రెడిట్ కార్డు ఖర్చుల నిష్పత్తి 2026 అక్టోబర్ నాటికి 95.1 శాతానికి పడిపోయింది. అంటే క్రెడిట్ కార్డు ఖర్చులు ఏటీఎం నగదు విత్‌డ్రాను తొలిసారిగా అధిగమించాయి.
కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ సమయంలో ప్రజల చెల్లింపుల విధానంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయనే ఆందోళనతో చాలామంది ముందుగానే ఏటీఎంల నుంచి నగదు తీసుకున్నారు. 2020 ఏప్రిల్‌లో ఏటీఎం నగదు విత్‌డ్రాలు క్రెడిట్ కార్డు ఖర్చులతో పోలిస్తే ఏకంగా 6.2 రెట్లు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ కాలంలో అత్యధిక నిష్పత్తి ఇదే. ఆ సమయంలో ఏటీఎంల ద్వారా విత్‌డ్రా చేసిన నగదు రూ.1.3 లక్షల కోట్లకు చేరుకోగా, లాక్‌డౌన్ కారణంగా క్రెడిట్ కార్డు ఖర్చులు భారీగా తగ్గి రూ.20,765 కోట్లకు పరిమితమయ్యాయి.
కేవలం నగదు విలువలోనే కాకుండా లావాదేవీల సంఖ్యలోనూ ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. 2026 అక్టోబర్‌లో క్రెడిట్ కార్డుల ద్వారా 6,833 లక్షల లావాదేవీలు జరగగా, ఏటీఎంల ద్వారా నగదు విత్‌డ్రాలు 4,229 లక్షలుగా నమోదయ్యాయి. ఈ సమయంలో ఏటీఎం నగదు విత్‌డ్రాల సంఖ్య క్రెడిట్ కార్డు లావాదేవీల సంఖ్యలో కేవలం 61.5 శాతంగా ఉంది. ఈ కాలంలో నమోదైన అత్యల్ప నిష్పత్తి ఇదే. మరోవైపు 2020 మే నెలలో అత్యధికంగా 3.9 రెట్ల నిష్పత్తి నమోదైంది. అంటే ఆ సమయంలో క్రెడిట్ కార్డు లావాదేవీలతో పోలిస్తే ఏటీఎం నగదు విత్‌డ్రాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.
తాజా గణాంకాలు దేశంలో డిజిటల్ చెల్లింపులు, కార్డు ఆధారిత లావాదేవీల వినియోగం పెరుగుతున్న తీరును సూచిస్తున్నాయి. ఆన్‌లైన్ షాపింగ్, ఈఎంఐ సదుపాయాలు, రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు వంటి అంశాలు క్రెడిట్ కార్డుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. అయితే క్రెడిట్ కార్డు వినియోగం పెరగడం అంటే ప్రజలు నగదును పూర్తిగా వదిలేశారని అర్థం కాదు. ఏటీఎంల ద్వారా నగదు విత్‌డ్రాలు ఇప్పటికీ భారీ స్థాయిలోనే కొనసాగుతున్నాయి.

