టాటా ట్రస్ట్‌లో కొద్ది నెలలుగా కొన్నసాగుతున్న అంతర్యుద్ధం తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అంతర్గత విభేదాలు టాటా గ్రూప్ వాతావరణాన్ని ఛిన్నాభిన్నం చేసి అశాంతికి దారి తీసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఇటీవల జరిగిన టాటా గ్రూప్ భేటీ వేదికైంది. రతన్ టాటా మరణించిన ఏడాది తర్వాత సెప్టెంబర్ 11న జరిగిన టాటా ట్రస్టుల సమావేశంలో విభేదాలు బయటపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Pakistan-US: అమెరికా నుంచి అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేసే యోచనలో పాక్!
అయితే ప్రస్తుతం టాటా గ్రూప్‌లో తలెత్తిన సమస్యను పరిష్కరించాలని కేంద్ర నాయకత్వాన్ని టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా కోరినట్లు సమాచారం. దీంతో కేంద్ర పెద్దలు రంగంలోకి దిగి మంతనాలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. ఈ వారం ఢిల్లీలో ఇద్దరు సీనియర్ కేబినెట్ మంత్రులు.. నలుగురు టాప్ టాటా అధికారులతో చర్చలు జరిపినట్లు సమాచారం. నోయెల్ టాటా (టాటా ట్రస్ట్స్ చైర్మన్), వేణు శ్రీనివాసన్ (టాటా ట్రస్ట్స్ వైస్ చైర్మన్), ఎన్ చంద్రశేఖరన్ (టాటా సన్స్ చైర్మన్), డారియస్ ఖంబాటా (టాటా ట్రస్ట్స్ ట్రస్టీ)తో కేంద్ర మంత్రులు చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు సానుకూల ఫలితాన్ని ఇవ్వలేనట్లు వినికిడి.
ఇది కూడా చదవండి: Trump-Mark Carney: భారత్-పాక్ యుద్ధాన్ని ఆపారు.. ట్రంప్‌పై కెనడా ప్రధాని ప్రశంసలు
విభేదాలు కొలిక్కి రాకపోవడంతో తాజాగా ఈ పంచాయితీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దగ్గరకు చేరింది. దాదాపు గంట సేపు టాటా ట్రస్ట్ ముఖ్యనేతలతో అమిత్ షా చర్చలు జరిపారు. అంతర్గత విభేదాలు విడిచిపెట్టాలని.. మునుపటిలాగానే కలిసి మెలిసి పని చేయాలని అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది. అయితే విభేదాలకు కారణమైన చర్యలను ప్రస్తుతం పక్కన పెట్టి నిర్ణయాత్మక చర్యల దిశగా ముందుకు సాగిపోవాలని సూచించినట్లు సమాచారం. మెజారిటీ వాటా ‘ప్రజా బాధ్యత’ అని అమిత్ షా, నిర్మలా సీతారామన్ టాటా ప్రతినిధులకు సూచించినట్లు తెలుస్తోంది.
టాటా గ్రూప్ భారతదేశంలోనే అతిపెద్ద కంపెనీ. దేశ ప్రజల మన్ననలు పొందిన కంపెనీ. అలాంటి కంపెనీలో తీవ్ర విభేదాలు చోటుచేసుకోవడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. అక్టోబర్ 9, 2024న రతన్ టాటా మరణించారు. గురువారం రతన్ టాటా మొదటి వర్ధంతి జరగనుంది. రెండు రోజుల పాటు స్మారక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అంతర్యుద్ధం సాగుతున్న నేపథ్యంలో విభేదాలు పక్కన పెట్టి టాటా గ్రూప్ నాయకులు వర్ధంతి కార్యక్రమానికి హాజరవుతారా? లేదంటే ఎడముఖం..పెడముఖం పెడతారో చూడాలి. కేంద్ర పెద్దల సలహాలను ఎంత వరకు గౌరవిస్తారో చూడాలి.
