NTV Telugu Site icon

Air India: ఎయిర్ ఇండియా చేతికి మొట్టమొదటి ఎయిర్‌బస్ A350-900.. ఆకాశంలో ఇంద్రభవనం ఈ విమానం..

Air India

Air India

Air India: టాటా చేతిలోకి వచ్చిన తర్వాత ఎయిర్ ఇండియా రూపురేఖలు మారిపోతున్నాయి. ఇప్పటికే భారీ సంఖ్యలో ఎయిర్‌బస్, బోయింగ్ సంస్థలకు విమానాల ఆర్డర్లను ఇచ్చింది. ఇదిలా ఉంటే శనివారం రోజు ఎయిర్ ఇండియా చేతికి మొట్టమొదటి వైడ్ బాడీ క్యారియర్ ఎయిర్‌బస్ A350-900 అందింది. ఫ్రాన్స్ లోని ఎయిర్‌బస్ ఫెసిలిటీ నుంచి బయలుదేరిన ఈ విమానం ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకుంది. ఈ తరహా విమానం కలిగిన తొలి భారతీయ ఎయిర్ లైనర్‌గా ఎయిర్ ఇండియా నిలిచింది.

ఎయిర్ ఇండియా 20 ఎయిర్ బస్ A350-900 ఆర్డర్లలో ఇది మొదటి విమానం. మరో ఐదు విమానాలు మార్చి 2024 వరకు డెలివరీ కానున్నాయి. ఎయిర్ బస్ A350-900 జనవరి 2024 నుంచి కమర్షియల్ సర్వీసులోకి ప్రవేశించనుంది. ప్రారంభంలో సిబ్బందికి, ఇతర టెక్నీషియన్లకు పరిచయం కోసం దేశీయంగా పనిచేస్తుంది. ఆ తర్వాత ఈ విమానాన్ని ఇంటర్నేషనల్ రూట్లలో ఆపరేట్ చేయనున్నారు. సుదూర ప్రాంతాలకు నాన్ స్టాప్ మార్గాల్లో ప్రయాణించడం ఈ విమానం ప్రత్యేకత అని ఎయిర్ ఇండియా సీఈఓ, ఎండీ కాంప్‌బెల్ విల్సన్ అన్నారు.

ఎయిర్ ఇండియా A350-900లో 3 క్లాస్ క్యాబిన్ కాన్ఫిగరేషన్‌లో ఉంటుంది. మొత్తం 316 సీట్లు ఉంటాయి. 28 ప్రైవేట్ బిజినెస్ క్లాన్ సూట్లు కాగా.. 24 ప్రీమియం ఎకానమి.. 264 ఎకానమీ క్లాస్ సీట్లు ఉంటాయి. సాధారణంగా చెప్పాలంటే ఆకాశంలో ప్రయాణించే ఇంద్ర భవనంగా ఈ విమానాన్ని అభివర్ణించవచ్చు.

ఎయిర్ ఇండియా ఎయిర్‌బస్ సంస్థతో 250 విమానాల కోసం ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం వచ్చిన విమానం ఈ ఒప్పందంలో మొదటిది. ఎయిర్ ఇండియా మొత్తం 20 A350 విమానాలు, 20 A350-900 విమానాలు, 210 A320neo విమానాల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు మరో విమాన తయారీ సంస్థ బోయింగ్‌తో 220 విమానాల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. బోయింగ్, ఎయిర్‌బస్ నుంచి 470 కొత్త విమానాలను ఎయిర్ ఇండియా కొనుగోలు చేస్తోంది.