Business Today: ఏపీలో బంగారం తవ్వకాల దిశగా..: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో బంగారం తవ్వకాల దిశగా ఎప్పుడో విజయవంతంగా తొలి అడుగు వేసిన ఎన్‌ఎండీసీ.. ఇప్పుడు రెండో అడుగు కూడా ముందుకేసింది. మైనింగ్ లైసెన్స్ పొందేందుకు కన్సల్టెంట్ నియామకానికి తాజాగా తెర తీసింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. లైసెన్స్ లభిస్తే నాలుగేళ్ల నిరీక్షణ ఫలించినట్లవుతుంది. 2018లో గోల్డ్ మైనింగ్ బ్లాక్‌ను ఇ-ఆక్షన్ ద్వారా పొందిన ఎన్‌ఎండీసీకి బంగారం తవ్వకాలకు సంబంధించి ఇదే మొట్టమొదటి గని అవుతుంది.
క్వింటా మిర్చి రూ.90 వేలు
వరంగల్‌లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో క్వింటా మిర్చి ధర 90 వేల రూపాయలు పలకటం విశేషం. దీంతో.. రేటు పరంగా లోకల్ మిర్చి మరోసారి మెరిసినట్లయింది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రాలకుంటకు చెందిన ఒక వ్యక్తి విజయదుర్గా ట్రేడర్స్‌కి నాలుగున్నర క్వింటాళ్ల మిర్చిని 11 బస్తాల్లో విక్రయానికి తీసుకురాగా నందినీ చిల్లీస్ నిర్వాహకులు ఈ ధర పెట్టి కొనుగోలు చేయటం రాష్ట్ర స్థాయిలో వార్తల్లో నిలిచింది. ఊహించని రేటు రావటంతో రైతు ఆనందం వ్యక్తం చేశారు.
అమెరికా టెక్నాలజీతో హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్స్
నవరత్న హోదా కలిగిన రక్షణ పరికరాల తయారీ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్.. అమెరికాలోని ట్రైటాన్ ఎలక్ట్రిక్ వెహికిల్ అనే సంస్థతో కలిసి హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్స్‌ను రూపొందించనుంది. ఇండియన్ మార్కెట్‌తోపాటు పరస్పర అంగీకారం కలిగిన ఎగుమతి మార్కెట్ల అవసరాల కోసం ఆ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రవాణా మరియు ఇంధన నిల్వ రంగాల్లో క్లీన్ ఎనర్జీ ఫ్యూయెల్స్ అవసరాలను తీర్చే లక్ష్యంతోనే MOU చేసుకున్నట్లు BEL ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా సంస్థ TEVకి ఇండియాలో R & D కేంద్రం ఉంది. హైడ్రోజన్‌తో నడిచే 2, 3, 4 వీలర్స్‌ను తయారుచేస్తోంది.
పన్నులపై సలహాలు కోరిన ఆర్థిక శాఖ
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌లో విధించనున్న ప్రత్యక్ష, పరోక్ష పన్నులపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.. వాణిజ్య మరియు పరిశ్రమ సంఘాల సలహాలు కోరింది. కొత్త బడ్జెట్ రూపకల్పన కోసం కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికే వివిధ వర్గాలతో సంప్రదింపుల ప్రక్రియకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సంబంధిత వర్గాలు తమ సలహాలు, సూచనలు, డిమాండ్లను రాతపూర్వకంగా తెలియజేయటమే కాకుండా వాటికి సమర్థనీయంగా ఉండే పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు నవంబర్ 5ను చివరి తేదీగా నిర్ణయించారు.
ఒక బిలియన్ డాలర్ల ఫండ్ రైజ్‌పై ‘కొటక్’ ఫోకస్
ఈ ఏడాది చివరి నాటికి కొత్తగా ఒక బిలియన్ డాలర్ల నిధుల సేకరణ పైన మరియు వచ్చే ఏడాది చేపట్టనున్న నూతన పెట్టుబడుల పైన కొటక్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ లిమిటెడ్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దేశంలోని టాప్-5 సిటీల్లోని రెసిడెన్షియల్ ప్రాపర్టీల మీద ప్రత్యేకంగా దృష్టిసారించిందని అంటున్నారు. అబుదబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ నుంచి 500 మిలియన్ డాలర్లు, అలియెంజ్ ఎస్‌ఈ నుంచి 220 మిలియన్ డాలర్లు ఫండ్ రైజ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
25 శాతం పెరిగిన ‘‘టాటా’’ నికర లాభం
జులై, ఆగస్ట్, సెప్టెంబర్ త్రైమాసికంలో టాటా కమ్యూనికేషన్స్ సంస్థ నికర లాభం 25 శాతం పెరిగి 532 కోట్ల రూపాయలకు పైగా చేరింది. గతేడాది ఇదే సమయంలో నెట్ ప్రాఫిట్ 425 కోట్ల రూపాయలు మాత్రమే కావటం గమనించాల్సిన విషయం. కంపెనీ ఆపరేషన్స్ ద్వారా వచ్చిన ఆదాయంలో 6 శాతం వృద్ధి నమోదైందని, తద్వారా 4 వేల 430 కోట్లు ఆర్జించినట్లు రెగ్యులేటరీకి సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఈ రెవెన్యూ గతేడాది ఇదే పీరియడ్‌లో 4 వేల 174 కోట్లు మాత్రమేనని వెల్లడించింది. ఇంటర్నేషనల్ మార్కెట్లలో మంచి గ్రోత్ నెలకొనటం పట్ల హర్షం వ్యక్తం చేసింది.
స్టాక్ మార్కెట్ అప్‌డేట్
వరుసగా 2వ రోజూ ఇవాళ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. గ్లోబల్ మార్కెట్లలోని పరిస్థితులు ఇండియన్ మార్కెట్లకు మద్దతుగా నిలుస్తున్నాయి. దీంతో సెన్సెక్స్ 276 పాయింట్లు పెరిగి 59237 వద్ద ట్రేడింగ్ అవుతోంది. నిఫ్టీ 84 పాయింట్ల స్వల్ప లాభంతో 17571 వద్ద కొనసాగుతోంది. అదానీ ట్రాన్స్‌మిషన్, బీఈఎల్, పిరమల్ ఫార్మా, టెలికం, షల్బీ సంస్థల స్టాక్స్ ఆశాజనకంగా ఉన్నాయి. రూపాయి మారకం విలువ 11 పైసలు పెరిగింది. ప్రస్తుతం 82.27 పలుకుతోంది.
