Site icon NTV Telugu

అమెజాన్ ప్రైమ్ యూజర్లకు బ్యాడ్‌న్యూస్

అమెజాన్ ప్రైమ్ తమ యూజర్లకు బ్యాడ్‌న్యూస్ అందించింది. కొత్త సినిమాలను, వెబ్ సిరీస్‌లను అందించే అమెజాన్ ప్రైమ్ ఇకపై ప్రియం కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వార్షిక సబ్‌స్క్రిప్షన్ ధరలు 50 శాతం పెరగనున్నాయి. దీంతో ఇప్పటివరకు వార్షిక ఫీజు రూ.999 చెల్లిస్తే సరిపోయేది. అయితే ఇకపై రూ.1,499 చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు నెలవారీ, మూడు నెలల ప్లాన్‌లను కూడా అమెజాన్ ప్రైమ్ పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నెలవారీ ప్లాన్ రూ.129 ఉండగా ఇకపై రూ.179 చెల్లించాలి. మూడు నెలల ప్లాన్‌కు ప్రస్తుతం రూ.329 ఉండగా.. ఇకపై రూ.359 చెల్లించాలి. త్వరలోనే కొత్త రేట్లు అమలు కానున్నాయి.

Read Also : రాకెట్ వేగంతో దూసుకుపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు

ఇండియాలో ఇతర ఓటీటీల వార్షిక ఫీజులతో పోలిస్తే అమెజాన్ ప్రైమ్‌కు చెల్లించే ఫీజు తక్కువనే చెప్పాలి. నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ధరలు అమెజాన్‌తో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభంలోనే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వార్షిక ఫీజులను పెంచింది. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే వీడియోలను వీక్షించడమే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా చేకూరనున్నాయి. కొన్ని వస్తువులను అమెజాన్‌లో కొనుగోలు చేస్తే త్వరగా డెలివరీ పొందవచ్చు. అమెజాన్ మ్యూజిక్ ద్వారా కూడా పాటలు విని ఎంజాయ్ చేయవచ్చు. ఏదైనా ఆఫర్లు పెట్టిన సందర్భంలో ప్రైమ్ మెంబర్లు ఒకరోజు ముందుగానే వస్తువులను కొనుగోలు చేయవచ్చు.

Exit mobile version