Business Headlines: హైదరాబాద్‌లోని ప్రముఖ ఫార్మాస్యుటికల్ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అద్భుతమైన ఫలితాలను నమోదు చేసింది. ఈ సంస్థ నికర లాభం ఏకంగా 108 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలోని మొదటి 3 నెలల్లో 571 కోట్లు మాత్రమే ప్రాఫిట్ రాగా ఈసారి 11 వందల 88 కోట్లు వచ్చాయి. మొత్తం ఆదాయం 6 శాతం పెరిగి 5 వేల 215 కోట్ల రూపాయలకు చేరినట్లు వెల్లడించింది.
ఇవాళ 4వ రోజూ ‘5జీ’ వేలం
5జీ స్పెక్ట్రం వేలం ఇవాళ 4వ రోజూ జరగనుంది. 2 రోజుల్లోనే పూర్తవుతుందనుకున్న ఈ ప్రక్రియ అనూహ్యంగా మరో 2 రోజులు అదనంగా కొనసాగుతుండటం విశేషం. వరుసగా 3 రోజులు కూడా దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల విలువైన బిడ్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మొత్తం 16 రౌండ్లు జరిగిన ఈ ఆక్షన్ ప్రాసెస్ ఈ రోజు ఎన్ని రౌండ్లు జరుగుతుందో చూడాలి.
read also: Telangana Young Voters: తెలంగాణలో యంగ్ తరంగ్. రికార్డు స్థాయిలో పెరగనున్న ఓటర్లు
అమెరికాలో ఆర్థికమాంద్యం?
అగ్రరాజ్యం అమెరికా స్థూల దేశీయోత్పత్తి మరోసారి మైనస్‌లోకి పడిపోయింది. మార్చి నెలలో జీడీపీ వృద్ధి మైనస్ 1.6 శాతం కాగా జూన్ నెలలో మైనస్ 0.9 శాతంగా నమోదైంది. వరుసగా 2 త్రైమాసికాల్లో కూడా పరిస్థితిలో మార్పు రాకపోవటంతో ఇది ఒక రకంగా ఆర్థిక మాంద్యమేనని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
‘బంధన్’ ఫస్ట్ కరెన్సీ చెస్ట్
బంధన్ బ్యాంక్ మొట్టమొదటి కరెన్సీ చెస్ట్‌ను అందుబాటులోకి తెచ్చింది. పాట్నాలోని దీదర్‌గంజ్ ప్రాంతంలో దీన్ని ఏర్పాటుచేసింది. నగరంలోని బ్యాంక్ బ్రాంచ్‌లతోపాటు ఏటీఎంలలో నగదు లభ్యతను పెంచేందుకు ఈ ఏర్పాటుచేసింది. మరోవైపు.. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 530కి పైగా కొత్త శాఖలను ప్రారంభించేందుకు బంధన్ బ్యాంక్ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.
చౌకగా రష్యా చమురు
మన దేశానికి రష్యా చమురు మరింత చౌకగా లభించనుంది. ఈ మేరకు మార్కెటింగ్ చేసే కంపెనీల లిస్టులో మరో 2 సంస్థలు చేరాయి. ఇప్పటివరకు కోరల్ ఎనర్జీ, ఎవరెస్ట్ ఎనర్జీ అనే 2 కంపెనీలు ఇండియన్ బయ్యర్లకు రష్యా ఆయిల్‌ని మార్కెటింగ్ చేస్తున్నాయి. ఇప్పుడు వెల్‌బ్రెడ్, మాంట్‌ఫర్ట్ అనే ఇంకో 2 సంస్థలు అందుబాటులోకి వచ్చాయి.
మళ్లీ ‘విండ్‌ఫాల్’ పెంపు!
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర పెరిగితే విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను కూడా మళ్లీ పెంచుతామని కేంద్రం ప్రకటించింది. గతంలో ఎప్పుడూలేనివిధంగా ఒకటో తేదీ నుంచి ఈ సుంకాన్ని వసూలు చేస్తున్నారు. స్వదేశీ పెట్రో ఉత్పత్తులతోపాటు ఇంధన ఎగుమతులపై పన్ను విధించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల కిందట చమురు రేట్లు తగ్గడంతో విండ్‌ఫాల్ టాక్స్ను తగ్గించారు. డీజిల్‌తోపాటు విమాన ఇంధనం ధరలో లీటర్‌కి 3 రూపాయలు, పెట్రోల్ రేటులో 6 రూపాయలు కోత పెట్టారు. ఒక వేళ క్రూడాయిల్ ధర పెరిగితే విండ్‌ఫాల్ ట్యాక్స్ కూడా పెంచుతామని తాజాగా వెల్లడించారు.
