Akash Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగమైన ‘జియో ప్లాట్‌ఫామ్స్’ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ (MD)గా ఆకాష్ అంబానీని నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 9, 2026 నుంచి ఐదేళ్ల వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MCA) ఫైలింగ్స్ ద్వారా స్పష్టం అయ్యింది. ఏప్రిల్ 9న జరిగిన బోర్డు సమావేశంలో ఆకాష్ అంబానీని జియో కంపెనీ ఎండీ నియామకానికి ఆమోదం లభించింది.
జియోలో ఆకాష్ ప్రస్థానం ఇదే..
2014లో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌లో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేరిన ఆకాష్, 2022లో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. త్వరలో జియో ప్లాట్‌ఫామ్స్ భారీ ఐపీఓ (IPO)కి సిద్ధమవుతున్న వేళ ఈ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు, ఇన్వెస్టర్లతో కంపెనీ చర్చలు జరుపుతోంది. 2020లో గూగుల్, మెటా (ఫేస్‌బుక్), కేకేఆర్ వంటి 13 ప్రపంచ స్థాయి సంస్థల నుంచి సుమారు రూ.1.5 లక్షల కోట్ల నిధులను సేకరించడం ద్వారా జియో ప్లాట్‌ఫామ్స్ వార్తల్లో నిలిచింది. ఈ నిధులతో కంపెనీ అప్పుల్లేని (Net Debt-Free) సంస్థగా అవతరించింది. కేవలం టెలికాం రంగానికే పరిమితం కాకుండా.. 5G, హోమ్ బ్రాడ్‌బ్యాండ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డీప్-టెక్, శాటిలైట్ కనెక్టివిటీ వంటి విభాగాల్లో భవిష్యత్తులో జియో తన ఉనికిని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
