NTV Telugu Site icon

Idli ATM: ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకున్న ఇడ్లీ ఏటీఎం.. ట్వీట్ వైరల్

Idli Atm

Idli Atm

Idli ATM: ఇప్పటివరకు దేశవ్యాప్తంగా డబ్బులు ఇచ్చే ఏటీఎంలను చూశాం.. వాటర్ ఇచ్చే ఏటీఎంలను చూశాం. కానీ ఎన్నో దిగ్గజ సంస్థలకు కేంద్రంగా మారిన బెంగళూరులో ఇడ్లీ ఏటీఎం అందుబాటులోకి రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇడ్లీ ఏటీఎం వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. ఈ ఏటీఎం మిషన్ సహాయంతో కేవలం 50 సెకన్లలో ఇడ్లీ తయారవుతుంది. అంతేకాకుండా ఆకర్షణీయంగా చేసిన డబ్బాలో ఇడ్లీ పార్సిల్ బయటకు వస్తుంది. అయితే ఈ ఇడ్లీ ఏటీఎం ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రాను కూడా ఆకట్టుకుంది.

Read Also: UK PM: లిజ్ ట్రస్ పై అవిశ్వాసానికి రంగం సిద్ధం

ఇడ్లీ ఏటీఎంకు సంబంధించిన వీడియోపై మహీంద్రా గ్రూప్స్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఈ సందర్భంగా ఏటీఎం మిషన్‌లో తయారవుతున్న ఇడ్లీ రుచి గురించి ప్రజలను అడిగారు. త్వరలో ఇడ్లీ ఏటీఎంను సందర్శించి రుచి పరిశీలిస్తానని ఆయన తెలిపారు. చాలా మంది రోబోటిక్ ఫుడ్ ప్రిపరేషన్ లేదా వెండింగ్ మెషీన్లను రూపొందించడానికి ప్రయత్నించారని.. ఇది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ( FSSAI) ప్రమాణాలకు అనుగుణంగా ఉందని ఆనంద్ మహీంద్రా తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇందులో పదార్థాలు తగినంతగా రిఫ్రెష్ చేయబడతాయని తేలిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలు, షాపింగ్ మాళ్లలో కూడా ఈ ఇడ్లీ ఏటీఎం మిషన్‌ను చూడాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఇడ్లీ ఏటీఎం హిట్ అయితే ప్రధాన సాంస్కృతిక ఎగుమతి అవుతుందని ఆనంద్ మహీంద్రా తన ట్వీట్‌లో ప్రశంసలు కురిపించారు. తక్కువ ఖర్చుతో ఈ ఏటీఎం లభిస్తే ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారని అభిప్రాయపడ్డారు.