DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్‌డేట్..

Govt Employees Leave 1585293788 1

Govt Employees Leave 1585293788 1

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రస్తుతం డీఏ పెంపు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా ప్రతి ఏటా జనవరి, జూలై నెలల నుండి ఈ డీఏ పెంపు అమల్లోకి వస్తుంది. అయితే 2026 జూలైకి సంబంధించిన డీఏ పెంపుపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో అసలు డీఏ ఎప్పుడు పెరుగుతుంది, ఒకవేళ జూలైలో ప్రకటించకపోతే ఈ శుభవార్త ఎప్పుడు వినాల్సి వస్తుందనే ఆందోళన లక్షలాది మంది ఉద్యోగులలో నెలకొంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 60 శాతం డీఏ అందుతోంది. ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం దీనిని 58 శాతం నుండి 60 శాతానికి పెంచింది. రాబోయే పెంపులో డీఏ 3 నుండి 4 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI-IW) గణాంకాలు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నిరంతరంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. జూన్ నెల గణాంకాలు వచ్చిన తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ జూలైలో దీనిపై ఎలాంటి ప్రకటన రాకపోయినా ఉద్యోగులు నిరాశ పడాల్సిన అవసరం లేదు. గత కొన్నేళ్ల రికార్డులను పరిశీలిస్తే, కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో, అంటే దీపావళి పండుగ కంటే ముందే డీఏ పెంపును ప్రకటించే ఆనవాయితీని కొనసాగిస్తోంది. ఈ ఏడాది కూడా అదే జరిగే అవకాశం ఉంది. డీఏ పెరగడం వల్ల ఉద్యోగుల చేతికి వచ్చే జీతం మాత్రమే కాకుండా పెన్షన్, గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) వంటి ఇతర ప్రయోజనాలు కూడా పెరుగుతాయి. దేశవ్యాప్తంగా రక్షణ, రైల్వే రంగాలతో కలిపి సుమారు 50 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు ఈ పెంపు కోసం వేచి చూస్తున్నారు. ప్రతి ఉద్యోగికి వచ్చే పెంపు వారి బేసిక్ శాలరీ, పే-లెవెల్ ఆధారంగా మారుతుంది.

మరోవైపు 8వ వేతన సంఘం ఏర్పాటుపై కూడా చర్చలు జోరందుకున్నాయి. నివేదికల ప్రకారం.. ఈ కమిషన్ తన సిఫార్సులను 2027 ప్రారంభంలో లేదా మధ్యలో సమర్పించే అవకాశం ఉంది. అయితే.. ఈ సిఫార్సులు పూర్తిగా అమలు కావడానికి సాధారణంగా రెండు నుండి మూడు సంవత్సరాల సమయం పడుతుంది. దీని ప్రకారం ఉద్యోగులకు 8వ వేతన సంఘం పూర్తి ప్రయోజనాలు 2029 లేదా 2030 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఉద్యోగులందరి దృష్టి జూన్ నెల AICPI-IW గణాంకాలు, ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి నిర్ణయంపైనే ఉంది.