Business Today: తెలంగాణకు 3, ఏపీకి 2 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న దేశవ్యాప్తంగా ప్రారంభించిన 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లలో రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 5 యూనిట్లు వచ్చాయి. ఇందులో తెలంగాణకు 3, ఆంధ్రప్రదేశ్‌కు 2 లభించాయి. తెలంగాణలో జనగామ, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఖమ్మంలోని సిటీ యూనియన్ బ్యాంక్ దీనికి ఎంపికయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, మచిలీపట్నంలలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలు సెలెక్ట్ అయ్యాయి. తెలంగాణలోని జనగామలో ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యవేక్షించారు.
2030కి 2 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం
2030 నాటికి మన దేశం 2 ట్రిలియన్ డాలర్ల విలువైన సరుకులు మరియు సేవల ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకోనుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ విశ్వాసం వ్యక్తం చేశారు. చెన్నైలో నిన్న నిర్వహించిన ఎగుమతిదారుల సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశ ఎగుమతుల రంగం ప్రపంచ దేశాల్లో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించి, అత్యధిక మార్జిన్లను నమోదుచేయగలదని పేర్కొన్నారు. 2047 నాటికి ఇండియా 30 ట్రిలియన్ల ఎకానమీగా ఎదగనుందని, 25 శాతం షేర్లు ఎక్స్‌పోర్ట్స్‌లోనే ఉంటాయని పీయూష్ గోయెల్ అంచనా వేశారు.
ఈ నెలలోనే రూ.7500 కోట్లు విత్‌డ్రా
ఫారన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఈ నెలలోని మొదటి రెండు వారాల్లోనే ఇండియన్ ఈక్విటీ మార్కెట్ల నుంచి దాదాపు 7 వేల 500 కోట్లు రూపాయలను విత్‌డ్రా చేసుకున్నారు. అమెరికా కేంద్ర బ్యాంక్‌తోపాటు ప్రపంచంలోని ఇతర సెంట్రల్ బ్యాంకులు కఠినమైన ద్రవ్య విధానాన్ని అనుసరిస్తుండటంతో గ్లోబల్ ఎకనమిక్ గ్రోత్‌పై ప్రభావం పడుతుందేమోననే ఆందోళన వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ పరిస్థితులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఖజానాలపై అంచనాల ఒత్తిళ్ల వల్ల రానున్న కొన్ని నెలలపాటు కూడా ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
50 రెట్లు ఎక్కువ ధరకు ఫస్ట్ జనరేషన్ ఐఫోన్
యాపిల్ సంస్థ రూపొందించిన లేటెస్ట్ మోడల్ ఐఫోన్ 14 రిటైల్ రేటు 799 డాలర్లు. కానీ.. ఇదే కంపెనీ తయారుచేసిన ఫస్ట్ జనరేషన్ ఐఫోన్ ఇంతకన్నా ఎక్కువ ధర పలుకుతుండటం విశేషం. యాపిల్ సంస్థ 2007లో మార్కెట్లోకి తీసుకొచ్చిన ఫస్ట్ జనరేషన్ ఐఫోన్ తాజాగా వేలానికి వచ్చింది. ఆక్షన్‌లో దీని రేటు అసలు ధర కన్నా 50 రెట్లు ఎక్కువ పలికే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. 30 వేల డాలర్లు లేదా అంతకన్నా ఎక్కువే వచ్చే ఛాన్స్ ఉందని పేర్కొంటున్నారు. ఈ 8జీబీ ఐఫోన్‌ను ఇంతవరకు దాని ఒరిజినల్ ప్యాకింగ్ బాక్స్ నుంచి ఓపెనే చేయలేదు. ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు దీని విలువ 599 డాలర్లు మాత్రమే కావటం చెప్పుకోదగ్గ విషయం.
మన ఆర్థిక వ్యవస్థపై ఎంఎన్‌సీల నమ్మకం
భారత ఆర్థిక వ్యవస్థ పురోగతిపైన బహుళజాతి సంస్థలు ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా భావిస్తున్నాయి. దీంతో ఏకంగా 71 శాతం మల్టీ నేషనల్ కంపెనీలు ఇక్కడ విస్తరణ ప్రణాళికలపై ఫోకస్ పెట్టాయి. తమ ప్రొడక్షన్ బేస్‌ను కూడా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొల్పాలని చూస్తున్నాయి. కన్సల్టింగ్ మరియు ఆడిట్ సంస్థ ఈవైతోపాటు ఇండస్ట్రీ చాంబర్ CII నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. గత ట్రెండ్‌ను బట్టి ఇండియాకి ఫారన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్లు వచ్చే ఐదేళ్లలో సుమారు 475 డాలర్లకు పెరగొచ్చని అంచనా వేశాయి.
స్మార్ట్ ప్రొటీన్ మార్కెట్ విలువ రూ.33 వేల కోట్లకుపైనే
2030 నాటికి ఇండియా స్మార్ట్ ప్రొటీన్ మార్కెట్ విలువ 33 వేల 194 కోట్ల రూపాయలకు చేరనుందని డెలాయిట్ ఇండియా స్టడీ పేర్కొంది. న్యూఢిల్లీలో ఈ నెల 13, 14 తేదీల్లో జరిగిన ‘స్మార్ట్ ప్రొటీన్ సమ్మిట్-2022’లో ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేశారు. స్మార్ట్ ప్రొటీన్నే ఆల్టర్నేటివ్ ప్రొటీన్ అని కూడా అంటారు. జంతు ఆధారిత మాంసం, గుడ్లు, డెయిరీ ప్రొడక్టులకు బదులుగా మొక్కల నుంచి వచ్చే ప్రత్యామ్నాయ ఉత్పత్తులపై ఎంట్రప్రెన్యూర్లు, ఇన్వెస్టర్లు ఫోకస్ పెట్టాలని సదస్సులో పాల్గొన్న నిపుణులు సూచించారు. ఇవి కూడా టేస్ట్, లుకింగ్, కుకింగ్ పరంగా సాంప్రదాయ జంతు ప్రోటీన్‌ల మాదిరిగానే ఉంటాయని చెప్పారు.
