Budget 2026 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే 2026-27 ఆర్థిక బడ్జెట్‌పై అప్పుడే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు మొదలయ్యాయి. ముఖ్యంగా వేతన జీవులు, మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) కేంద్ర ఆర్థిక శాఖకు సమర్పించిన ఒక ప్రతిపాదన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. భారతదేశ ఆదాయపు పన్ను చరిత్రలో ఇప్పటివరకు లేని విధంగా, వివాహిత జంటలు ఇద్దరూ కలిపి ఉమ్మడిగా పన్ను రిటర్నులు దాఖలు చేసే ‘ఆప్షనల్ జాయింట్ టాక్సేషన్’ (Optional Joint Taxation) విధానాన్ని తీసుకురావాలని ఐసీఏఐ కోరింది. ఒకవేళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రతిపాదనకు పచ్చజెండా ఊపితే, అది లక్షలాది భారతీయ కుటుంబాల ఆర్థిక ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేసే ఒక చారిత్రాత్మక నిర్ణయం అవుతుంది.
ప్రస్తుతం ఉన్న భారతీయ పన్ను విధానం ప్రకారం, ఒక వ్యక్తి వివాహితుడా కాదా అన్న దానితో సంబంధం లేకుండా వారిని విడివిడి యూనిట్లుగానే పరిగణిస్తారు. దీనివల్ల భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తున్నా లేదా ఒకరే సంపాదిస్తున్నా.. ఎవరి పన్ను బాధ్యతలను వారు వ్యక్తిగతంగానే లెక్కించుకోవాల్సి ఉంటుంది. అయితే, కొత్తగా ప్రతిపాదించిన జాయింట్ టాక్సేషన్ విధానం ఒక కుటుంబాన్ని ఒకే ఆర్థిక యూనిట్‌గా గుర్తిస్తుంది. దీనివల్ల భార్యాభర్తలు తమ ఆదాయాలను, పొదుపులను , ఖర్చులను కలిపి ఒకే ఐటీ రిటర్న్ (ITR) ద్వారా చూపించే అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా ఒకరు మాత్రమే సంపాదిస్తూ, మరొకరు గృహిణిగా లేదా నిరుద్యోగిగా ఉన్న కుటుంబాలకు ఈ విధానం ఒక వరం లాంటిది. ఉమ్మడి ఆదాయంపై పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం ద్వారా, అటువంటి కుటుంబాలపై పన్ను భారం గణనీయంగా తగ్గుతుంది.
పన్ను ఆదా పరంగా చూస్తే, ఈ విధానం వల్ల అనేక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. ఐసీఏఐ సూచించిన నమూనా ప్రకారం, దంపతుల ఉమ్మడి ఆదాయం ఆరు లక్షల రూపాయల వరకు ఉంటే ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలాగే ఆరు నుండి 14 లక్షల మధ్య ఆదాయంపై కేవలం ఐదు శాతం పన్ను మాత్రమే విధించేలా స్లాబులను సవరించాలని ప్రతిపాదించారు. దీనివల్ల కేవలం పన్ను తగ్గడమే కాకుండా, సెక్షన్ 80C కింద చేసే పెట్టుబడులు, గృహ రుణాలపై చెల్లించే వడ్డీలు (Section 24), , వైద్య బీమా (Section 80D) వంటి మినహాయింపులను దంపతులు ఇద్దరూ కలిపి మరింత సమర్థవంతంగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది కేవలం పన్ను ఆదాకే పరిమితం కాకుండా, ఐటీ రిటర్నుల దాఖలు ప్రక్రియను కూడా సులభతరం చేస్తుంది. ఏటా ఇద్దరు వేర్వేరుగా ఫైల్ చేసే గందరగోళం తగ్గి, కుటుంబ ఆర్థిక రికార్డులు ఒకే చోట క్రమబద్ధంగా ఉంటాయి.
అయితే, ఈ విప్లవాత్మక మార్పును అమలు చేయడం కేంద్ర ప్రభుత్వానికి ఒక సవాలుతో కూడుకున్న పనే. ప్రస్తుతం మన దేశంలో ఉన్న పన్ను సాఫ్ట్‌వేర్ , మౌలిక సదుపాయాలన్నీ పాన్ (PAN) ఆధారితంగా ఒక వ్యక్తికి అనుగుణంగా రూపొందించబడ్డాయి. జాయింట్ టాక్సేషన్ అమలు చేయాలంటే ఈ సాఫ్ట్‌వేర్ వ్యవస్థను పూర్తిగా రీ-డిజైన్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ఈ విధానం అందరికీ లాభదాయకం కాకపోవచ్చు. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ అత్యధిక జీతాలు పొందుతున్నప్పుడు, వారి ఆదాయాలను కలిపితే వారు అధిక పన్ను స్లాబుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. అందుకే దీనిని ఒక ‘ఆప్షనల్’ (ఐచ్ఛిక) విధానంగా ఉంచాలని, ఎవరికి ఏది లాభదాయకమో దానిని వారే ఎంచుకునే అవకాశం కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. అమెరికా, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో దశాబ్దాలుగా సత్ఫలితాలనిస్తున్న ఈ విధానం, భారతీయ కుటుంబాలకు కూడా ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఆశించవచ్చు.