NTV Telugu Site icon

లహరి ఎలిమినేషన్ కు కారణం అదేనా!?

Lahari

బిగ్ బాస్ సీజన్ 5 లో మూడో వ్యక్తి ఎలిమినేషన్ సెప్టెంబర్ 26వ తేదీ రాత్రి జరిగిపోయింది. సరయు, ఉమాదేవి బాటలోనే లహరి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేసింది. తాను ఎందుకు ఇంత త్వరగా బయటకు వచ్చానో తనకే తెలియలేదంటూ లహరి ఆశ్చర్యానికి లోనైంది. అసలు ఆట మొదలు పెట్టకముందే ఎలిమినేట్ కావడం పట్ల విచారాన్ని వ్యక్తం చేసింది. అయితే ఇంతవరకూ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్‌ అయిన సభ్యులను ఓటింగ్ బట్టి చేశారా లేక వాళ్ళ యాటిట్యూడ్ ను బట్టి చేశారా అంటే… రెండో మాటే కరెక్టేమో అనిపిస్తుంది. సరయు, ఉమాదేవి తరహాలోనే లహరి కూడా బిగ్ బాస్ హౌస్ లో యాటిట్యూడ్ చూపించిందనేది వ్యూవర్స్ చెబుతున్న మాట. అవసరానికి మించి ఆవేశం చూపడం, ఎక్కడ తగ్గాలో తెలుసుకోకపోవడం, ఠక్కున ఎదుటి వారు చెప్పింది నమ్మేయడమే లహరి ఎలిమినేషన్ కు కారణమనే వాదన బాగా వినిపిస్తోంది. నిజానికి లహరి ఎలిమినేషన్ అవుతోందని ఓ రోజు ముందే ప్రచారం జరిగింది. అయితే కొందరు మాత్రం లహరి బదులు బిగ్ బాస్ ఈ వారం ప్రియను బయటకు పంపే ఛాన్స్ ఉందని అనుకున్నారు. దానికీ కారణం లేకపోలేదు. నిజంగా లహరిని బిగ్ బాస్ బయటకు పంపాలనుకుంటే… ఆమెను కన్ఫెషన్ రూమ్ కు పిలిచి, ప్రియ – రవి మధ్య జరిగిన సంభాషణను చూపించి ఉండే వాడు కాదని, ఆమెను మరికొన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగించాలనే అలా చేశాడనీ కొందరు భావించారు. కానీ లహరిని హౌస్ నుండి బయటకు పంపేముందు ఆమె కళ్ళు తెరిపించే పని బిగ్ బాస్ చేశాడు. దీంతో ఇక ఇప్పటి నుండి రవి – ప్రియా మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరిగే ఆస్కారం ఉంది.

Read Also : అనుకున్న సమయానికే “కేజిఎఫ్-2”

మరోసారి టార్గెట్ అయిన షణ్ణు – సిరి!
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లక ముందు నుండే షణ్ముఖ్, సిరి మధ్య మంచి స్నేహం ఉంది. దాంతో వారిద్దరూ కొన్ని గేమ్స్ లో ఒకరికి ఒకరు సపోర్ట్ గా నిలిచారు. ఇది కరెక్ట్ కాదని కొందరు వారిద్దరినీ టార్గెట్ చేస్తూ మాట్లాడేసరికీ సిరి మాట ఎలా ఉన్నా… షణ్ముఖ్ మాత్రం ఆమెను కొంత దూరంలో పెట్టే ప్రయత్నం చేశాడు. దానిని గుర్తించిన సిరి ఆ విషయాన్ని కూడా ఇష్యూ చేయడం మొదలెట్టింది. అయితే… బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన లహరి కూడా వీరిద్దరినే టార్గెట్ చేసింది. సిరి చెప్పిందని తనను నామినేట్ చేయడం కరెక్ట్ కదంటూ ‘షణ్ణూ ఏంట్రా ఇది’ అని ప్రశ్నించింది. చిత్రం ఏమంటే… నాగార్జున సైతం ‘షణ్ణూ ఏంట్రా ఇది’ అనే మాటను ఊతపదంగా మార్చేసుకున్నారు. లహరి ఆరోపణలను షణ్ణు, సిరి ఖండించారు కానీ తన వాదనకే లహరి స్టికాన్ అయ్యింది. ఇక లహరి యాటిట్యూడ్.. ఆరియానా ఇంటర్వ్యూ ప్రోమోలో మరోసారి బయటపడింది. ‘కంటెంట్ కోసమే ఆర్జే కాజల్ తాపత్రయపడుతోంద’ని లహరి చెప్పినప్పుడు… ‘మీరే ఆమె వెనుక పడుతున్నట్టు అనిపిస్తోంద’ని అరియానా ఎదురు ప్రశ్నించింది. ‘అయితే… మీరు షోను సరిగా చూడలేదన్న మాట’ అంటూ లహరి గట్టిగా బదులివ్వడంతో అరియానా నోరెళ్ళబెట్టింది.

ఆట – పాటలతో సాగిన ఆదివారం
శనివారం కాస్తంత సీరియస్ గా షోను ప్రారంభించిన నాగార్జున, ఆదివారం నాటికి ఓ కూల్ అట్మాస్ఫియర్ ను క్రియేట్ చేశాడు. స్పోటిఫై ఫిల్మ్ సాంగ్స్ తో షోను స్టార్ట్ చేశాడు. హౌస్ లోని సభ్యులను రెండు గ్రూప్స్ గా చేసి… మ్యూజిక్ ను ప్లే చేసి పాటను గెస్ చేయమని కోరాడు. అలానే తమకు ఇష్టమైన పార్ట్ నర్ తో డాన్స్ చేయమని చెప్పాడు. ఇందులో సిరి, జస్వంత్, విశ్వ ఉన్న టీమ్ ‘ఎ’ విజయం సాధించింది. ఇక ఆ తర్వాత కార్ స్టీరింగ్ ను ఎలిమినేషన్స్ లో ఉన్న మానస్, ప్రియ, లహరి చేతికి ఇచ్చాడు. అందులో మానస్ సేఫ్ అయ్యాడు. ఇక సెకండ్ గేమ్ లో ఇద్దరిద్దరి చొప్పున ఓ చోటకు పిలిచి వాళ్ళ కళ్ళకు గంతలు కట్టి, చేతి స్పర్శతో వారి ముందున్న వస్తువును గెస్ చేసి, వెనక వారికి ఎక్స్ ప్లైన్ చేయమని నాగార్జున చెప్పాడు. అందులో ప్రియాంక – శ్వేతవర్మ, ప్రియ – లహరి, కాజల్ – రవి తమ చేతికి అందిన వాటిని కరెక్ట్ గా గుర్తించి చెప్పగలిగారు. వారి కారణంగా ఈ సారి గ్రూప్ ‘బి’ విజయం సాధించింది. ఈ గేమ్ అయిన తర్వాత నాగార్జున రెండు టార్చ్ లైట్స్ ను తీసుకుని ఎవరి లైట్ గ్రీన్ గా మారితే వారు సేఫ్ అని చెప్పాడు. అందులో ప్రియా పేరున్న టార్చ్ గ్రీన్ కలర్ కు మారడంతో ఆమె సేఫ్ అయ్యింది. అయితే… ఎలిమినేట్ అయిన తర్వాత లహరి కాస్తంత స్ట్రాంగ్ గానే బిహేవ్ చేసింది. ‘ఇట్స్ ఓకే’ అంటూ తనను ఓదార్చడానికి వచ్చిన వారిని తానే ఓదార్చింది. ఇక బయటకు వెళ్ళే క్రమంలో భాగంగా నాగార్జున దగ్గరకు వేదికపైకి వచ్చిన లహరి శ్రీరామ్ ను తనకు డెడికేట్ చేస్తూ ఓ పాట పాడమనగానే కోరగానే… ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ పాటను పాడి ఆకట్టుకున్నాడు శ్రీరామ్. లేడీ కంటెస్టెంట్స్ వరుసగా ముగ్గురు బిగ్ బాస్ హౌస్ నుండి ఒకరి తర్వాత ఒకరు ఎలిమినేట్ అయిపోవడంతో ఇప్పుడు వారి సంఖ్య మైనారిటీలో పడిపోయింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 16 మంది ఉండగా, అందులో మగవాళ్ళు 9 మంది, ఆడవాళ్ళు ఏడుగురు మాత్రమే. సో… బిగ్ బాస్ షోను మరింత ఆసక్తికరంగా మార్చడం కోసం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరైనా లేడీ ని వచ్చే వారం హౌస్ లోకి పంపుతారేమో చూడాలి!