Site icon NTV Telugu

మార్కప్ ఛార్జీల పేరిట రూ.9,700 కోట్లు కొల్లగొట్టిన బ్యాంకులు

హిడెన్ ఛార్జీల పేరుతో బ్యాంకులు కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నాయి. ఉద్యోగాల కోసం, ఉన్నత చదువుల కోసం, వైద్యం కోసం, తమ బంధువుల కోసం, సొంత పర్యటనల చాలా మంది భారతీయులు విదేశాలకు వెళ్తుంటారు. ఆయా దేశాల్లో మన కరెన్సీ చెల్లదు కాబట్టి మన డబ్బును ఇచ్చి ఆయా దేశాల కరెన్సీని తీసుకుంటారు. ఇలా డబ్బును బదిలీ చేసే వారిపై ప్రాసెసింగ్ ఫీజు, మార్కప్ ఫీజుల పేరుతో బ్యాంకులు హిడెన్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయంటూ క్యాపిటల్ ఎకానమిక్స్ అనే సంస్థ బహిర్గతం చేసింది. ఈ నేపథ్యంలో ఒక్క 2021 సంవత్సరంలోనే విదేశాలకు వెళ్లే భారతీయులు దాదాపు రూ.95వేల కోట్లు (1270 కోట్ల డాలర్లు) ట్రాన్స్‌ఫర్ చేశారు. సదరు డబ్బులో 380 కోట్ల డాలర్లను ఉన్నత విద్య కోసం పంపగా.. పర్యటనల కోసం 320 కోట్ల డాలర్లు, ఫ్యామిలీ సపోర్ట్ కోసం 270 కోట్ల డాలర్లను భారతీయులు పంపారు.

Read Also: వంట గ్యాస్ ధరల మంట.. మరో రూ.100 పెరిగే అవకాశం

అయితే గతంలో భారతీయులు పంపే డబ్బులపై బ్యాంకులు అధికంగా ఛార్జీలు వసూలు చేసేవి. అయితే గత ఐదేళ్లుగా ఆ ఛార్జీలు తగ్గించి కేవలం ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే వసూలు చేస్తున్నట్లు బ్యాంకులు ప్రకటించాయి. దీంతో 2016లో ప్రాసెసింగ్ ఫీజుల కింద బ్యాంకులు రూ.15,017 కోట్లు ఆర్జిస్తే.. 2019లో రూ.12,142 కోట్లు మాత్రమే ఆర్జించాయి. దీంతో ఆ లోటును పూడ్చుకునేందుకు బ్యాంకులు ఎక్స్ఛేంజ్ మార్కప్ పేరుతో ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఆ ఛార్జీలను బ్యాంకులు భారీగా పెంచేశాయి. వాటి ద్వారా 2016లో బ్యాంకులకు రూ.2,505 కోట్లు రాగా 2019లో రూ.4,422 కోట్లు సమకూరాయి. 2020లో అయితే ఏకంగా రూ.9,700 కోట్లను బ్యాంకులు కొల్లగొట్టాయి. విదేశాలకు భారతీయులు పంపిన డబ్బులో ప్రాసెసింగ్ ఫీజు ద్వారా బ్యాంకులు రూ.26,300 కోట్లు సంపాదించాయి. ఇందులో మార్కప్ ఛార్జీల వాటా 36 శాతంగా ఉంది. ఈ ఛార్జీల గురించి చాలా మంది వినియోగదారులకు తెలియదు. బ్యాంకులు వసూలు చేస్తున్న ఈ ఛార్జీల దోపిడీ వల్ల ఎక్కువ నష్టపోతున్న వారిలో గల్ఫ్ దేశాలకు చెందిన కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది.

Exit mobile version