Site icon NTV Telugu

Byju’s: బైజూస్ సీఈఓ రవీంద్రన్‌పై వేటు.. తొలగించాలని ఇన్వెస్టర్ల ఓటు

Bijus

Bijus

Byju’s: ప్రముఖ ఎడ్ టెక్ సంస్థ బైజూస్ ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. కరోనా కాలంలో ఓ వెలుగు వెలిగిన సంస్థ ఇప్పుడు చిక్కుల్లో పడింది. తాజాగా సీఈఓ రవీంద్రన్ తొలగింపుకు ఇన్వెస్టర్లు ఓటేశారు. శుక్రవారం ప్రత్యేక అసాధారణ సమావేశానికి పిలుపునిచ్చిన ఇన్వెస్లర్లు అతడిని తొలగించాలని ఓటేశారు. ప్రోసస్, జనరల్ అట్లాంటిక్, సోఫినా, పీక్ ఎక్స్ సహ భాగస్వాములుగా ఉన్న బైజూస్ వాటాదారులు దాని వ్యవస్థాపకుడైన జైజు రవీంద్రన్‌ని తొలగించడానికి మొగ్గు చూపారు. ఈ సమావేశాన్ని నిలిపేయాలంటూ బైజూస్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా, రవీంద్రన్‌కి చుక్కెదురైంది.

Read Also: MLA Lasya Nanditha: ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంపై కేసు నమోదు

అంతకుముందు కంపెనీలో చోటు చేసుకున్న వివాదాలపై ఎన్‌సీఎల్‌టీ బెంగళూర్ ధర్మసనాన్ని ఆశ్రయించింది. కంపెనీని నడిపించేందుకు రవీంద్రన్ సహా, ఇతర వ్యవస్థాపకులు అనర్హులుగా ప్రకటించాలని, కొత్త బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఇన్వెస్టర్ల హక్కులకు భంగం కలిగించేలా ఎలాంటి కార్పొరేట్ చర్యలకు కంపెనీ దిగకూడదని కోరుతూ నిలువరించాలని కోరారు. దాదాపుగా రూ. 9300 కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్య ఉల్లంఘనలకు పాల్పడినట్లు గత నవంబర్‌లో ఈడీ అభియోగాలు దాఖలు చేసింది. మరోవైపు రవీంద్రన్ విదేశాలకు పారిపోకుండా ఈడీ ఆంక్షలు విధించింది. లుకౌట్ సర్క్యూలర్ జారీ చేసింది.

ఒకప్పుడు 22 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీకి నాయకుడిగా ఉన్న రవీంద్రన్, దేశాన్ని తన వైపు ఆకర్షించారు. మహమ్మారి సమయంలో చాలా వేగంగా విస్తరించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే, పాఠశాలలు ప్రారంభం కావడంతో ఆన్‌లైన్ ట్యూరోరియల్ డిమాండ్ పడిపోవడంతో బైజూస్ ఆర్థిక చిక్కుల్లో పడింది. కొంతమంది బోర్డు సభ్యులు రాజీనామా చేయగా.. ఉద్యోగుల జీతాల కోసం రవీంద్రన్ తన ఇంటితో పాటు అతని కుటుంబ సభ్యుల యాజమాన్యాన్ని తాకట్టుపెట్టాడు.

Exit mobile version