జెస్సీ లో నాయకత్వ లక్షణాలు లేవని 53వ రోజు మరోసారి రుజువైంది. ఎనిమిదో వారం కెప్టెన్సీ టాస్క్ లో పోటీ షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, యానీ, మానస్, సన్నీ మధ్య జరిగింది. ‘వెంటాడు – వేటాడు’ పేరుతో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు టాస్క్ ఇచ్చారు. రెండు సర్కిల్స్ లో ధర్మోకోల్ బాల్స్ ఉన్న బ్యాగ్స్ ను ధరించి పోటీదారులంతా ఒకరి వెనుక ఒకరు నడుస్తూ ఎదుటి వారి బ్యాగ్స్ లోంచి ధర్మో కోల్ బాల్స్ ను పారేయాలి. ప్రతి రౌండ్ లోనూ బజర్ మోగే సమయానికి ఎవరి బ్యాగ్ లో తక్కువ ధర్మోకోల్ బాల్స్ ఉంటే వారు ఎలిమినేట్ అవుతారు. అయితే గేమ్ ను సరిగా అర్థం చేసుకోవడంలోనూ, ఆడించడంలోనూ జెస్సీ విఫలమయ్యాడు. దాంతో మొదటి రౌండ్ పూర్తి కాగానే బిగ్ బాస్ జెస్సీని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి, గేమ్ గురించి మరోసారి వివరించాడు. ఆ తర్వాత కూడా కంటెస్టెంట్స్ తో గేమ్ ను జెస్సీ సరిగా ఆడించలేకపోయాడు. బిగ్ బాస్ చెప్పకపోయినా కొన్ని కీలక నిర్ణయాలను సంచాలకుడిగా నువ్వే తీసుకోవాలి అని రవి… జెస్సీకి గట్టిగా చెప్పినా… ఆ పని అతను చేయలేకపోయాడు. దాంతో సన్నీ-మానస్ కలిసి గేమ్ ఆడుతున్నారని శ్రీరామ్ ఆరోపణ చేశాడు. మొదటి రౌండ్ లో బయటకు వెళ్ళిన సన్నీ, మానస్ కు సపోర్ట్ చేయడాన్ని శ్రీరామ్ తప్పుపట్టడమే కాకుండా సన్నీని ఇండివిడ్యువల్ ప్లేయర్ కాదంటూ హేళన చేశాడు. ఆ కారణంగా వారిద్దరి మధ్య మాటా – మాటా పెరిగిపోయింది. ఆ తర్వాత రౌండ్ లో సర్కిల్ నుండి బయటకు వచ్చారనే ఆరోపణతో శ్రీరామ్ -మానస్ ఇద్దరినీ జెస్సీ ఆట నుండి తొలగించాడు. మానస్ ను బయటకు పంపడం కరెక్ట్ కాదంటూ సన్నీ వాదనకు దిగాడు. దాంతో అతన్ని ఇంటి సభ్యులంతా కలిసి కంట్రోల్ చేయాల్సి వచ్చింది.
ఆట నుండి వైదొలగిన యానీ మాస్టర్!
చివరకు ఆటలో షణ్ముఖ్, సిరి, యానీ మాస్టర్ మిగిలారు. అయితే… షణ్ణు – సిరి కలిసి తనను ఒంటరిని చేశారనే కోపంతోనూ, ఇద్దరూ కలిసి గ్రూప్ గా గేమ్ ఆడుతున్నారనే అక్కసుతోనూ యానీ మాస్టర్ బజర్ సౌండ్ రాకముందే ఆట నుండి వైదొలగారు. మిగిలిన ఇంటి సభ్యులు గివ్ అప్ ఇవ్వొద్దని ఎంత చెప్పినా, ఫైట్ చేయమని కోరినా… ఇలా గ్రూప్ గా ఆడేవారితో తాను పోటీ పడనని, ఇలాంటి వారి వల్ల తాను ఎప్పటికీ బిగ్ బాస్ హౌస్ కు కెప్టెన్ కాలేనని యానీ మాస్టర్ వాపోయింది. చివరి రౌండ్ లో షణ్ముక్ – సిరి మధ్య జరిగిన పోరులో షణ్ణు విజయం సాధించాడు. దాంతో ఎనిమిదో వారం ఇంటి కెప్టెన్ గా అతను ఎంపికయ్యాడు. ఆ తర్వాత ప్రతి ఒక్కరినీ కలిసి, తనకు సహరించాల్సిందిగా షణ్ణు కోరాడు. మొత్తం మీద తనను అందరూ ఎలిమినేట్ చేసిన దగ్గర నుండి అసలైన ఆట మొదలు పెట్టిన షణ్ణు పట్టుదలతో ఫోకస్డ్ గా ఆడి ఎట్టకేలకు కెప్టెన్ అయ్యాడు. షణ్ణు వెనుకే నీడలా అతన్ని ఫాలో అవుతున్న సిరి పట్ల మాత్రం ఈసారి కొంత నెగెటివ్ ఓపీనియన్ చూసే వ్యూవర్స్ కు, బిగ్ బాస్ హౌస్ లోని వారికి కలిగిన మాట వాస్తవం. ఇక శ్రీరామచంద్ర తమను టార్గెట్ చేశాడనే అక్కసుతో అతన్ని ఎలాగైనా రాబోయే టాస్క్ లలో కలిసి కట్టుగానే ఓడిద్దామని మానస్, సన్నీ శపథం చేసుకోవడం 53వ రోజుకు సంబంధించిన కొసమెరుపు!