Site icon NTV Telugu

Apollo Tyres: గాలి తీసేసిన టైర్ నుంచి.. టీం ఇండియా జెర్సీ స్పాన్సర్ వరకు.. ఏం జర్నీ బాస్

Apollo Tyres

Apollo Tyres

Apollo Tyres: ప్రపంచంలో క్రికెట్ అనే మతం ఉంటే.. ఆ మతాన్ని భారత్‌లోనే ఎక్కువ మంది ఆచరించే వారు. ఎందుకంటే భారత్‌లో క్రికెట్ అంటే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఆదరించే ఆట. దీని కారణంగా ప్రస్తుతం భారత్‌లో అపోలో టైర్స్ అనే పేరు తెగ ట్రెండ్ అవుతోంది. ఎందుకు అనుకుంటున్నారు.. టీం ఇండియా నయా జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్ మారింది కాబట్టి. ఒకప్పుడు గాలి తీసేసిన టైర్ నుంచి.. నేడు టీం ఇండియా జెర్సీ స్పాన్సర్ స్థాయికి ఎదిగిన ఈ కంపెనీ ప్రస్థానం మామూలుది కాదు.

READ ALSO: Zepto: చిక్కడపల్లిలో జెప్టో డెలివరీ బాయ్స్‌ వీరంగం.. కస్టమర్‌పై మూకుమ్మడి దాడి

అట్టడుగు నుంచి పైకి ఎదిగిన సంస్థ..
అపోలో టైర్స్ BCCIతో 3 ఏళ్ల ఒప్పందంపై రూ.579 కోట్లకు సంతకం చేసింది. దీంతో 2027 నాటికి భారత క్రికెట్ జట్టు అపోలో టైర్స్ జెర్సీతో ఆడటం అభిమానులు చూడనున్నారు. మీకు తెలుసా.. టీం ఇండియా జెర్సీ స్పాన్సర్ చేయనున్న కంపెనీ పరిస్థితి ఒకప్పుడు చాలా దారుణంగా ఉండేదని. ఆ తండ్రి తన సొంత కొడుకుకు కంపెనీని రూ.1 సింబాలిక్ ధరకు అమ్మడానికి ముందుకొచ్చాడాని. ఆ పరిస్థితులకు తట్టుకొని నిలబడిన ఆ కంపెనీ నేడు BSEలో రూ.31 వేల కోట్లకు దగ్గరగా ఉంది. ఇది కదా సక్సెస్ అంటే. 1975 ఎమర్జెన్సీ కాలంలో కంపెనీ ఆర్థిక పరిస్థితి క్షీణించింది. తీవ్ర సమస్యలను ఎదుర్కొన్న కంపెనీ అధినేత రౌనక్ సింగ్ తన సంస్థను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. కంపెనీని తన కుమారుడు ఓంకార్ కన్వర్‌కు రూ.1 లాంఛనప్రాయ ధరకు విక్రయించడానికి ముందుకొచ్చాడు. పలు నివేదికల ప్రకారం.. ఓంకార్ కన్వర్ తన తండ్రి నుంచి అపోలో టైర్స్‌ను అత్యంత క్లిష్ట దశ నుంచి తీసుకొని అత్యున్నత బిలియన్ కంపెనీ స్థాయికి తీసుకురావడంలో విశేషంగా కృషి చేశారు.

కంపెనీ చరిత్ర ఏంటంటే..
1972లో అపోలో టైర్స్ కథకు భారతదేశంలోని గురుగ్రామ్‌లో పునాది పడింది. 1975లో కేరళలోని పెరుంబ్రాలో కంపెనీ మొదటి ఫ్యాక్టరీ ప్రారంభమైంది. ఈ కంపెనీ అధిక నాణ్యతతో టైర్లను తయారు చేయడం ద్వారా మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. 1980లో కంపెనీ వ్యవస్థాపకుడు రౌనక్ సింగ్ కుమారుడు ఓంకార్ కన్వర్ కంపెనీని తన సారథ్యంలోకి తీసుకుని ఒక పెద్ద పునర్నిర్మాణాన్ని ప్రారంభించాడు. కంపెనీని పునరుద్ధరించడానికి ఆయన అనేక ముఖ్యమైన చర్యలు తీసుకున్నారు. కంపెనీపై పట్టు సాధించడం ప్రారంభించిన అనంతరం భారతదేశంలో సంస్థను విస్తరించడం ప్రారంభించారు. 1990లో కంపెనీ భారతీయ రేడియల్ టైర్ విభాగంలో అగ్రగామిగా నిలవడంతో పాటు దేశంలోనే అగ్రశ్రేణి టైర్ ఎగుమతిదారుగా అవతరించింది. 1991లో గుజరాత్‌లోని లిమ్డాలో కొత్త ప్లాంట్‌ను ప్రారంభించడం, తర్వాత సంస్థ 1995లో ప్రీమియర్ టైర్స్ లిమిటెడ్‌ను కొనుగోలు చేసి కేరళలో మూడవ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేసింది.

కంపెనీ దిశ మారిపోయింది..
ఓంకార్ కన్వర్ సారథ్యంలో కంపెనీ దిశ మారిపోయింది. ఆయన దేశీయ ట్రక్ టైర్ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రత్యేకంగా భారతీయ రోడ్లు, లోడ్ పరిస్థితుల కోసం సంస్థ ఉత్పత్తులను అభివృద్ధి చేశారు. క్రమంగా సంస్థ తన కృషి, నాణ్యతతో భారత్‌లోనే కాకుండా 100 కంటే ఎక్కువ దేశాలలో తనదైన ముద్ర వేయగలిగింది. 2009లో కంపెనీ నెదర్లాండ్స్‌కు చెందిన వ్రెడెస్టీన్ బాండెన్ బి.వి.ని కొనుగోలు చేసింది. తర్వాత దీనికి అపోలో వ్రెడెస్టీన్ అని పేరు మార్చారు. నేడు అపోలో భారతదేశంలో ఐదు కర్మాగారాలు, నెదర్లాండ్స్, హంగేరీలో ఒక్కొక్కటి కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా నమ్మకమైన టైర్లను సరఫరా చేస్తుంది. అపోలో టైర్స్ ప్రస్తుతం దేశంలోని ప్రముఖ టైర్ కంపెనీలలో ఒకటిగా స్థానాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.30,916.71 కోట్లు. జెర్సీ స్పాన్సర్‌షిప్ వార్తల తర్వాత.. అపోలో టైర్స్ లిమిటెడ్ షేర్లు మార్కెట్‌లో రాణించాయి. బిఎస్‌ఈలో కంపెనీ స్టాక్ రూ.486.80 వద్ద 1.56 శాతం లాభంతో ముగిసింది.

READ ALSO: India Missile Test: కీలక పరీక్షలకు సిద్ధం అవుతున్న భారత్.. క్షిపణులు సక్సెస్ అయితే మామూలుగా ఉండదు..

Exit mobile version