Amazon Layoffs: ప్రపంచవ్యాప్తంగా 16,000 మందిని తొలగించనున్నట్లు అమెజాన్ తెలిపింది. దీని వల్ల ఏ యూనిట్లు ప్రభావమవుతాయో అనేది చెప్పలేదు. మూడు నెలల్లో ఈ-కామర్స్ కంపెనీ రెండో రౌండ్ భారీ లేఆఫ్స్‌కు సిద్ధమైంది. వీరి స్థానంలో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)ని ఉపయోగించుకోవాలని యోచిస్తున్నట్లు టెక్ దిగ్గజం వెల్లడించింది. కోవిడ్ మహమ్మారి సమయంలో పెరిగిన శ్రామిక శక్తిని కూడా ఇది తగ్గిస్తోంది.
అమెజాన్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గాలెట్టి బుధవారం ఒక బ్లాగ్ పోస్ట్‌లో.. కంపెనీ ‘‘నిర్వహణ స్థాయిలను(లేయర్లను) తగ్గించడం, ఉద్యోగుల్లో బాధ్యతాభావాన్ని పెంచడం, బ్రూరోక్రసీని తగ్గించడం’’ చేస్తోందని చెప్పారు. కేవలం మూడు నెలల్లోనే ఇది అమెజాన్ చేపట్టిన రెండో దశ మాస్ లేఆఫ్స్, గతేడాది అక్టోబర్‌లో 14,000 మందిని తొలగించిన తర్వాత తాజాగా ఈ లేఫ్స్ వచ్చాయి.
Read Also: T20 World Cup: “మీరు ఆడకుంటే త్వరగా చెప్పండి”.. పాకిస్తాన్‌పై ఐస్లాండ్ ట్రోలింగ్..
అమెరికాలోని కంపెనీ ఉద్యోగులు కొత్త ఉద్యోగాలు వెతుకున్నేందుకు 90 రోజుల సమయం ఇవ్వబడుతుందని ఆమె చెప్పారు. కొత్త ఉద్యోగం కోరుకోని వారికి సెవరెన్స్ పే, అవుట్ ప్లేస్‌మెంట్ సర్వీసులు, హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఉంటాయని గాలెట్టి చెప్పారు. ఈ మార్పులు చేస్తూనే, భవిష్యత్తులో కీలకమైన వ్యూహాత్మక విభాగాల్లో రిక్రూట్మెంట్, పెట్టుబడులు పెడుతామని వెల్లడించారు.
అమెజాన్ సీఈఓగా జెఫ్ బెజోస్ తన బాధ్యతల్ని ఆండీ జాసీకి అప్పగించిన తర్వాత ఖర్చుల నియంత్రణపై గట్టిగా దృష్టిసారించారు. జెనరేటివ్ ఏఐ వల్ల రాబోయే సంవత్సరాల్లో ఉద్యోగాలు తగ్గుతాయని గతేడాది జూన్‌లోనే చెప్పారు. 2023 తర్వాత 16000 మందిని తొలగించడం ఇదే అతిపెద్ద లేఆఫ్. కంపెనీ లాభాల్లో ఉన్నా కూడా కోతలు తప్పవని అమెజాన్ ఉదంతం తెలియజేస్తోంది.
