బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన దగ్గర నుండి షణ్ముఖ్, సిరి ఒక్కటిగానే ఏ గేమ్ అయినా ఆడుతున్నారు. ఒకరికి ఒకరికి సాయం చేసుకోవడం లేదని మిగిలిన ఇంటి సభ్యులతో బుకాయించినా, కొన్ని సందర్భాలలో వీరిని నిలదీసినప్పుడు ‘అది మా స్ట్రేటజీ’ అంటూ తప్పించుకునే వారు. ఈ ఇద్దరికీ ఆ తర్వాత జెస్సీ జత కలిశాడు. ముగ్గురూ కలిసి గూడుపుఠాణీ చేస్తున్నారంటూ కొందరు వీరికి ముద్దుగా త్రిమూర్తులు అనే పేరూ పెట్టారు. అయితే, రెండు వారాల క్రితం బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ కారణంగా జెస్సీ, సిరి ఒక్కటైపోవడం, ఆ గేమ్ లో షణ్ముఖ్ జీరో కావడంతో అతనికి వీరిద్దరి మీద కసి పెరిగిపోయింది. వీళ్ళ కారణంగా తాను గేమ్ లో వెనకబడి పోయాననే భావన షణ్ణుకు బాగా కలిగింది. అక్కడి నుండి తానేమిటో చూపించాలనే పట్టుదలతో వీళ్ళకూ దూరంగానే ఉంటున్నాడు. అదే సమయంలో సిరిని, జెస్సీని ఇన్ డైరెక్ట్ గా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ రెండు మూడు రోజులుగా సిరితో షణ్ణు ప్రవర్తిస్తున్న తీరు మిగిలిన ఇంటి సభ్యులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
సిరిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక్కోసారి అందరి ముందు గుంజీలు కూడా తీస్తున్న షణ్ణు, తనను మానసికంగా ఒత్తిడికి లోను చేస్తున్నాడని సిరి సైతం గుర్తించింది. అందరి ముందు షణ్ణు తనను కావాలని కించపరుస్తున్నాడనే భావనకు సిరి వచ్చింది. దాంతో అతనిపై ఫేక్ అంటూ, స్నేహనికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఎదురు దాడికి దిగింది. కెప్టెన్ గా ఉన్నాడు కాబట్టి, ఇంటిలోని వ్యతిరేకులను తన వైపు తిప్పుకోవడం కోసం సిరితో షణ్ణు హార్ష్ గా ప్రవర్తించాడా? లేక నిజంగానే అతనికి సిరి ప్రవర్తన నచ్చలేదా అనేది తెలియాల్సి ఉంది. మరొక రోజుతో షణ్ముఖ్ కెప్టెన్సీ గడువు పూర్తయిపోతుంది కాబట్టి, తిరిగి అతను సిరిని దగ్గరకు తీసుకుంటే… ఈ వారం చేసిందంతా నటన అనుకోవాల్సి ఉంటుంది. లేదంటే వారి మధ్య దూరం మరింతగా పెరిగే ఆస్కారం ఉంది. చూద్దాం… ఏం జరుగుతుందో!!