Site icon NTV Telugu

APY Monthly Pension: ఇలా చేస్తే అందరికీ రూ.5,000 పెన్షన్.. రోజూ రూ.7 పొదుపుతోనే! మీరు ఇంకా చేరలేదా?

Atal Pension Yojana

Atal Pension Yojana

APY Monthly Pension: రేపటి గురించి ఆలోచించని వారికి నేటి పొదుపే శ్రీరామరక్ష. ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత ఎవరిపైనా ఆధారపడకుండా, గౌరవప్రదంగా జీవించాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అటల్ పెన్షన్ యోజన (APY) ఒక అద్భుతమైన అవకాశం. తక్కువ పెట్టుబడితో.. జీవితాంతం హామీతో కూడిన పెన్షన్ అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. పదవీ విరమణ తర్వాత ఆర్థిక భరోసా కల్పించే అటల్ పెన్షన్ యోజన (APY) పథకం అసంఘటిత రంగ కార్మికులకు, సామాన్యులకు ఇది ఎలా వరంగా మారుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అసలు ఏమిటి ఈ పథకం?
అటల్ పెన్షన్ యోజన పట్ల ప్రజల్లో అవగాహన, ఆదరణ ఈ రోజుల్లో పెరుగుతోంది. తాజా గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ 21, 2026 నాటికి దేశవ్యాప్తంగా 9 కోట్ల మందికి పైగా ఈ పథకంలో చేరారు. దేశంలో సామాజిక భద్రతను పెంచడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) ఆధ్వర్యంలో నడిచే ఈ పథకంలో 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు వారు చేరవచ్చు. మీరు ఎంచుకున్న మొత్తాన్ని బట్టి 60 ఏళ్ల వయస్సు తర్వాత ప్రతి నెలా రూ.1,000 – రూ.5,000 వరకు పెన్షన్ లభిస్తుంది. మీ బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్ డెబిట్ సౌకర్యం ఉండటం వల్ల చెల్లింపులు కూడా చాలా సులభం.

పెట్టుబడి ఎంతంటే..
నెలవారీ పెన్షన్ రూ.5,000 పొందాలనుకుంటే, మీరు చేరిన వయస్సును బట్టి పెట్టుబడి మారుతుంది. మీరు 18 ఏళ్లకే ప్రారంభిస్తే.. నెలకు కేవలం రూ.210 చెల్లిస్తే సరిపోతుంది. 30 ఏళ్ల వయస్సులో చేరితే నెలకు రూ.577 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 40 ఏళ్ల వయస్సులో ప్రారంభిస్తే నెలకు రూ.1,454 చెల్లించాల్సి ఉంటుంది. దీనిని బట్టి చూస్తే.. ఎంత త్వరగా ప్రారంభిస్తే, నెలవారీ భారం అంత తక్కువగా ఉంటుంది. APY కేవలం మీకే కాదు, మీ కుటుంబానికి కూడా భరోసా ఇస్తుంది. పెన్షన్ దారుడు మరణిస్తే, అదే పింఛను మొత్తం జీవిత భాగస్వామికి (భార్య/భర్త) అందుతుంది. ఇద్దరూ మరణిస్తే దాదాపు రూ.8.5 లక్షల కార్పస్ నిధిని నామినీకి అందజేస్తారు. ఏదైనా బ్యాంక్ లేదా పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతా ఉన్న 18 నుంచి 40 సంవత్సరాల లోపు భారతీయులందరూ ఈ పథకంలో చేరవచ్చు.

Exit mobile version