బిగ్ బాస్ సీజన్ 5లో తొలిసారి రెండు రోజుల పాటు సన్నీ పూర్తి స్థాయిలో సహనం కోల్పోయాడు. అభయ హస్తం టాస్క్ లో భాగంగా చివరిలో జరిగిన ‘వెంటాడు – వేటాడు’ ఆటలో సంచాలకుడు జెస్సీ నిస్సహాయత కారణంగా సన్నీ – మానస్ బలయ్యారు. బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ ను తనకు అనుగుణంగా మలుచుకుని జెస్సీ కొంత పక్షపాతం చూపించాడు. అయితే మానస్ ఒకానొక సమయంలో సంయమనం పాటించినా, సన్నీ మాత్రం ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. పైగా ‘నువ్వు ఓడిపోయావ్ కాబట్టే అక్కడ ఉన్నావ్’ అంటూ శ్రీరామ్ ట్రిగ్గర్ చేసే సరికీ ఇంకా కృంగిపోయాడు. జెస్సీ చేసిన తప్పును నిదానంగా ఒక్కో ఇంటి సభ్యుడికీ సన్నీ వివరించి ఉంటే బాగుండేది కానీ ఆ బ్యాగేజీని మర్నాడు కూడా మోస్తూ అందరితో డిటాచ్ అయిపోయాడు. ‘తాము రెగ్యులర్ గా చూస్తున్న సన్నీ ఇతను కాదు!’ అనే అభిప్రాయానికి మెజారిటీ సభ్యులు వచ్చేలా ప్రవర్తించాడు. అయితే శ్రీరామ్ తో విరోధం ఉన్న కాజల్, మానస్ కలిసి సన్నీని ఓదార్చే ప్రయత్నం చేశారు. బిగ్ బాస్ హౌస్ లో రవి చాలా తెలివిగా, స్పష్టంగా తన గేమ్ ఆడుతున్నాడని, ముఖానికి మాస్క్ పెట్టుకుని శ్రీరామ్ గేమ్ ప్లే చేస్తున్నాడని వారు ముగ్గురూ అభిప్రాయ పడ్డారు. అంతేకాదు… శ్రీరామ్ కు ‘సంగీతం మాస్టర్’ అంటూ ఓ బిరుదునీ సన్నీ ఇచ్చేశాడు. ఇక 54వ రోజు రకరకాల ఫ్లేవర్స్ ఉన్న చిక్కని, చక్కని తాజ్ మహల్ చాయ్ పత్తీని బిగ్ బాస్ గిఫ్ట్ గా ఇవ్వడంతో మంచి టీ రుచిని ఇంటి సభ్యులంతా ఆస్వాదించారు.
నా స్మార్ట్ ఫ్రిజ్ లో ఏముంది!?
ఈవారం లగ్జరీ బడ్జెట్ టాస్క్ ను మెమొరీ ప్రధానం బిగ్ బాస్ నిర్వహించాడు. దీనికి ‘నా స్మార్ట్ ఫ్రిజ్ లో ఏముంది?’ అనే పేరు పెట్టాడు. ఓ ఫ్రిజ్ లో కొన్ని ఐటమ్స్ ను పెట్టి, ఒకసారి వాటిని చూసి, గుర్తుపెట్టుకుని, దగ్గరలో ఉన్న టేబుల్ మీది అవే ఐటమ్స్ ను ఖాళీగా ఉన్న మరో ఫ్రిజ్ లో అదే ప్లేస్ లో పెట్టాలని బిగ్ బాస్ ఆదేశించాడు. ఈ టాస్క్ లో కాజల్, యాని, సిరి, విశ్వ, మానస్ పాల్గొన్నారు. ఈ గేమ్ లో ఓ మాదిరి సక్సెస్ అయ్యి, గులాబ్ జామ్, పన్నీర్, మ్యాగీ, బిస్కెట్స్, పీనెట్ బటర్స్ వంటి తినుబండారాలను పొందగలిగారు.
Read Also : పునీత్ రాజ్ కుమార్ మృతి… పేద వ్యక్తి జీవితంలో వెలుగు
హౌస్ లో కొత్త త్రిమూర్తులు!
బిగ్ బాస్ హౌస్ లో రాబోయే రోజుల్లో ఇండిపెండెంట్ గా గేమ్ ఆడితే గెలవడం కష్టం అనే నిర్ణయానికి చాలా మంది వచ్చేశారు. ఇప్పటికే సిరి, షణ్ముఖ్, జెస్సీ ఓ టీమ్ గా ఏర్పడి, ఒకరిని ఒకరు సేవ్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా వ్యక్తిగతంగా గేమ్ ఆడుతున్న తాను నష్టపోతున్నానని యానీ మాస్టర్ వాపోతోంది. అయితే ఆమె కూడా ఏదో ఒక టీమ్ లో, ఎవరో ఒకరితో చేతులు కలుపక తప్పదని శ్రీరామ్ హితబోధ చేశాడు. అదే సమయంలో యానీ మాస్టర్ కు అవకాశం చిక్కినప్పుడల్లా తాను సాయం చేస్తూనే ఉన్నానని, అయినా ఆమె ఎవరూ తనకు హెల్ప్ చేయడం లేదన్నట్టుగా మాట్లాడుతోందని మానస్ వాపోయాడు. ఇక రవి, కాజల్, మానస్ సైతం ఓ టీమ్ గా ఏర్పడే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో తమను మిగిలిన ఇంటి సభ్యులు త్రిమూర్తులుగా పేర్కొంటారేమోననే సందేహం వారికి కలిగింది. అయితే అందులో తప్పేముందనే భావనా ఆ ముగ్గురు వ్యక్తం చేశారు. సో… ఇప్పుడు హౌస్ లో త్రిమూర్తులు -1, త్రిమూర్తులు -2 అని రెండు బ్యాచెస్ ఏర్పడబోతున్నాయన్న మాట.
వరెస్ట్ పెర్ఫార్మర్ సన్నీ!
54వ రోజున బిగ్ బాస్… హౌస్ లోని సభ్యులలో వరెస్ట్ పెర్ఫార్మర్ ను ఎంపిక చేసి జైలుకు పంపే పని పెట్టుకున్నాడు. దాంతో సన్నీ గత రెండు రోజుల ప్రవర్తనను దృష్టిలో పెట్టుకుని రవి, సిరి, జెస్సీ అతన్ని వరెస్ట్ పెర్ఫార్మర్ గా పేర్కొన్నారు. మరో వైపు షణ్ముఖ్, శ్రీరామ్, విశ్వ.. కాజల్ ను వరెస్ట్ పెర్ఫార్మర్ గా డిక్లేర్ చేశారు. వీరిద్దరికీ సమానమైన ఓట్లు రావడంతో కెప్టెన్ కు తుది నిర్ణయం తీసుకునే హక్కును బిగ్ బాస్ ఇచ్చాడు. ఆ సమయంలో సన్నీ, మానస్ తో సిరి, షణ్ముఖ్ వాదోపవాదాలకు దిగారు. చివరకు యానీ మాస్టర్ సన్నీ జైలుకు వెళ్ళాలని తాను కోరుకుంటున్నానని చెప్పడంతో అతను జైలుకు వెళ్ళాడు. బిగ్ బాస్ హౌస్ లో విపరీతంగా మాటల యుద్ధం జరుగుతున్నా షణ్ముఖ్ ప్రేక్షక పాత్ర వహించడం చాలామందికి నచ్చలేదు. కెప్టెన్ గా ఉండి హౌస్ ను కంట్రోల్ చేయాల్సింది పోయి, అతనూ వ్యూహాత్మక మౌనం దాల్చడంపై నాగార్జున శనివారం ఏమైనా క్లాస్ తీసుకుంటాడేమో చూడాలి.