Site icon NTV Telugu

వ‌రుస‌గా మూడోరోజు ఆదానీ గ్రూప్‌కు షాక్..

Adani

భార‌త్‌లో ఇప్పుడు ప్ర‌ముఖంగా వినిపిస్తున్న పేరు ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త ఆదానీదే.. సంపాద‌న‌లో దూసుకుపోతున్న ఆదానీ.. ప్ర‌పంచ కుభేరుల జాబితాలో కూడా చేరిపోయారు.. అయితే.. ఆదానీ గ్రూప్ కు వ‌రుస‌గా మూడో రోజూ షాక్ త‌ప్ప‌లేదు.. ఆ గ్రూప్ సంస్థ‌ల షేర్లు వ‌రుస‌గా మూడో రోజు ప‌త‌నం కావ‌డ‌మే దీనికి కార‌ణం.. ఆదానీ గ్రూప్‌లోని మూడు సంస్థ‌ల స్క్రిప్టులు మూడో రోజూ లోయ‌ర్ స‌ర్క్యూట్‌ను తాకాయి.. ఆదానీ ట్రాన్సిమిష‌న్‌, ఆదానీ ప‌వ‌ర్‌, ఆదానీ టోట‌ల్ గ్యాస్ వ‌రుస‌గా న‌ష్టాల‌ను చ‌విచూశాయి.. మూడు రోజుల్లో ఆదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ ఏకంగా రూ.86 వేల కోట్ల‌కు పైగా ప‌డిపోయింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఆదానీ గ్రూప్ కంపెనీల్లో ముగ్గురు విదేశీ ఇన్వెస్ట‌ర్ల వాటాల‌పై సెబీ అనుమానాలు వ్య‌క్తం చేసింది.. ఈ మూడు కంపెనీలు బోగ‌స్ అని భావిస్తున్నారు.. ఈ త‌రుణంలో.. షేర్ల విలువ ప‌డిపోయిన‌ట్టుగా చెబుతున్నారు.

ఇక‌, సోమ‌వారం ఆదానీ ఎంట‌ర్ ప్రైజెస్ స్క్రిప్ట్ 22 శాతం ప‌డిపోయింది. దీంతోపాటు ఐదు లిస్టెడ్ కంపెనీలు 5 నుంచి 15 శాతం న‌ష్టాలు న‌మోదు చేశాయి.. అయితే, అదేరోజు ట్రేడింగ్ ముగిసే స‌మ‌యానికి రిక‌వ‌రీ సాధించినా మూడు సంస్థ‌లు మాత్రం లోయ‌ర్ స‌ర్క్యూట్‌కే ప‌రిమితం అయ్యాయి.. మంగ‌ళ‌వారం కూడా అదే ప‌రిస్థితి రిపీట్ అయ్యింది.. ఇవాళ ఆరు కంపెనీల షేర్లు ప‌త‌నం బాట ప‌ట్టాయి.. ఆదానీ ట్రాన్స్‌మిష‌న్‌, ఆదానీ ప‌వ‌ర్‌, ఆదానీ టోట‌ల్ గ్యాస్ షేర్లు లోయ‌ర్ స‌ర్క్యూట్‌లోనే ఉండిపోయాయి.. మొత్తం 5.5 శాతం ప‌త‌నం అయ్యాయి. ఆదానీ టోట‌ల్ గ్యాస్ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ మూడు రోజుల్లో రూ.25,494 కోట్లు ప‌త‌న‌మైంది. ఆదానీ ఎంట‌ర్ ప్రైజెస్ ఒక‌శాతం, ఆదానీ పోర్ట్ 4 శాతం ప‌డిపోగా, ఆదానీ గ్రీన్ ఎన‌ర్జీ స్టాక్ మూడు శాతం దిగ‌వ‌కు చేరింది. ఆదానీ గ్రూప్ కంపెనీల్లో అబ్దుల్లా ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌, క్రెస్టా ఫండ్‌, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్ ఫండ్ కంపెనీలు పెట్టుబ‌డులు పెట్ట‌గా.. ఆ మూడు ఇన్వెస్ట్‌మెంట్ల ఖాతాల‌ను సెబీ స్తంభింప‌జేసింది. దీనిపై ఆదానీ గ్రూప్ వివ‌ర‌న్ ఇచ్చుకున్నా.. ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది.. క్ర‌మంగా షేర్ మార్కెట్‌లో న‌ష్టాల‌ను చ‌విచూడాల్సి వ‌చ్చింది.

Exit mobile version